- బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి ప్రారంభంకానున్నాయి. పదకొండు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు ఈ నెల 25న ముగియనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి తెలిపారు. ఈసారి కూడా బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని దేవస్థాన కమిటీ నిర్ణయించింది. యాదాద్రి గుట్ట కింద భాగంలో కల్యాణకట్ట, అగ్నిగుండం, అన్నదాన సత్రాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఇవి త్వరలో పూర్తికానున్నట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. బర్కత్ పురలోని యాదాద్రి భవన్ నుంచి 27వ అఖండజ్యోతి ప్రచార రథయాత్రను గురువారం (మార్చి 11) ఘనంగా ప్రారంభమైంది. ప్రజల్లో అధ్యాత్మిక భావన పెంపొందించడానికి అఖండజ్యోతి ప్రచార రథయాత్ర దోహదపడుతుందని గీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రచార రథయాత్ర పలు ప్రాంతాల మీదుగా 14న యాదాద్రికి చేరుకుంటుందని రథయాత్ర ప్రతినిధులు తెలిపారు. అఖండ జ్యోతిని యాదాద్రి ప్రతినిధులకు అప్పగించిన అనంతరం రాత్రి ఉత్సవ విగ్రహాలను రాయగిరి చెరువులో నిమజ్జనం చేస్తామని అధికారులు వివరించారు.
Also Read: ఆలయ టెండర్ ప్రకటన లో అయోమయం, నిర్లక్ష్యమా? నిద్రమత్తా ?
15 స్వస్తి వాచనం, అంకురారోపణం, 16న ధ్వజారోహణం, దేవతాహ్వానం, వేద పారాయణ, హావన, అలంకార సేవలు, ధార్మిక సభా కార్యక్రమాలు విశేష వేడుకలు 21న మొదలవుతాయి. ఆరోజు ఎదుర్కోలు, 22న స్వామివారి తిరు కల్యాణమహోత్సవం, 23న దివ్య విమాన రథోత్సవం, 24న పూర్ణాహుతి, శృంగార డోలోత్సవం, 25న శత ఘటాభిషేకము, ఉత్సవాలకు పరిసమాప్తి పలికి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి:
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. ఆలయ పునర్నిర్మాణపనులు జరుగుతున్నందున భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్ మహమ్మారి మళ్లీ ముంచుకొస్తుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు తెలిపారు. మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలని, శానిటైజర్ లను వాడాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Also Read: వేలాల మల్లిఖార్జున స్వామికి రామగుండం సీపీ ప్రత్యేక పూజలు