- బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నం
- ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపణ
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ప్రజాస్వామ్యానికి బీజేపీ కంటగింపుగా మారిందని మమత దుయ్యబట్టారు. బెంగాల్లో రెండో దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశంలోని ప్రాంతీయ పార్టీల అధ్యక్షులకు లేఖాస్త్రాలు సంధించారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని ఆమె లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యంపైనా, రాజ్యాంగంపైనా బీజేపీ దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాలని, దేశ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా మారాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపారు.
ప్రాంతీయ పార్టీలకు చుక్కానిలా మమత:
దిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కాదని, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ కు సర్వాధికారాలు కట్టబెడుతూ ప్రవేశపెట్టిన వివాదాస్పద చట్టాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా మమత అభివర్ణించారు. బీజేపీయేతర పార్టీలు తమ రాజ్యాంగపరమైన హక్కులు, స్వేచ్ఛను వినియోగించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను నిర్వీర్యం చేస్తోందని బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. దేశంలో ఏక పార్టీ పాలనను స్థాపించాలనుకుంటోందని లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకంకావాల్సిన సమయం దగ్గరలోనే ఉందని తాను గట్టిగా విశ్వసిస్తున్నట్టు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఈ పోరాటంలో మనస్ఫూర్తిగా కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు దీదీ తన లేఖలో స్పష్టం చేశారు.
రోజు రోజుకి పెరుగుతున్న నిత్యవసరాల ధరలు, అడ్డూ అదుపూ లేని పెట్రోధరల పెంపుతో పాటు బ్యాంకుల ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల విక్రయం లాంటి పలు అంశాలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి, అంతేకాకుండా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీలను అస్థిర పరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను మమతా బెనర్జీ లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం.
మమతా బెనర్జీ లేఖలు రాసిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధినేత స్టాలిన్, శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అయితే పంజాబ్ హర్యానాలకు చెందిన ప్రాంతీయ పార్టీలకు లేఖలు రాయలేదు.
ఇదీ చదవండి: బెంగాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం