- విరాట్ ను ఊరిస్తున్న 3వేల పరుగుల రికార్డు
- గప్టిల్ రికార్డుల వైపు రోహిత్ చూపు
త్రీ-ఇన్-వన్ ఆటగాడు, భారత కెప్టెన్ విరాట్ కొహ్లీని ధూమ్ ధామ్ టీ-20 జంట రికార్డులు ఊరిస్తున్నాయి. ఇంగ్లండ్ తో ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ ద్వారా కొహ్లీ ఈ రికార్డులను సొంతం చేసుకోడం ఖాయంగా కనిపిస్తోంది.ఇంగ్లండ్ తో ఇటీవలే ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో అంతంత మాత్రంగానే రాణించిన కొహ్లీ టీ-20 సిరీస్ ద్వారా సత్తాచాటుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.
3వేలకు 72 పరుగులే దూరం:
టీ-20 ఫార్మాట్లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు విరాట్ కొహ్లీ కోసం ఎదురుచూస్తోంది. 3వేల పరుగులు సాధించిన తొలిక్రికెటర్ గా విరాట్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ ల్లో కొహ్లీ 2వేల 928 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. కివీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 2 వేల 839 పరుగులు, రోహిత్ శర్మ 2 వేల 773 పరుగులు, కంగారూ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 2వేల 346 పరుగులు, షోయబ్ మాలిక్ 2 వేల 335 పరుగులతో ఆ తర్వాతి స్థానాలలో ఉన్నారు.టీ-20 క్రికెట్లో 3వేల పరుగుల మైలురాయిని చేరే అవకాశం ప్రస్తుత ఐదుమ్యాచ్ ల సిరీస్ ద్వారా భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు మాత్రమే ఉంది.
Also Read: టీ-20 ల్లో భారత్ ను ఊరిస్తున్న టాప్ ర్యాంక్
కెప్టెన్ గా 12వేల అంతర్జాతీయ పరుగుల రికార్డు:
అంతర్జాతీయ క్రికెట్లో 12వేల పరుగులు సాధించిన మూడో కెప్టెన్ గా విరాట్ కొహ్లీ ప్రస్తుత సిరీస్ ద్వారా నిలువనున్నాడు. ఇప్పటి వరకూ ఆఘనత సాధించిన ఆటగాళ్లలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రీమ్ స్మిత్, ఆస్ట్ర్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ మాత్రమే ఉన్నారు.క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలిపి రికీ పాంటింగ్ మొత్తం 15వేల 440 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. గ్రీమ్ స్మిత్ 14వేల 878 పరుగులతో రెండోస్థానంలో ఉన్నాడు.భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ మరో 17 పరుగులు చేయగలిగితే 12వేల పరుగుల మైలురాయిని చేరగలుగుతాడు.
తీన్మార్ రికార్డు సైతం:
క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ 3వేల పరుగులు చొప్పున సాధించిన ఆటగాడిగా నిలిచే అవకాశం కూడా కొహ్లీకి 72 పరుగుల దూరంలో ఉంది. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లలో 3వేల పరుగులకు పైగా చొప్పున సాధించిన కొహ్లీ టీ-20ల్లో మాత్రం 2వేల 928 పరుగులు మాత్రమే సాధించాడు.ఇంగ్లండ్ తో ఆడిన గత మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో తమజట్టు విజేతగా నిలవడంలో కొహ్లీ, రోహిత్ ప్రధానపాత్ర వహించారు.
Also Read: అనుపమా కాదు…. సంజన..!
రోహిత్ కోసం సిక్సర్ల రికార్డు:
టీ-20 ఫార్మాట్లో సిక్సర్లు బాదడంలో మొనగాడుగా పేరుపొందిన భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కివీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ పేరుతో ఉన్న 139 సిక్సర్ల రికార్డును అధిగమించాలంటే మరో 13 సిక్సర్లు సాధిస్తే చాలు. అంతేకాదు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కొహ్లీ తర్వాతి స్థానంలో ఉన్న మార్టిన్ గప్టిల్ (2 వేల 839 పరుగుల) ను అధిగమించాలంటే రోహిత్ మరో 67 పరుగులు చేయాల్సి ఉంది. రోహిత్ 2వేల 773 పరుగులతో గప్టిల్ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ తో ఆడిన గత మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో రోహిత్ కు సూపర్ సెంచరీ సాధించిన రికార్డు ఉంది.