- “జో అచ్యుతానంద” పాడే వారేరీ
- నిద్ర లేమి వల్లే పాలు!
- ఆశల కోర్కెలలో పడక కూడా బోసి పోయింది
సంపాదన లేక ఒకరు, సంసార బాదరబందీల వల్ల మరొకరు సుఖమైన నిద్ర లేక ఎక్కడా లేని రోగాలు తెచ్చుకుంటున్నారు. బాల్యం లో తప్ప ఇప్పుడు సగటున ఆరు గంటలు కూడా నిద్రకు ఉపక్రమించని వారి కోసమే ‘వరల్డ్ స్లీప్ డే’ లు ఏర్పాటు చేశారు…రోజు కనీసం ఎనమిది గంటలు నిద్ర పోవాలని డాక్టర్లు మొత్తుకుంటున్నా ఎవరు వినడం లేదు. అసలు మేమే ఆ అరుగంటలు కూడా పడు కోలేకపోతున్నామని ఇంట్లో రాత్రి పన్నెండు గంటల వరకు టీవీ మార్మోగుతున్నప్పుడు ఇక మాకెల నిద్ర పడుతుందని ఆరోగ్య సూత్రాలు చెప్పే డాక్టర్లే లబో దిబొ మంటుంటే… ఇక సామాన్యుల మాట దేవుడెరుగు.
ఎలక్ట్రానిక్ పరికరం మోగుతుందేమో:
ఇంట్లో ఏ ఎలక్ట్రానిక్ పరికరం ఎప్పుడు చప్పుడు చేస్తుందోనని బిక్కు బిక్కు మని చూస్తూ, నిద్ర లేమితో గుండె పోట్లు తెచ్చుకుంటున్నారు. ఉదయం ఇంటి పని, వంట పనితో సతమతమయ్యే గృహిణులు పిల్లలను పడుకో బెట్టి వారి బెడ్ రూమ్ తలుపులు గట్టిగా పెట్టే సరికి రాత్రి పది గంటలు. ఉదయమే భర్త ఉద్యోగమో, సద్యోగమో వెలగ బెట్టాలి కాబట్టి వారికి ఆల్పాహారం తయారు చేయడానికి ఇడ్లి పిండో, దోశల పిండో రుబ్బడానికి గిర్రున మిక్సీ తిప్పేసరికి ఆ సౌండ్ కి బెడ్ రూంలో పడుకున్న భర్త “ఏమి కొంప మునిగిందో” అని గబుక్కున వంటింట్లోకి వచ్చే సరికి భార్య “హై స్పీడ్’ లో మిక్సీని గట్టిగా పెంచే సరికి ఉన్న నిద్ర పోయి…కోపంగా తిడదామంటే పొద్దున టిఫిన్ కూడా పెట్టదని, కిచెన్ లో సింక్ లో ముఖం మీద నీళ్లు చల్లుకుని దీనంగా భార్య వంక చూసే సుబ్బారావు లు చాలా ఇండ్లల్లో ఉంటారు!
Also Read: ఆడపడుచుల పుట్టింటి మమ ‘కారం’ !
వాషింగ్ మిషన్ చూడండి:
“ఆ వచ్చారా.. వాషింగ్ మిషన్ లో పిల్లల బట్టలు, మన బట్టలు వేయండి” అని పురమాయించడంతో కుప్పలుగా ఉన్న బట్టలను వాషింగ్ మిషన్ లో దఫాలా వారీగా వేస్తూ ఆ సౌండ్ ను భరిస్తూ కుర్చీలో కూలబడి కునుకు తీద్దామనే లోపే నీళ్ల మోటారు టాప్ ఓవర్ ప్లో అయి నీళ్ల సౌండ్ రావడం, మరో వైపు ఫ్రెషర్ కుక్కర్ లో పెద్ద సౌండ్ రావడం తో నిద్ర పోతే ఒట్టు! అన్నీ పనులు అయ్యే సరికి రాత్రి పన్నెండు! “ఆడదానిగా పుట్టే దాని కన్నా అడవిలో మానై పుట్టడం బెటర్” అంటూ గోనుక్కుంటున్న భార్య ను ఓదార్చి, పడుకుందామని అనుకునే లోపే పీడకలలు! ఆఫీసులో నిద్ర పోతున్న సుబ్బారావును లేపడానికి బాస్ తన టేబుల్ మీద ఉన్న టిఫిన్ బాక్స్ మీద ఒక రాయితో కొట్టి, ఆ సౌండ్ కు లేచిన తనను – చీవాట్లు పెడుతున్నట్టు వచ్చిన కల నిజం కాదని, వాష్ రూంకు వెళ్లి గట్టిగా ముఖం కడుక్కొని వాచ్ వైపు చూస్తే తెల్లారి ఝాము మూడు గంటలు.
పాలవాడి బెడద:
అప్పుడు ముసుగు కప్పుకొని పడుకున్నాడో లేడో ఐదు గంటలకు పాల వాడి కాలింగ్ బెల్. ఇక ఎక్కడ నిద్ర వచ్చి చస్తుంది. బాల్యంలో “జో అచ్చుతానంద జోజోముకుందా, లాలి పరమానంద రామ గోవిందా” అని అమ్మ పాడుతూ ఉంటే సాయంత్రం ఆరుగంటలకే పడక ఎక్కే వాళ్ళం! తనకన్నా చిన్నదైనా చెల్లెలుకు స్నానం పోసి చిక్కులు పడ్డ వెంట్రుకల ను దువ్వి…ఇంత పెరుగన్నం దానికి నాకు పెట్టి “ముద్దు కృష్ణయ్య” పాటలు అమ్మ పాడుతుంటే ఆమె ఒడిలో ఎప్పుడు పడుకున్నామో అర్థమయ్యేది కాదు.
ఇప్పటి పిల్లలు వేరు:
ఇప్పటి పిల్లలూ ఉన్నారు…వాళ్ల ను నిద్ర పుచ్చే మాట అటుంచి, వాళ్ళ చేతుల్లో ఒక ఫోన్ పడేసి “మోటు – పట్లు” బొమ్మలు పెట్టేసి, నోట్లో ఇంత కుక్కేసి వాడు ఎప్పుడు పంటున్నాడో కూడా చూడని తల్లుల వల్ల వారికి సంస్కారం ఎందుకు వస్తుంది. ఇక నేటి వనితలు అన్ని టీవీ సీరియల్స్ చూసే సరికి రాత్రి పన్నెండు! అన్నమయ్య సంకీర్తనలు జోల పాటలు వారికే రావు… ఇక పిల్లలకు ఏమి జోల పాటలు పాడుతారు?
మనుషుల్లో ఎక్కువ నిద్ర చాలా మందిని సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ అలాంటి నిద్రలే ఈ కాలంలో కరవవుతున్నాయి…నిద్ర రుగ్మతా ఉన్నవారికి, ఎక్కువ నిద్ర పొందడానికి ప్రయత్నించడం ఒక పీడకల అనుభవం! నేషనల్ స్లీప్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలలో కనీసం వంద మందిలో 70 మంది వివిధ నిద్ర రుగ్మతలతో బాధపడుతున్నారని, 60 శాతం మంది పెద్దలకు విపరీతమైన నిద్ర సమస్యలు ఉన్నట్లు డాక్టర్ల నివేదికలు చెబుతున్నాయి.
Also Read: దృతరాష్ట్ర ప్రేమతో కిరాతకులు అవుతున్న పుత్ర రత్నాలు
నిద్ర రుగ్మతలు అనేకం:
నిద్ర రుగ్మతలు ఒకటా రెండా. అన్ని మానసిక సమస్యలే! నిద్ర భంగం వంటి వాటిలో స్లీప్ అప్నియా, నార్కోలెప్సీ, నిద్రలేమి, జెట్-లాగ్ సిండ్రోమ్, చెదిరిన జీవనం వల్ల ఈ రుగ్మతలు ఎక్కువ గా ఉన్నాయని ఆ నివేదికలు చెబుతున్నాయి! పెద్దలలో 40 శాతం మంది కనీసం అప్పుడప్పుడు నిద్రపోతున్నట్లుగా “నటిస్తారు”, నిద్రలేమి యొక్క దీర్ఘకాలిక మరియు తీవ్రమైన రూపాలు పెద్దలలో 10 నుండి 15 శాతం మధ్య ప్రభావితమవుతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదికలు చెబుతున్నాయి.
నిద్రలో అంతరాయం పనికి చేటు:
నిద్రలో చిన్న అంతరాయాలు కూడా మానవ భద్రత మరియు పనితీరుపై వినాశనం కలిగిస్తున్నాయి. ‘నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్” అంచనాల ప్రకారం మగత లేదా అలసటతో కూడిన డ్రైవింగ్ వల్ల సంవత్సరానికి 100,000 మోటారు వాహనాల ప్రమాదాలకు గురవుతున్నాయని ఆ నివేదిక సారాంశం!!
నిద్ర కోసం విశ్వవ్యాప్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. నిద్ర శరీరం మరియు మెదడు శక్తిని తిరిగి నింపడానికి, క్లిష్టమైన మార్గాల్లో తమను తాము రిపేర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది!
జ్నాపకశక్తి ప్రధానం:
మెమరీ ఏకీకరణ, సమాచార ప్రాసెసింగ్, శారీరక పెరుగుదల, కండరాల మరమ్మత్తు, లెక్కలేనన్ని ఇతర ప్రక్రియలు నిద్రలో సంభవిస్తాయని సిద్ధాంతీకరించబడ్డాయి! రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, శరీరాన్ని వ్యాధితో పోరాడటానికి నిద్ర కూడా ఇందులో కీలకం!! కానీ ఈ గూగుల్ ప్రపంచంలో అరచేతి లో ఫోన్ ఉండడం వల్ల మేధావులు కూడా సరిగా నిద్ర పోవడం లేదు! డే నైట్ షిప్టులు ప్రపంచ వ్యాప్త గడియారం సమయానుకూలంగా పని చేయడం వల్ల కూడా నిద్ర లేమి సమస్యలు వస్తున్నాయి… దానికి తోడు కంప్యూటర్ రేడియేషన్ ప్రాబ్లమ్స్ కూడా నిద్ర రాక పోవడానికి కరణం అవుతున్నాయట!
కనీసం 8 గంటల నిద్ర:
జీవశాస్త్ర పరిణామ సిద్ధాంతాల్లో ప్రతి జీవికి కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం! కాకులు, కోకిలలు, పిచ్చుకలు, జంతువులు కూడా సమయానికి నిద్ర పోతాయట! వేకువనే వాటి చప్పుళ్ళు కూడా సమయానుకూలంగా ఉంటాయి..గుడ్ల గుబా రాత్రంతా ఆహారం కోసం కళ్ళు పెద్దవి చేసి చూసినట్టు వింటాం కానీ, మనిషి ఏ రాత్రి చూసినా కళ్ళు చింత నిప్పులా అయినా పట్టుకున్న ఫోన్ ను, చూస్తున్న టీవీ ని వదలడు!
వేకువజామున 4 గంటలకు లేవాలి:
బెడ్ రూమ్ లైట్ బ్లూ లైట్ ఆన్ చేసి వెడల్పాటి బెడ్ పడుకకు సౌకర్య వంతంగా చూసుకొని సరిగా రాత్రి 9 గంటల కల్లా నిద్ర పోయి వేకువ జామున నాలుగు గంటలకు నిద్ర లేచి కిచెన్ పని, ఇంటి పని చేసుకున్నకా, ఉదయం ఆరు గంటల నుండి ఎనమిది గంటల వరకు టీవీలో ఆరోగ్య సూత్రాలు చూస్తే చాలు మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టే! ఇప్పుడు మన భారత దేశంలోని పట్టణాల్లో రాత్రి 12 వరకు నిద్ర పోని వారి సంఖ్య డెబ్భై శాతం ఉందని, వీరికి గుండె సంబంధమైన వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు కోడై కూస్తున్నారు! ఉదయం కోడి కూతతో నిద్ర లేచి పనులు చక్క బెట్టుకొని వేప పుల్లతో పండ్లు తోముకొని పొలం గట్ల వెంట వ్యవసాయ పనులు చేసుకుంటున్న గ్రామీణ జనంలో ఆయుష్షు ప్రమాణం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు…
ఎలక్ట్రానిక్ లాక్ డౌన్:
అసలు రాత్రి పది తరువాత ‘ఎలక్ట్రానిక్ లాక్ డౌన్’ ఉంటే బావుండును అనుకునే వారిని ‘ఔట్ డేటెడ్” పీపుల్ గా జమకట్టే ఈ నాటి యువత ఆయుష్షు ప్రమాణం అరవై ఏళ్ళు!
” కొంతమంది కుర్రవాళ్ళు
పుట్టుకతో వృద్ధులు
పేర్లకి పకిర్లకి పు
కార్లకి నిబద్దులు
నడిమి తరగతికి చెందిన
అవగుణాల కుప్పలు
ఉత్తమొద్దు రాచ్చిప్పలు
నూతిలోని కప్పలు” అంటాడు శ్రీశ్రీ… సరిగా నేటి తరం యువకులు ఆరోగ్య సూత్రాలు పాటించి ‘కొంత మంది యువకులు రాబోవు యుగం దూతలు గా మారాలంటే ‘స్లీప్ డే” సూత్రాలు వంట బట్టించు కోవాలి!
Also Read: ఆనందం ఆరోగ్యానికి దివ్య ఔషధం
మాస్టారు కాలమ్ చాలా బాగుంది.