- పార్టీకి దూరంగా ఉంటానన్న కొండా విశ్వేశ్వర రెడ్డి
- కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు
- త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని కొండా ట్వీట్
చాలాకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మూడు నెలలపాటు దూరంగా ఉంటానని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ట్విటర్ తెలిపారు. అభిమానులతో చర్చించి మూడు నెలల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరతారంటూ గత కొన్ని నెలలుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం (మార్చి 15) రాజీనామా చేసినట్లు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి నష్టం జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో రాజీనామా నిర్ణయాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఆదివారం ఎమ్మెల్సీ పోలింగ్ ముగియడంతో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే గత కొంత కాలంగా పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మార్పు నిర్ణయాన్ని అభిమానులతో సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం. ఆయన పార్టీ వీడుతున్నట్టు సమాచారం అందుకున్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ లు జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది.
Also Read: ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
2014 లోక్ సభ ఎన్నికల్లో విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేతిలో విశ్వేశ్వర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బీజేపీకి అనుకూలంగా ట్వీట్లు:
కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో చేరకుండా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే కొండా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ లలో టీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో ప్రజలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్‌ను ఓడించేది బీజేపీనే కానీ కాంగ్రెస్ కాదని కొండా విశ్వేశ్వర రెడ్డి ట్వీట్ చేశారు. దీంతో ఆయన పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరిగింది.
Also Read: ఐఎన్టీయూసీలో చేరికలు