- 770 గోల్స్ తో పోర్చుగీసు సాకర్ సరికొత్త చరిత్ర
- క్రిస్టియానో రొనాల్డో కు పీలే హ్యాట్సాఫ్
ప్రపంచ సాకర్ లో గోల్స్ మొనగాడు, రికార్డుల వీరుడు, పోర్చుగీసు సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బ్రెజిల్ దిగ్గజం పీలే పేరుతో దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న అత్యధిక అధికారిక గోల్స్ రికార్డును రొనాల్డో అధిగమించాడు.ఇటాలియన్ సాకర్ లీగ్ లో యువెంటస్ క్లబ్ కు ఆడుతున్న రొనాల్డో సెరియె ‘ఎ’ లీగ్ మ్యాచ్ లో కాగ్లియారీ జట్టుపై హ్యాట్రిక్ నమోదు చేయడం ద్వారా తన కెరియర్ లో 770వ గోల్ సాధించగలిగాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ పీలే పేరుతో ఉన్న 767 గోల్స్ రికార్డును రొనాల్డో తెరమరుగు చేశాడు.
రొనాల్డోకు పీలే హ్యాట్సాఫ్:
తన పేరుతో ఉన్న అత్యధిక గోల్స్ ప్రపంచ రికార్డును క్రిస్టియానో రొనాల్డో అధిగమించడం పట్ల 80 సంవత్సరాల పీలే సంతోషం వ్యక్తం చేశారు. రొనాల్డోను అభినందిస్తూ ఇన్ స్టా గ్రామ్ ద్వారా పీలే ఓ సందేశాన్ని పంపారు. పీలేను ఇన్ స్టా ద్వారా అనుసరించేవారు 5.8 మిలియన్ల మంది ఉన్నారు.
ప్రపంచ మేటి ఆటగాడుగా తయారు కావటానికి క్రిస్టియానో రొనాల్డో పడిన కష్టం అంతాఇంతా కాదని, తన పేరుతో ఉన్న రికార్డును అధిగమించడం ఆనందంగా ఉన్నా రొనాల్డోను స్వయంగా కలుసుకొని ఆలింగనం చేసుకోలేకపోడం బాథగా ఉందని పీలే తన సందేశంలో వివరించారు.
పీలేను అధిగమించా- రొనాల్డో:
మరోవైపు తాను కింగ్ పీలే పేరుతో ఉన్న అత్యధిక గోల్స్ రికార్డును అధగమించానంటూ తన ఆనందాన్ని 36 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకొన్నాడు. రొనాల్డోను ఇన్ స్టా ద్వారా 270 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
Also Read: రెండో టీ-20లో భారత షాన్… ఇషాన్
రొనాల్డో సాధించిన మొత్తం 770 గోల్స్ లో వివిధ క్లబ్ ల తరపున సాధించినవే 668 గోల్స్ ఉన్నాయి. స్పోర్టింగ్ లిస్బన్ తరపున 5, మాంచెస్టర్ యునైటెడ్ తరపున 118, రియల్ మాడ్రిడ్ జట్టు సభ్యుడిగా 450గోల్స్, యువెంటస్ తరపున 95 గోల్స్ సాధించాడు. అంతేకాదు తన జాతీయజట్టు పోర్చుగల్ తరపున 120 గోల్స్ సాధించడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.2019 సీజన్లో 700 గోల్స్ మైలురాయిని చేరిన రొనాల్డో 2021 సీజన్ నాటికి కానీ 770 గోల్స్ మార్క్ ను చేరలేకపోయాడు.
తన కెరియర్ లో ఫుట్ బాల్ ఆడిన మొత్తం సమయంలో రొనాల్డో ప్రతి 112 నిముషాలకు ఓ గోల్ చొప్పున సాధించడం ఓ రికార్డుగా నిలిచిపోతుంది.స్వీడన్ , లాత్వియా, ఆండోర్రా, అర్మీనియా ప్రత్యర్థులుగా పోర్చుగల్ తరపున రొనాల్డో అత్యధిక గోల్స్ నమోదు చేశాడు.తాను రికార్డుల కోసం ఫుట్ బాల్ ఆడనని స్థాయికి తగ్గట్టుగా ఆడుతూ వెళితే గోల్స్ వాటంతట అవే వస్తాయని ధీమాగా చెప్పటం క్రిస్టియానో రొనాల్డోకు మాత్రమే చెల్లింది.
Also Read: నవశతాబ్దిలో సరికొత్త రికార్డు