- సీట్ల సర్దుబాటులో కుదరని సయోధ్య
- ఒంటరిగా పోటీచేసేందుక డీఎండీకే
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే బీజేపీ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో మరో పార్టీ అయిన డీఎండీకే సీట్ల సర్దుబాటులో భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఒంటరి పోరుకు సిద్ధమయింది. పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు విజయకాంత్ ప్రకటించారు. అన్నాడీఎంకేతో కలిసివెళ్లాలని డీఎండీకే నిర్ణయించినా తాము కోరిన సీట్లు ఇచ్చేందుకు అన్నాడీఎంకే అంగీకరించలేదని విజయకాంత్ ఆరోపించారు.
కూటమినుంచి బయటకొచ్చిన డీఎండీకే:
2016 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎండీకే కలిసిపోటీచేశాయి. ఎన్నికల అనంతరం బయటకు వెళ్లిపోయిన డీఎండీకే 2019 లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
Also Read: తమిళనాట కాషాయం ఆట
సఫలం కాని చర్చలు:
ప్రస్తుతం డీఎండీకే 41 స్థానాలు కావాలని పట్టుబట్టింది. పలు మార్లు చర్చించిన మీదట 23 సీట్లు ఇవ్వాలని కోరింది. అయితే ఇందుకు కూడా అన్నాడీఎంకే ససేమిరా అనడంతో కూటమినుంచి బయటకువచ్చింది. ఈ సందర్భంగా విజయకాంత్ మాట్లాడుతూ కూటమి ధర్మాన్ని అన్నాడీఎంకే విస్మరించిందని డీఎండీకే విమర్శించింది. అయితే అన్నాడీఎంకే 13 నుంచి 15 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల బరిలో విజయకాంత్ కుటుంబ సభ్యులు:
ఈ సారి ఎన్నికల్లో విజయకాంత్ కుటుంబసభ్యులనుంచి తీవ్ర పోటీ నెలకొంది. విజయకాంత్ తో పాటు ఆయన భార్య ప్రేమలత, కుమారుడు విజయప్రభాకరన్, బావమరిది ఎల్ కే సుధీష్ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. డీఎండీకే కూటమి నుంచి వెళ్లిపోవడంతో ఇక అన్నాడీఎంకేతో పాటు పీఎంకే, బీజేపీలు మాత్రమే కొనసాగనున్నాయి. పీఎంకే 23 నియోజకవర్గాలు, బీజేపీ 20స్థానాలు మినహాయిస్తే మిగతా స్థానాలలో అధికార అన్నాడీఎంకే పోటీచేయనున్నాయి.