- ముగిసిన ప్రచారం
- పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి
ఏపీలో పురపాలక ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. రాష్ట్రంలో 12 నగరపాలక, 71 పురపాలక సంస్థలు, నగర పంచాయతీలలో రేపు పోలింగ్ జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థలో ఎన్నికలపై హైకోర్టు సోమవారం స్టే విధించింది. దీంతో పోలింగ్ ను ప్రస్తుతానికి నిలిపివేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 75 పురపాలక, నగర పంచాయతీలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా చోట్ల బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ సందర్భంగా సుమారు 78 లక్షల 71 వేలమంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2215 డివిజన్, వార్డు సభ్యుల స్థానాలకు 7552 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారం రోజులుగా రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. పార్టీల పరంగా నిర్వహిస్తున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.
ఇదీ చదవండి:ఎన్నికల సంఘంపై టీడీపీ, వైసీపీల అసహనం
సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు:
మొత్తం 7915 పోలింగ్ కేంద్రాలలో సగానికిపైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఎన్నికల సంఘం గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 2320 పోలింగ్ కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగాను, 2468 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ కోసం 48,723 మంది ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోనున్నారు. వీరిలో నగరపాలక సంస్థల్లో 21888 మంది పురపాలక, నగర పంచాయతీల్లో 26835 మందిని కేటాయించారు. పటిష్ఠ భద్రత మధ్య బ్యాలెట్ పత్రాలు, ఇతర పోలింగ్ సామాగ్రి ఆయా డివిజన్, వార్డుల పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఇదీ చదవండి: విశాఖలో టీడీపీకి ఎదురుదెబ్బ