Friday, January 3, 2025

తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలల మూసివేత

  • శాసనసభలో సబితా ఇంద్రారెడ్డి ప్రకటన
  • తెలంగాణలో 700 మంది విద్యార్థులకు కరోనా
  • ఏపీలో కొవిడ్ వ్యాప్తిపై అవగాహనా కార్యక్రమాలు
  • 45 ఏళ్లు పైబడిన వారికి ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సినేషన్

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో విద్యార్థులు  కరోనా బారిన పడుతున్న పలు ఉదంతాలు  వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పదో తరగతిలోపు పాఠశాలలను, రెసిడెన్షియల్ పాఠశాలలను వెంటనే మూసివేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 700 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై అధ్యయనం చేసిన ప్రభుత్వం పాఠశాలలు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.

పిల్లల్లో రోగనిరోధక శక్తి సాధారణంగా ఎక్కువగా ఉంటుందని అయితే కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నా బయటికి కనిపించవని ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. విద్యార్థులు క్లాసులకు హాజరై ఇళ్లకు తిరిగి వెళ్లేటపుడు ప్రజలకు, కుటుంబ సభ్యులకు కరోనా సోకేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు అంచనావేస్తున్నారు. వీటితో పాటు  సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాకపోకలు ఎక్కువగా సాగించడం కూడా కరోనా వ్యాప్తికి కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రోజుకి 300 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అవుతున్నాయి. ఇది కరోనా సెకండ్ వేవ్ స్ట్రెయినేమోనని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ ఏరకానికి చెందినదో నిర్థరించేందుకు పరీక్షలు చేస్తున్నారు. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకున్నా కొవిడి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి:ఇండియాలో కరోనా సెకండ్ వేవ్

అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్:

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,  సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వలన కలిగే నష్టాల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం కోసం ప్రభుత్వ శాఖలను  సమన్వయపరచాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వార్డు, గ్రామ సచివాలయం పరిధిలో 60 ఏళ్ళు, 45నుండి 59 సంవత్సరాల వయసు ఉన్న వారికీ వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు.   కరోనా కట్టడికి ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలు అధికారులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలను చైతన్యపరిచేందుకు వాణిజ్య, వ్యాపార, ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం వహించాలని కోరారు.

ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్:

కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద 45 ఏళ్లు, అంత కంటే ఎక్కువ వయసు వారికి ఏప్రిల్‌ ఒకటి నుంచి వ్యాక్సినేషన్ వేయనున్నట్లు ఈ రోజు (మార్చి 23)  కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కరోనా టీకా కార్యక్రమం కింద మొదటి దశలో పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి టీకాలు పంపిణీ చేస్తోంది. రెండో దశలో 60 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 నుంచి 59 సంవత్సరాల వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.  రెండో దశలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న తరుణంలో యువత, 45 ఏళ్లు పైబడిన వారిని కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని పలు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని  అభ్యర్థించాయి. 

ఇదీ చదవండి:జనతా కర్ఫ్యూ పెట్టిన రోజు

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles