* ఆస్తి కోసం – అధికారం కోసం తండ్రులనే హతమారుస్తున్న దుర్మార్గులు
* శృతిమించిన వాత్సల్యమే కొంపలు ముంచుతున్నదా?
“తల్లి దండ్రులయందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి” అన్నాడు ఏనాడో వేమన. అతి గారాబం వల్ల విలువలకు తిలోదకాలు ఇచ్చే పుత్రులు తండ్రిని హతమార్చి, అధికారం ఆస్తి కైవసం చేసుకుంటున్న కథలు రోజు పేపర్లో చూస్తూనే ఉంటున్నాం. హైద్రాబాద్ లో చదువు…ఉద్యోగం వెలగబెట్టి తండ్రికి మించిన తనయుడు అవుతాడని ఆశ పడితే తప్పతాగి అర్థరాత్రి లగ్జరీ కారులో మెట్రో పిల్లర్ కు గుద్దుకొని చచ్చే వాడు ఒకడైతే, డబ్బు ఆస్తి పంచి నీ భార్య పిల్లలతో సుఖంగా ఉండరా… అంటే ఉన్న డబ్బును తగలేసి మరింత డబ్బు కోసం కిడ్నాప్ నాటకం ఆడి తండ్రి పరువు తీసి ప్రాణం మీదకు తెచ్చుకున్న కొడుకు మరొకడు.
పుత్రశోకం మిగుల్చుతున్నారు
తండ్రులు కొడుకు సంతోషం కోసం లక్షల రూపాయలు పెట్టి స్పోర్ట్స్ బైక్ లు కొనిపెడితే ఔటర్ రింగ్ రోడ్డు మీద వంద మైళ్ళ స్పీడ్ తో వెళ్లి విలువైన ప్రాణాలు తీసుకుంటున్న పుత్రరత్నాల వల్ల బ్రతికున్న నాన్నలు పుత్ర శోకంతో పాటు పరువు బజారున పడుతుందని కుమిలి కుమిలి ఏడుస్తూ గుండె నొప్పితో ఆసుపత్రుల పాలవుతున్నారు. వెనకటి ముస్లిం రాజులు అధికారం కోసం తండ్రులనే హతమార్చిన సంఘటనలు చరిత్రలో చదివాం. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ బూమ్ మూలంగా తండ్రి కష్టపడి దాచిన డబ్బును, కాపాడిన భూమిని కాజేయడానికి, ఇన్ స్టెంట్ కోరికల కోసం తండ్రికి విషమిచ్చి, మోటార్ ఆక్సిడెంట్ లు చేసి, కరెంట్ షాక్ లు పెట్టి చంపేసి దొంగ ఏడుపులు ఏడ్చే కసాయి పుత్రులు కలియుగంలో అడుగడుగునా కనిపిస్తున్నారు.”నాన్న అంటే నడుస్తున్న దేవుడురా నా కొడుకుల్లారా అంటే వినేవారు ఉన్నారా? ఇంటికి కన్నం వేసి దొంగలు పడ్డారని దిగాలుగా ముఖం పెట్టేవాడు ఒకడైతే, అమ్మా బీరువాను దొంగ తాళం చెవులతో తీసి బంగారం ఎత్తుకు పోయే వెధవలు మరి కొందరు! నాన్నకు ప్రేమగా గుండెలకు హత్తుకొని కొత్తబట్టలు, అమ్మకు కొత్త చీర పేడితే, అలాగే మొదటి నెల జీతాన్ని వాళ్ళ చేతులకు అందించి అమ్మా నాన్నల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు… ఉబ్బి తబ్బిబ్బయ్యే తల్లి దండ్రులు కొడుకును గట్టిగా హత్తుకొని వాడిచ్చిన డబ్బులు వాడి జేబులోనే పెట్టి “నువ్వు సుఖం గా ఉంటే చాలు కొడకా” అని దీవెనలు అందించే అమాయాకపు తల్లి దండ్రులును మభ్యపెట్టి, పెళ్ళాం రాగానే బెల్లం లా దాన్ని తలపైన ఎక్కుంచుకొని ముసలి ప్రాణాలను వృద్ధ ఆశ్రమాల్లో ఉంచుతున్న కొడుకులు ప్రతి ఉరుకు ఒకడు ఉన్నాడు.
Also Read : ఆడపడుచుల పుట్టింటి మమ ‘కారం’ !
పుత్రోత్సాహం
తండ్రుల ప్రేమ గురించి అందమైన శ్లోకాలు కవులు ఎన్నో వ్రాసారు.. తండ్రి ప్రేమ గురించి తండ్రికి పుత్రుడు పుట్టగానే ఆనందం ఎంత ఉంటుందో అతను పెద్దయ్యాక సంస్కారవంతంగా తల్లి దండ్రులను చూసుకున్ననాడు తల్లి దండ్రులు గర్వంగా పది మందికి చెప్పుకుంటారు! సుమతీ శతక కారుడు ఏనాడో ఈ విషయం చెప్పాడు…అన్నీ ఇంగ్లీష్ చదువులు అయినప్పుడు తెలుగు పద్యాల హిత వచనాలు ఇప్పుడు తెలుగు మాస్టర్లు చెబుతున్నా వినే నాథుడే లేడు. భార్య గర్భం దాల్చగానే తండ్రికి ఎక్కడలేని ఆనందం కలుగుతుంది.. భార్యకు వెండి బంగారాలు కొనిచ్చిన ఆనందం కన్నా ఒక వారసున్ని ఇస్తున్న ఆనందం తండ్రికి ఒక సామ్రాజ్యాన్ని గెలుచుకున్నట్టుగా ఉంటుంది!
కొడుకు పుట్టుక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న ప్రతి రోజు, ప్రతి వేడుక తండ్రిలో ఉన్న ఆనందం, ఉత్సాహం నవ జాత శిశువును ఆయన చేతుల్లోకి పురుడు పోసి అందించిన ఆయమ్మకు జేబులో ఎంత డబ్బు ఉంటే అంతా, ఇంకా ఆనందం పట్టలేక చేతికి తొడిగిన ఉంగరాన్ని కూడా ఇచ్చేసే పిచ్చి ప్రేమ గల తండ్రిని పెద్దయ్యాక కొడుకుకు ఆ మాట చెబితే, ఆ ఉంగరమే ఉంటే ఇవ్వాళ్ళ మూడింతలు అయ్యేదని తండ్రిని ఈసడించుకునే ప్రబుద్ధులు కూడా ఈనాడు.
Also Read : ప్రేమతత్వం తెలిస్తే ఆకర్షణకు దూరంగా ఉంటారా?
కొన్ని ఇండ్లల్లో ఉన్నారు
నేను నా కొడుకు కోసం ఏదైనా ఇస్తాను, అతని కోసం ఏదైనా చేస్తాను, అతనిని ప్రేమించకుండా ఉండటానికి ఈ ప్రపంచంలో మరేదీ లేదని దృత రాష్ట్రుని లా పుత్ర వాత్సల్యం చూపే వారి అతి ప్రేమ వల్ల అంది వచ్చిన కొడుకు ఏకాకిని చేసి వెళ్లి పోయిన తరువాత చితికి నిప్పంటిస్తూ తండ్రి ఎంత ఏడ్చినా ఆయన బాధ తీరదే ! అదే తండ్రి అనారోగ్యంతో నో, ఆవేదనతోనో చచ్చిపోతే ఆయనకు అంతిమ సంస్కారం చేసి వచ్చి “ఇక నాకు ఆస్తి దక్కిందని” తప్ప తాగి గంతులు వేసే కొడుకులు కూడా మనకు కనిపిస్తున్నారు. తండ్రి కొడుకును కోల్పోతే పడే బాధ వర్ణనాతీతం. అదే తండ్రిన పోయిన మర్నాడే ఆస్తి కోసం అమ్మను పీడించే దరిద్రుల వల్ల నైతిక విలువలు ఏనాడో నాశనం అయిపోయాయి.
తండ్రి కొడుకుల సంబంధాల్లో ఎక్కడ లోపం ఉంది? “ది సైకాలజీ బిహైండ్ ఫాదర్ – సన్ రిలేషన్షిప్స్” అనే పుస్తకాల్లో చాలా వరకు తల్లి దండ్రులదే తప్పని మనో విశ్లేషకులు చెబుతున్నారు…తండ్రులేమో కిలోమీటర్ల దూరం నడిచి వాగులు వంకలు దాటి చదువుకొని పట్టణాల్లో కూడా నలుగురితో గది షేర్ చేసుకుని కష్టపడు చదివి ఉన్నత ఉద్యోగం చేస్తూ శ్రీమంతులు జాబితాలో చేరిపోగానే చాలు కొడుకు నా లాగా పెరగవద్దని కాన్వెంట్ లలో చేర్చి, ఆడిగిందల్లా కొనిచ్చినప్పుడు తరువాత కొడుకు ను హాస్టళ్లలో వేసి బరువు దించుకున్న కొడుకులు ఇప్పటి తండ్రులకు సరియైన గుణ పాఠం నేర్పుతున్నారని ఒక వాదన.
Also Read : పండంటి కాపురానికి పదహారు సూత్రాలు
తండ్రిపైన ఫిర్యాదు
“నా తండ్రి గొప్ప వ్యాపార వేత్త కానీ వారాంతాల్లో అతను ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతను నా బాగోగులు చూడలేదు. నా జీవితమంతా నా తండ్రి స్పర్శ కోసం ఏడ్చాను.. తన తండ్రి ఎప్పుడూ నాతో ఏమీ పంచుకోలేదు అతను ఎలాంటి సమస్యలతో కుస్తీ పడుతున్నాడో, అతను ఏమనుకుంటున్నాడో, లేదా మనిషిగా ఉండడం అంటే ఏమిటో అతను నాకు నేర్పలేదు. నేను ఇవన్నీ నా కోసం నేను వేరే వారిని చూసి నేర్చు కోవలసి వచ్చింది. తండ్రి ప్రేమను పొందలేక పోవడం వల్ల ఆయన నన్ను ఎదురుగుండా వస్తే నామోషీ అనుకోవడం వల్ల, భయభక్తులు వల్ల నేను తండ్రి నుంచి దూరమయ్యాను.
లెటర్ టు మై ఫాదర్
అర్ధరాత్రి నన్ను వచ్చి ముద్దాడడం తప్పా నేను ఆయనతో ఆటలాడుకునే సమయమే లేదు…నేను కోరుకుంది సోషల్ స్టేటస్ కాదు హ్యూమన్ బీయింగ్ అని స్పష్టంగా చెప్పే కుమారుల ఆవేదనను కూడా ఇక్కడ గమనించాలి. అవును నాన్న నేను ఆడిగిందల్లా నాకు కొనిచ్చాడు…కానీ నాన్న ప్రేమ దొరకలేదని ఫ్రెండ్స్ తో వెళ్లి అన్ని అలవాట్లకు బానిసనయ్యను… ఇప్పుడు నా చావుకు కూడా నాన్నే కారణం! విలువలు పుస్తకాల్లో నేర్చుకోలేను…అమ్మ నాన్న ఆదరణలో ఉన్నాయని అర్ధాంతరంగా వెళ్లిపోతున్న పుత్రుల వల్ల తల్లి దండ్రుల్లో కూడా మార్పు రావాలి. ఇలాంటి సంఘటనలు జర్మన్ నవలా రచయిత ఫ్రాంజ్ కాఫ్కా తన తండ్రి గురించి “లెటర్ టు మై ఫాదర్” లో వెల్లడించారు.
Also Read : ఆధునిక మహిళ కోరుకుంటోంది హక్కులు కాదు, ఆప్యాయత – ఆదరణ
మాదకద్రవ్యాలకు బానిసలు
భారతీయ సంస్కృతి లో సోషల్ మీడియా ప్రకంపనలు సృష్టిస్తోంది మాదక ద్రవ్యాల వాడకం, సిగరెట్లు, తాగుడు కు బానిస కావడానికి అతి తెలివి వల్ల ఫిలాసఫీ ని వంట బట్టించుకోవడం, విచ్చల విడి శృంగార చిత్రాలు, ఒక్కటేమిటీ సోషల్ మీడియా ప్రతి ఇంట్లో దుమారం లేపుతుంది… ఒక వేళ తండ్రి ఏమైనా చెప్పబోతే “నీకేం తెలియదు నాన్నా” అనే పుత్రికా పుత్ర రత్నాలు ఉన్న ఈ కాలంలో తల్లి దండ్రులు మౌన ప్రేక్షకులు అయ్యారు.
కన్నవారి వెన్నుపోట్లు
దేశంలో వంశ పరంపర్య అధికార దాహం వల్ల తండ్రులను , మామలను అధికారం నుంచి దించేసి ప్రభుత్వాలను హస్తగతం చేసుకున్న సంఘటనలు భారతీయ రాజకీయ చరిత్రలో కోకొల్లలు…! దుర్యోధనిడిలా అధికార దాహం ఉన్న వాళ్లు అడుగడుగునా కనిపిస్తారు…అదే దారిలో కుటుంబ వ్యవస్థ కనబడుతుంది…డబ్బు కోసం కన్నవాళ్లను బజారు కీడ్చి దాయాదుల ముందు పలుచన చేస్తున్న కొడుకులు , అత్తమామలను ఆస్తి కోసం విషమిచ్చి చంపే కొడళ్ళు ఉన్న ఈ సమాజంలో అతి ప్రేమతో ఇంకా అక్కున చేర్చుకుంటున్న తల్లి దండ్రుల పెద్ద మనసును భారతీయ కోర్టులు అండగా నిలిచాయి. తల్లి దండ్రులను చూడని కొడుకుల ఆస్తులను జప్తు చేసి తండ్రుల పేరిట మార్చమని చెప్పడమే కాకుండా, తల్లి దండ్రులను హింస గురిచేస్తున్న కొడుకు కొడళ్లను జైళ్లకు కూడా పంపే న్యాయ వ్యవస్థ మనకు ఉంది కాబట్టి ఇంకా న్యాయం నాలుగు పాదాల మీద నడుస్తుంది. కన్నా వారికి సేవ చేయడం వల్లే ముక్తి లభిస్తుందని యాభై ఏళ్ళ నాడే “పాండురంగ మహాత్యం” సినిమా ద్వారా ఇచ్చిన అభ్యుదయ సందేశం ఈ నాటికి ఆ చిత్రం సజీవంగా ఉంది! కర్మ సిద్ధాంతం ఎంతగా భారతీయులు ఆచరిస్తారో నైతిక విలువలు పుత్రులకు నేర్పినప్పుడే ఈ జనరేషన్ లో మార్పు వస్తుంది.. లేదా ఈ నాటి తరం పై పదిహేనేళ్లకే వారి పుత్రులు తిరుగు బాటు చేస్తారు తస్మాత్ జాగ్రత్త!!
Also Read : మాటలతో ఆకట్టుకోండి, మనసు దోచే ఉద్యోగం చేపట్టండి!