* రెండో టీ-20లో ఇంగ్లండ్ తో ఢీ
* రోహిత్ శర్మ వైపు భారత్ చూపు
టీ-20 ప్రపంచ నంబర్ వన్ ఇంగ్లండ్, రెండోర్యాంకర్ భారతజట్ల ఐదుమ్యాచ్ ల సిరీస్…రెండోమ్యాచ్ కే వేడెక్కింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే ఈ సూపర్ సండే ఫైట్…మోర్గాన్ ఆర్మీకి చెలగాటం, విరాట్ సేనకు సిరీస్ సంకటంగా మారింది.
ఏకపక్షంగా సాగిన తొలిసమరంలో 8 వికెట్ల తేడాతో చిత్తయిన భారతజట్టు దెబ్బతిన్న బెబ్బులిలా…విజయమేలక్ష్యంగా రెండోపోరుకు సిద్ధమయ్యింది. లోపాలను సవరించుకొని,సర్వశక్తులూ కూడదీసుకొని పవర్ ఫుల్ ఇంగ్లండ్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో బరిలోకి దిగుతోంది.
Also Read : టీ-20ల్లో చహాల్ సరికొత్త రికార్డు
విరాట్ పైనే ఒత్తిడి
వన్ డౌన్ బ్యాట్స్ మన్ గా, కెప్టెన్ గా విఫలమవుతూ వస్తున్న విరాట్ కొహ్లీకి ఈ రెండో మ్యాచ్ జీవన్మరణ సమస్యగా మారింది. తొలి పోటీలో లెగ్ స్పిన్నర్ రషీద్ బౌలింగ్ లో చెత్త షాట్ కు వెళ్లి డకౌట్ గా వెనుదిరిగిన కొహ్లీ తనదైనశైలిలో భారీస్కోరు సాధించడం ద్వారా విమర్శకులకు బదులివ్వలన్న పట్టుదలతో ఉన్నాడు.
వైస్ కెప్టెన్,డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మను తుదిజట్టులో చేర్చుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓపెనర్లు రాహుల్, శిఖర్ ధావన్ ఇద్దరూ ఆశించిన స్థాయిలో తమజట్టుకు చక్కటి ఆరంభాన్ని ఇవ్వలేకపోడం జట్టు పరాజయానికి ప్రధానకారణంగా నిలిచింది.
Also Read : డకౌట్ల ఊబిలో విరాట్ కొహ్లీ
ఇంగ్లండ్ లాంటి అత్యంత శక్తిమంతమైన ప్రత్యర్థి పైన ప్రయోగాలకు పోతే అసలుకే మోసం వస్తుందని చీఫ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కొహ్లీ…తొలిదెబ్బతోనే గ్రహించారు.
తొలిమ్యాచ్ లో ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో పోటీకి దిగిన భారత్…బౌలింగ్ ను మరింత పటిష్టపరుచుకోవాలని యోచిస్తోంది.
ఓపెనర్లతో పాటు…కెప్టెన్ కొహ్లీ సైతం రాణించగలిగితే…మిడిలార్డర్ లో పంత్, అయ్యర్, హార్థిక్ పాండ్యా లాంటి స్ట్ర్రోక్ మేకర్లు చెలరేగిపోయే అవకాశం ఉంటుంది.
అయితే… గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్న మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ లాంటి ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనడం భారత టాపార్డర్ కు అంత తేలికకాదు.
Also Read : విరాట్ డక్… భారత్ ఫట్
రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో అత్యంత పటిష్టంగా ఉన్న టాప్ ర్యాంకర్ ఇంగ్లండ్ కు…వోయిన్ మోర్గాన్ నాయకత్వం అదనపు బలంగా ఉంది. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చడం, బౌలింగ్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోడం ద్వారా ఇంగ్లండ్ జట్టు ఆశించిన ఫలితాలు సాధించగలుగుతోంది. పదునైన బౌలింగ్ మాత్రమే కాదు…పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కూడా ఇంగ్లండ్ అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రంగా ఉంది.
ఓపెనర్లు జేసన్ రాయ్-జోస్ బట్లర్, వన్ డౌన్ మలాన్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, మోర్గాన్ లతో కూడిన బ్రిటీష్ బ్యాటింగ్ లైనప్ ను అదుపు చేయాలంటే…భారత బౌలర్లు అత్యుత్తమంగా రాణించక తప్పదు.
ఇంగ్లండ్ 8- భారత్ 7
ప్రస్తుత సిరీస్ లోని తొలి మ్యాచ్ వరకూ ఈ రెండుజట్లూ 15సార్లు తలపడితే ఇంగ్లండ్ 8 విజయాలు, భారత్ 7 విజయాల రికార్డుతో ఉన్నాయి. సమానబలం కలిగిన ఈ రెండుజట్ల పోరు కోసం దేశ,విదేశాలలోని కోట్లాదిమంది అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. దీనికితోడు ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక అహ్మదాబాద్ మోడీ స్టేడియం కెపాసిటీ లక్షా 13 వేలు కాగా…సగం సామర్థ్యం మేరకే టికెట్లు విక్రయించారు. సూపర్ సండే పోరుగా జరిగే ఈమ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. 50వేలకు పైగా అభిమానులు మ్యాచ్ కు హాజరయ్యే అవకాశం ఉంది.
Also Read : 10 వేల పరుగుల మిథాలీ రాజ్
భారత్ దెబ్బకు దెబ్బతీస్తుందా?లేక వరుసగా రెండోసారి అభిమానులను నిరాశకు గురి చేస్తుందా? తెలుసుకోవాలంటే మాత్రం రాత్రి 10 గంటల వరకూ వేచిచూడక తప్పదు.