* ఐదుసార్లు ఐపీఎల్ విజేత ముంబై
* ఎదురేలేదంటున్న గవాస్కర్
భారత ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను మించిన జట్టు మరొకటి లేదని భారత మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ చెబుతున్నారు. గత 13 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఆరోసారి టైటిల్ నెగ్గినా ఆశ్చర్యం లేదని, అత్యంత విజయవంతమైన జట్టుగా నిలవటానికి తగిన హంగులు, అర్హత కేవలం ముంబై ఇండియన్స్ కు మాత్రమే ఉన్నాయని లిటిల్ మాస్టర్ అంటున్నారు.
14వ సీజన్ ఫేవరెట్ ముంబై..
ఏప్రిల్ 9 నుంచి ఏడువారాలపాటు జరుగనున్న ఐపీఎల్ 14వ సీజన్ టోర్నీలో సైతం ముంబై ఇండియన్సే హాట్ ఫేవరెట్ అని, మిగిలినజట్లలో ఏ జట్టు విజేతగా నిలవాలన్నా ముంబైను అధిగమించితీరాలని…అయితే..ముంబైని కొట్టగలిగేజట్టు ఏదని గవాస్కర్ ప్రశ్నించారు.
Also Read : వన్డే ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్ల జోరు
ప్రభావశీల క్రికెటర్ల సముదాయం…
ఇటీవలే ఇంగ్లండ్ తో ముగిసిన పాంచ్ పటాకా టీ-20 సిరీస్, తీన్మార్ వన్డే సిరీస్ ల్లో భారత్ విజేతగా నిలవడంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, యంగ్ గన్స్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, రాహుల్ చహార్ ప్రధానపాత్ర వహించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని గవాస్కర్ చెప్పారు.
ఇంగ్లండ్ తో రెండో టీ-20లో ఇషాన్ కిషన్ 32 బాల్స్ లోనే 56 పరుగులు, నాలుగో టీ-20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 31 బాల్స్ లో 57 పరుగులు సాధించారు. సూర్యకుమార్ మూడుమ్యాచ్ ల్లో 89 పరుగులు సాధించడం ద్వారా మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డీ కాక్, యంగ్ గన్ ఇషాన్ కిషన్, వీరబాదుడు సూర్యకుమార్, పాండ్యా బ్రదర్స్ తో ముంబై బ్యాటింగ్ లైనప్…అరివీరభయంకరంగా కనిపిస్తోంది.
Also Read : రిషభ్ పంత్ కు ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు
డైనమైట్లు పాండ్యా బ్రదర్స్…
ఇంగ్లండ్ తో పాంచ్ పటాకా టీ-20 సిరీస్ లో హార్థిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సత్తా చాటుకొన్నాడు. టీ-20 సిరీస్ లోని 5 మ్యాచ్ ల్లో 86 పరుగులు, తీన్మార్ వన్డే సిరీస్ లో 100 పరుగులు సాధించడం ద్వారా తన సూపర్ ఫామ్ ను చాటుకొన్నాడు. స్పిన్ ఆల్ రౌండర్ కృణాల్ తన అరంగేట్రం వన్డే మ్యాచ్ లోనే సుడిగాలి హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా పేస్ బౌలింగ్ విభాగంలో కీలకపాత్ర పోషించనున్నాడు.
ముంబై తుదిజట్టు 11 మంది ఆటగాళ్లలో తమదైన రోజున ప్రతిఒక్కరూ ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించే సత్తా ఉన్నవారేనని, తమ ఆటతీరుతో ప్రభావం కనబరచడంలో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల తర్వాతే ఎవరైనా అని గవాస్కర్ కితాబిచ్చారు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై 2021 సీజన్ లో తన ప్రారంభమ్యాచ్ ను చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది.
Also Read : మహిళా టీ-20లో భారత బుల్లెట్