అటు దిల్లీలో రైతు ఉద్యమం – ఇటు విశాఖపట్నంలో ఉక్కు ఉద్యమం ఉధృతంగానే సాగుతున్నాయి. రైతు ఉద్యమాన్ని ప్రతి రాష్ట్రంలో నడిపించి, జాతీయ ఉద్యమంగా తీర్చిదిద్దుతామని ఉద్యమ ప్రధాన నాయకుడు తికాయిత్ అంటున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోడానికి జాతీయ స్థాయిలో ప్రత్యక్ష పోరాటం చేస్తామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ చెబుతున్నారు. ప్రైవేటీకరణ అంటే? దేశాన్ని కొల్లగొట్టడమే అని జాతీయ, రాష్ట్ర స్థాయి కార్మిక నాయకులందరూ మండి పడుతున్నారు.
కేటీఆర్ ముందడుగు
విశాఖ ఉక్కుఉద్యమంలో పాల్గొంటానని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అంటున్నారు. జనసేన నేత పవన్ కల్యాణ్ కూడా స్వరం కొంచెం పెంచారు. అది సరిపోదు. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి మద్దతు ప్రకటిస్తున్నాయి. వివిధ సంఘాలు, పార్టీలు కూడా దేశ వ్యాప్తంగా సంఘీభావాన్ని తెలుపుతున్నాయి. ఉద్యమానికి నైతిక మద్దతు ఒక్కటే సరిపోదని, భారీ పోరాటాల వల్లే లక్ష్యాన్ని సాధించుకోగలమని కార్మిక నాయకులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే, అది నెరవేరేనా? అనిపిస్తోంది. సమస్య పరిష్కారం కాకపోయినా, రైతు సంఘాలతో కేంద్రం కనీసం అనేకసార్లు చర్చలు జరిపింది. పలు ఆలోచనలను పంచుకుంది.
Also Read : బిగుస్తున్న ఉక్కు పిడికిలి
విరుచుకుపడుతున్న కేంద్ర మంత్రులు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో అటువంటి దాఖలా లేదు. పైపెచ్చు, ఉభయ సభల్లో రాష్ట్ర ప్రతినిధులు వివిధ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు, కేంద్ర మంత్రులు విరుచుకు పడుతున్నారు. ప్రైవేటీకరణే శరణ్యం అంటున్నారు. అన్ని నిర్ణయాలు జరిగిపోయాయని చెబుతున్నారు. సంపూర్ణ ప్రైవేటీకరణ కార్యరూపం దాల్చడమే ఇక తరువాయి అంటున్నారు. అనేక ఏళ్ళ పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడడం తప్ప, కేంద్ర వైఖరిని తప్పు పట్టి, కరాఖండిగా మాట్లాడడం లేదు.
స్థానిక నేతలే పట్టించుకుంటున్నారు
స్థానిక నేతలు, రాష్ట్ర నేతలు మాత్రమే ఉద్యమంలో పాల్గొంటున్నారు.విశాఖపట్నం వెళ్లి, స్టీల్ ప్లాంట్ వేదికగా చంద్రబాబు ఉద్యమంలోకి దిగలేక పోతున్నారు.కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించలేక పోతున్నారు.2019ఎన్నికల ముందు నరేంద్రమోదీని అధికారం నుంచి దించడం కోసం, ప్రతిపక్ష పార్టీలనన్నింటినీ ఏకం చేసి,దిల్లీలో నల్ల డ్రెస్ వేసుకొని నిరసనల పర్వం నడిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక మొదలైన రాష్ట్రాల్లో తిరిగి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
Also Read : సమ్మె నోటీసు ఇచ్చిన విశాఖ ఉక్కు పోరాట కమిటీ
మౌనం ఎందుకు బాబూ, పవన్?
ఇప్పుడు చంద్రబాబు ఎందుకు మౌనం పాటించారు? కేంద్రమంటే భయమా, అవసరమా? అని ఎందరో ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ముందుండి నడిపే శక్తి లేదా? ఆసక్తి లేదా? అనిపిస్తోంది. జనసేన నేత పవన్ కల్యాణ్ తీరు కూడా ఇంచుమించు అదే విధంగా ఉంది. అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశ పెట్టండి, ప్రైవేటీకరణను ఆపండి… అంటూ రాష్ట్రంపై ఒంటికాలుతో లేస్తున్నారు కానీ, ఆయన కాలు కదపడం లేదు. నిజానికి, ఉక్కు ఉద్యమాన్ని తన భుజాన వేసుకొని నడపాల్సిన బాధ్యత, స్వేచ్ఛ పవన్ కే ఉంది. ప్రతిపక్ష పాత్రను సంపూర్ణంగా పోషించడానికి వీలులేకుండా, తన చుట్టూ బంధాలు తానే వేసుకున్నారు.
బీజేపీతో బంధమే నష్టదాయకం
ఎప్పుడైతే బిజెపితో జత కలిశారో, అప్పుడే ఆ స్వేచ్ఛను కోల్పోయారు. తన ప్రతిపక్ష పాత్ర రాష్ట్రానికే పరిమితమై పోయింది. ఈయన భయపడాల్సిన అవసరం లేనేలేదు. ఈయనపై ఇంత వరకూ ఎటువంటి కేసులు లేవు. నిన్న గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ ఎన్నికల్లోనూ విశాఖవాసులు 3స్థానాల్లో జనసేనను గెలిపించారు. ఓటింగ్ శాతం కూడా ఆశాజనకంగా ఉంది. 2019ఎన్నికల్లో పవన్ ఆ ప్రాంతానికి చెందిన గాజువాక నుంచే పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ తిరిగి తన సత్తా ఏమిటో చూపించుకోవాల్సిన రాజకీయ అవసరం కూడా ఉంది.
Also Read : తీవ్ర ఉద్రిక్తంగా విశాఖ ఉక్కు ఆందోళన
ఉద్యమానికి పవన్ నాయకత్వం వహించవచ్చు
తను వేసుకున్న బంధనాల నుంచి బయటపడి, విశాఖపట్నం వేదికగా ఉక్కు ఉద్యమాన్ని ఆరంభించి, రాష్ట్రమంతా తిరిగి ప్రజలను చైతన్య పరిస్తే, ఉక్కు ఉద్యమానికి మహానాయకుడుగా పవన్ కు గొప్ప గుర్తింపు వస్తుంది. నిజంగా ప్రైవేటీకరణను ఆపగలిగితే? పవన్ చరిత్రలో మిగిలిపోతారు. రేపటి ఎన్నికల్లోనూ పొలిటికల్ మైలేజ్ పొందుతారు.పవన్ కు, -మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉద్యమంలో కలవండంటూ పిలుపు కూడా ఇచ్చారు. ఎవరో పిలుపు ఇచ్చేదాకా ఆగడం కాదు.తానే తొలి అడుగు వేసి, ముందుండి నడిపినవాడే మహానాయకుడవుతాడు.
అమృతరావు ఆదర్శం కావాలి
గుంటూరు జిల్లా విశదల అనే కుగ్రామానికి చెందిన అమృతరావు విశాఖపట్నం వెళ్లి, నిరాహార దీక్షకు దిగి, అప్పటి ఉక్కు ఉద్యమాన్ని మరో మలుపు తిప్పారు. తెన్నేటి విశ్వనాథం వంటి ప్రజా నాయకులు ఉద్యమాన్ని విస్తృతం చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మొండి వైఖరితో ఉందో, అప్పటి ప్రభుత్వం కూడా అంతే మొండి వైఖరితో ఉంది. ఉద్యమాల వేడికి, ప్రజాగ్రహానికి దిల్లీ పెద్దలు దిగిరాక తప్పలేదు. ఉక్కుమహిళ ఇందిరాగాంధీ కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. తెలుగువారందరూ కలిసి విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను సాధించుకున్నారు.
Also Read : విశాఖ ఉక్కుతో మీకేం సంబంధం?
వ్యక్తిగత లౌల్యాలు
ఇప్పుడు కూడా, రాజకీయాలకు, వ్యక్తిగత లౌల్యాలకు అతీతంగా , ఉద్యమాన్ని నడిపిస్తే, స్టీల్ ప్లాంట్ దక్కుతుంది. లేకపోతే, నూటికి నూరు శాతం ప్రైవేట్ పరమై పోతుంది. ఉద్యమాన్ని మహోద్యమంగా మలచడానికి, ఎవరి వెంటైనా నడవడానికి కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. విశాఖపట్నం ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక తన శక్తికి వంచన లేకుండా కృషి చేస్తోంది. ఆ శక్తి పెరగాలి. అన్ని శక్తులు ఏకమవ్వాలి. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా చర్చలు జరపాలి. అవసరమైతే, రాజకీయంగానూ పోరాటం చేయడానికి సిద్ధపడాలి. ఉద్యమాల పట్ల, ఉద్యమం నడిపే నాయకుల పట్ల ప్రజలకు విశ్వాసం కలగాలి.
విశ్వాసం పెంచే నాయకులు కావాలి
విశ్వాసాన్ని పెంచి పోషించే నాయకులు ముందుకు రావాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అనేక సూచనలు చేసింది. వాటిని కేంద్రం పెడచెవిన పెట్టకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర పాలకులదే. ప్రైవేటీకరణ వల్ల ఎంతో మేలు జరుగుతుందని కేంద్రం పదే పదే చెబుతోంది. ప్రైవేటీకరణను సమర్థిస్తూ లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ వంటి మేధావులు మాట్లాడుతున్నారు. విశాఖ ఉక్కు విషయంలో ప్రైవేటీకరణ అవసరం లేదు. కొంత సహకారం,స్నేహ హస్తం అందిస్తే, లాభాల బాట పడుతుందని రాష్ట్ర నాయకులు, కార్మిక సంఘాలతో పాటు పారిశ్రామిక రంగ నిపుణులు, మేధావులు చెబుతున్నారు. ఏది లాభం? ఏది నష్టం? ఏది మంచి, ఏది చెడు తెలియక కొందరు సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు.
Also Read : సమష్టి పోరాటమే విశాఖ ఉక్కుకు శ్రీరామరక్ష
నాయకులకు మేలుకొలుపు
నాయకులారా మేలుకోండి.. మేలుకొలపండి.. అంటూ మేధావులు హితోపదేశం చేస్తున్నారు.ప్రైవేటీకరణ ఆగేనా, విశాఖ ఉక్కు మిగిలేనా? అని, స్టీల్ ప్లాంట్ ను నమ్ముకున్న కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. అందరూ కలిసి పాల ముంచుతారా, నీట ముంచుతారా కాలం తెరపై చూద్దాం.
Also Read : ఉక్కు సంకల్పమే శరణ్యం