- షాకవుతున్న మందు బాబులు
- ఆరు జిల్లాల్లో మూతపడనున్న మద్యం దుకాణాలు
- ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది. ఎన్నికల నియమావళికి అనుగుణంగా మద్యం దుకాణాలు, బార్లను మూసివేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లను మూసివేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి 14 వరకూ, ఎన్నికల కౌంటింగ్ జరగనున్న 17వ తేదీన మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేస్తున్నారు.
ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో మాత్రమే:
రాష్టంలో ఈ నెల 14వ తేదీన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారం ఈ రోజు ముగియనుండటంతో సాయంత్రం 4 గంటల నుంచి ఎన్నికలు జరగనున్న 14వ తేదీ వరకూ మద్యం షాపులు, బార్లు, పబ్బులు, క్లబ్బులు మూతపడనున్నాయి. అంతే కాకుండా ఎన్నికల ఫలితాల రోజైన 17వ తేదీ కూడా మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం పై నిషేధాజ్ఞలు కొనసాగింపు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో:
ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 14వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధాన్ని విధిస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. కల్లు దుకాణాలు, వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు అన్నింటిని రెండు రోజుల పాటు మూసివేయాలని సీపీ ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.
మద్యం కోసం మందు బాబుల పాట్లు:
వరుసగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నారని సమాచారం తెలుసుకున్న మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. మందుబాబులు మద్యం కోసం ఎండను సైతం లెక్క చేయకపోగా కొవిడ్ నిబంధనలను కూడా గాలికొదిలేసి క్యూలైన్లలో నిలుచున్నారు. అవసరాన్ని బట్టి కార్టూన్లలో మద్యం సీసాలను తీసుకెళుతున్నారు.
Also Read: లక్షల హృదయాల్లో కోనప్ప. -ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్