- ఏప్రిల్ 9న భారీ బహిరంగ సభ
- ఏర్పాట్లు చేస్తున్న అభిమానులు
- భారీగా తరలిరానున్న అభిమానులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల నిర్వహించనున్న సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఏప్రిల్ 9న ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్స్ లో షర్మిల సభను నిర్వహించనున్నారు. అదే రోజు పార్టీ ప్రకటన, విధివిధానాలు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం సభకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. షర్మిల ఇప్పటికే తెలంగాణలోని జిల్లాలా వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు.
సభకు భారీగా తరలిరానున్న అభిమానులు:
ఇక ఖమ్మం సభ నుంచి రాజకీయ పార్టీ ప్రకటించబోతున్న నేపథ్యంలో ఆ సభకు లక్షమంది అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి అభిమానులు తరలిరానున్నారు. బహిరంగ సభకు అనుమతి లభించడంతో సభ ఏర్పాట్లు, అభిమానులు, కార్యకర్తలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేయనున్నారు. పార్టీ ప్రకటన అనంతరం తెలంగాణలో భారీగా రాజకీయ సమీకరణలు మారనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
ఆనందంలో వైఎస్ అభిమానులు :
కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సభకు అనుమతి వస్తుందా లేదా అన్న మీమాంసలో షర్మిల ఉన్నారు. ఆమె అభిమానులు కూడా సభ నిర్వహణపై ఆందోళనగా ఉన్న సమయంలో సభకు పోలీసుల నుంచి అనుమతి రావడంతో వైఎస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:పాలేరు నుంచి పోటీ చేస్తా