• ప్యాకేజి ఇచ్చామన్న కేంద్ర మంత్రి
• విభజనచట్టంలోని అంశాలు అమలవుతున్నాయని కితాబు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ పునర్విభజన చట్టాన్ని ఎంత మేరకు అమలు చేశారో స్పష్టం చేయాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని లోక్ సభలో ప్రశ్నించారు. దీనికి సంబంధిచి కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానం అసంపూర్తిగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పందించారు. పునర్విభజన చట్టంలోని పలు అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాల్సినవని సమాధానమిచ్చారు. అలాగే ప్రత్యేక హోదాపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని 14 వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వడం ఇక కుదరని స్పష్టం చేశారు.
Also Read: ఎన్నికలు జరపాలని ఎస్ఈసీని ఆదేశించలేమన్న హైకోర్టు
పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు:
పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు వివిధ దశల్లో అమల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పట్టే అంశాలని అన్నారు. విభజన హామీల అమలుకు వివిధ శాఖలతో సమీక్ష చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సుమారు 24 సమీక్షా సమావేశాలు జరిగాయని అన్నారు.
ప్యాకేజితో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా :
ప్రత్యేక ప్యాకేజితో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయన్నారు.
Also Read: ఏపీలో మూగ జీవాలకు అంబులెన్స్ సేవలు