- కోరలు చాస్తున్న కరోనా
- మహారాష్ట్రలో 14 వేలకు పైగా కేసులు
- నాగ్‌పూర్‌లో మళ్లీ లాక్‌డౌన్
- మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్
కరోనా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న సమయంలో మళ్లీ కోరలు చాచి భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా మాస్క్ శానిటైజర్లు తప్పనిసరి గా వాడాలని ప్రభుత్వం, ఆరోగ్యశాఖలు హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడంవల్లే మళ్లీ పరిస్థితి మొదటికి వస్తోందని అధికారులు అంచనావేస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చింది మాకేంటి ధీమా అనే ఆలోచనలో ఉన్నవారు కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవడంతో పెను ఉపద్రవం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసుల్లో అనూహ్య పెరుగుదల నమోదవుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల కాలంలో దేశవ్యాప్తంగా సుమారు23 వేల 300 కేసులు వెలుగుచూశాయి. 2021లో 23 వేల కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కొన్నాళ్లుగా దక్షిణాఫ్రికా, బ్రిటన్ రకం కరోనా వైరస్ లు దేశంలో వేగంగా వ్యాపిస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయని అధికారులు అంచనావేస్తున్నారు.
ఒకవైపు కొత్తరకం కరోనాతో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు, అధికారులు కలవరపడుతున్నారు. అదే సమయంలో కరోనా పాజిటివ్ వచ్చినవారిలో కోలుకుంటున్నవారు తగ్గిపోతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో 15200 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే ఇటీవల 97 శాతం పైగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 96.5 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 197300 కేసులు ఉన్నట్లు అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 158300 కు చేరింది.
Also Read: గాంధీల ఒంటరి పోరాటం సఫలమా? విఫలమా?
మహమ్మారి గుప్పిట్లో మహారాష్ట్ర :
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. గురువారం (మార్చి11) ఒక్క రోజే 14300 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,66,400 కు చేరింది. దీంతో ఉద్దవ్ థాక్రే సర్కార్ అప్రమత్తమయింది. కొత్త కేసులు భారీగా నమోదవుతుండటంతో కరోనాను కట్టడి చేసేందుకు పలు నగరాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఇందులో భాగంగా నాగపూర్ లో లాక్ డౌన్ విధించింది. మార్చి 15 నుంచి మార్చి 21 వరకు వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కేవలం నిత్యావసర సరుకులను అమ్మే దుకాణాలు, మెడికల్ షాపులు, ఆసుపత్రులు మాత్రమే తెరచి ఉంటాయి. ముంబయి, నాశిక్, పుణె, అకోలా, నాగ్‌పుర్‌లో కరోనా కేసుల ఉద్ధృతి అధికంగా ఉన్నట్లు సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలను విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్ వంటి చర్యలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చేపట్టినట్లు గుర్తు చేశారు.
పూణెలో రాత్రి కర్ఫ్యూ:
పుణెలో కొవిడ్ రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయినప్పటికీ లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేయడంలేదు. కానీ, అక్కడి పాలనా యంత్రాంగం మాత్రం రాత్రి వేళ కర్ఫ్యూ నిబంధనలు అమలు చేస్తోంది. మార్చి 14 వరకు పాఠశాలలు, కళాశాలల మూసివేత కొనసాగుతోంది. అయితే త్వరలోనే కేసులు పెరుగుతూ ఉంటే కఠిన నిబంధనలు అమలు చేస్తామని పుణె మేయర్ మురళీధర్ మొహోల్ స్పష్టం చేశారు.
Also Read: ఉత్తరాఖండ్ సారథిగా తీరథ్ సింగ్ రావత్
ఔరంగాబాద్ లో పాక్షిక లాక్ డౌన్:
ఔరంగాబాద్‌లో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్న స్థానిక పాలనా యంత్రాంగం అక్కడ పాక్షిక లాక్‌డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే దుకాణాలు, కూరగాయల మార్కెట్లకు అనుమతించింది. వారాంతాల్లో అన్ని రకాల దుకాణాలు, మార్కెట్లు, హోటళ్లు మూసివేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నిబంధనల అమలులో అలసత్వం ప్రదర్శించితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఆనంద్ వన్ లో కరోనా హాట్ స్పాట్:
రెండో దశ కరోనా విజృంభణలో అనంద్ వన్ మరోసారి హాట్‌స్పాట్ కేంద్రంగా మారింది. భారీ స్థాయిలో వైరస్ కేసులు వెలుగు చూస్తున్నందున అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కరోనాను అరికట్టేందుకు వీధులను శానిటైజేషన్ చేస్తున్నారు.
Also Read: నందిగ్రామ్ నుంచి మమత పోటీ