* మంగళ సూత్రం మహిళకు ఆభరణం
* పరస్పర నమ్మకమే ప్రేమకు తార్కాణం
* మల్లెపూలు… మధురమైన మాటలే మహిళకు తీపి గుర్తులు
పెళ్లి అనే జీవిత పరమార్థానికి అర్థం తెలియని నేటి యువతీ యువకులు చిన్న చిన్న విషయాలకే గిల్లి కజ్జాలకు దిగి పండంటి కాపురాలను కూల్చుకుంటున్నారు. “ఆదర్శ దంపతుల” పేరిట అవార్డు ఇద్దామని హైద్రాబాద్ లో చాలా అపార్ట్మెంట్లు తిరిగినా ఒక్క జంట అయినా దొరికితే ఒట్టు. ప్రతి ఇంట్లో కంచాల చప్పుళ్ళు,చెంబుల లొట్టలు. పైకి మాత్రం అబ్బా “ఆదర్శ దంపతులంటే” వీరు అని చెప్పుకోవడానికి సంఘంలో ఎంత బిల్డప్ ఇచ్చినా వాళ్ల పక్కింటి వారిని అడిగితే “అబ్బో రోజు రామ రావణ యుద్ధమే’ అంటూ నసిగే రాములమ్మలు ఒక చెవి అటు ఉంచడం వల్ల కలహాల కాపురాల చిట్టా తెలుస్తుంది.
అదేం రోగమో గానీ పెళ్ళయి పిల్లలు పుట్టినా కూడా పెళ్లి కానట్టు బిల్డప్ ఇచ్చే రమణి మణులు కొన్ని చోట్ల కనిపిస్తుంటారు. మంగళ సూత్రాన్ని ఎక్కడో దాచి మట్టెలను పర్సులో వేసి స్కూటీ మీద ఉరేగే ‘‘మాడ్రన్ మహిళ” తీరు తెన్నులు చూసి “హవ్వా” అని నోరెళ్ల బేట్టే ముసలక్కల సన్నాయి నొక్కులు వినిపించకుండా చెవులకు ఇయర్ ఫోన్లు తగిలించుకుంటే వాళ్ల తిట్లు శాపనార్థాలు వీళ్లకు వినిపిస్తాయా? అందంగా “అబ్బా జంట అంటే ఇలా ఉండాలి”.. ‘ప్రభాస్- అనూష్క లాగా ఉన్నారు” అని మహిళ దినోత్సవం రోజు ఇంటర్వ్యూ చేద్దామని వెళ్లిన నా లాంటి జర్నలిస్ట్ కు దొరక్కుండా ఆ జంట తప్పించుకున్నారు…పక్కన ఉన్న బామ్మ ను వారి గురించి అడిగి విషయం తెలుసుకుందామని వెళ్ళాను…”బామ్మా…ఆ అమ్మాయి మెడలో పుస్తెలు లేవు…పైగా మట్టెలు కూడా కనిపించడం లేదు…వీళ్ళది పెళ్లా…లేక సహజీవనమా?”, అని అడిగాను ” బాబు చంద్రమతి మాంగళ్యం కథ విన్నవా? అంది ‘విన్నానమ్మా అన్నాను’… ఇదీ అంతే అంది భర్తకు తప్ప ఆమె మంగళ సూత్రం ఎవరికి కనిపించదు అంది.
Also Read : ఆధునిక మహిళ కోరుకుంటోంది హక్కులు కాదు, ఆప్యాయత – ఆదరణ
మరి పిల్లా జెల్లా లేరా? అని అడిగాను…నిక్షేపంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు…వాళ్ల అమ్మ దగ్గర పడేసి ఇది ఉద్యోగం అంటూ ఉరేగుతోంది అంటూ నిట్టూర్చింది. మరి కాళ్లకు మట్టెలు లెవేమిటీ? అన్నాను…ఏ బీరువాలోనో ఉండి ఉంటాయి. అయినా వెండి మట్టెలు ఉంటాయి కానీ బంగారు మట్టెలు పెట్టే ఈ పిల్ల పెండ్లిళ్లకో పేరంటాలకో తప్పా “పెండ్లి కానీ కన్య” లా వయ్యారాలు పోతుంది అని రాగాలు తీసింది…మరి భర్త ఏమీ అనరా? అన్నాను…వాడు పోజులకే ఉన్నాడు తప్ప ఏమీ పని పాట లేదు…అయ్యా అవ్వ సంపాదించిన ఇంత ఆస్తిని డబ్బులు చేసుకుని పెళ్ళాం అఫిస్ నుండి వచ్చే వరకు ఉరేగి రావడం తప్పా వీడికి పనీపాటా లేదు అంది…ఇలాంటి జంటలు ప్రతి వీధిలో కనిపిస్తున్నాయని అనుభవసారాన్ని విప్పింది.
తల్లిదండ్రుల మాట వినిపించుకోని యువత
సంసారం చూడ చక్కగా ఉండాలంటే భారతీయ ధర్మాలను పాటించాలి… పెళ్లికున్న పరమార్థం, సప్త పది కున్న విశిష్టత చెప్పే తల్లి దండ్రులు ఉన్నా వినిపించుకోలేని నేటి యువత వల్ల ఇలాంటి మాడ్రన్ యువతులు పుట్టుకొస్తున్నారు. మట్టెలు విశిష్టత గురించి శాస్త్రీయ దృక్పథం ఉంది…కాలి బొటన వేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువు పట్టు లాంటిది. దాని నుండి విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ వేలు నేలకు తగలకుండా ఉండేందుకు మట్టెలు ధరించే సంప్రదాయం పూర్వీకులు ఏర్పాటు చేశారు..ఇక మంగళ సూత్రం వివాహ బంధానికి నిదర్శనం. ముత్యం పగడం నల్లపూసలు…స్త్రీకి మంగళ శాసనం. శాస్త్రీయ దృక్పథం లో కూడా పెళ్లి తంతులో ఒకొక్క ముడికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. జీలకర్ర..బెల్లం లాగా విడదీయరాని అనుబంధంగా ఉండాలని మొట్ట మొదట పెళ్లిలో భర్త అయ్యే వారి స్పర్శ వధువుకు జీలకర్ర బెల్లం ద్వారా తగలాలని ఆచారం సూచిస్తుంది.
Also Read : మాటలతో ఆకట్టుకోండి, మనసు దోచే ఉద్యోగం చేపట్టండి!
ఎవరి ఇగో వారిది
అదేం ఖర్మో గానీ పెళ్లి కాకముందే బీ ఫోర్ వెడ్డింగ్ షూటింగ్ లో వధువు వరుడు అన్ని యాంగిల్ లో ఫోటోలు దిగి పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ వీడియో ప్లే చేస్తే పెళ్లి మంత్రాలకు అర్థం ఉంటుందా? అసలు గొడవలు జరగడానికి కొత్త జంటలో కోపాలు రగలడానికి వ్యక్తిత్వ ఇగో లు పెద్ద పాత్ర పోషిస్తున్నాయి…ఈ గొడవలు పోవాలంటే భార్య భర్తలు పదహారు సూత్రాలు పాటించాలి…అప్పుడు సుఖ సంసారం తో పాటు వంశాభివృద్ది జరుగుతుంది.
వివాహం జరగక ముందు ఉన్న ప్రేమ తరువాత ఎడమొహంపెడమొహంగా ఉంటుంది.. భార్య భర్తలు ఇద్దరు ఇగోలు పోకుండా ఉండాలి. పండంటి కాపురానికి అనుసరించవలసిన పదహారు సూత్రాలను ఇక్కడ చూద్దాం!
Also Read : రాత్రి అంతా నిద్ర లేకుండా చేసిన సైబర్ దొంగ
మీ భర్త/ భార్య మళ్ళీ మీతో ప్రేమలో పడటానికి 16 మార్గాలు!
1. మీ భర్త/ భార్యపై ప్రభావం చూపేలా నచ్చిన దుస్తులు ధరించండి.
2.పుట్టిన తేదీలు వాళ్ళ అమ్మా నాన్నలతో సహా గుర్తుంచుకుని ఆ రోజు సెలవులు పెట్టి కుటుంబం అంతా ఆనందంగా గడపండి.
3. బెడ్ రూమ్ లో ఆనందంగా ఉండండి… జిడ్డు ముఖం తో ఉండకండి… గది బెడ్ షీట్ తో సహా నీటుగా ఉండేలా ఇద్దరూ ప్రయత్నించండి.
4 భార్య / భర్త మీ కోసం వేచి ఉండేలా, వారు చేసే పనులకు విలువ ఇచ్చి మాట్లాడండి.
5. సరసమైన సంబంధాన్ని సజీవంగా ఉంచండి! సరళమైన బాష ఉపయోగించండి…ఒసేయ్… ఒరేయ్ అనకండి…ప్రేమగా నిక్ నేమ్ లతో లేదా వారి పేర్లతో పిలుచుకోండి.
6. అతనికి ఆసక్తి ఉన్న వంట చేయండి..ఆమె అభిరుచికి దగ్గ కూరలు ఫ్రిజ్ లో నింపండి.
7.తన స్నేహితులతో వారాంతం బయటకు వెళ్ళమని ప్రోత్సహించండి…భర్త / భార్య ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి నప్పుడు స్వేచ్ఛగా మాట్లాడే ఏకాంతం ఇవ్వండి!
8. చిన్న చిన్న పొరపోచ్చాలు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి.
9. సమస్య వచ్చినప్పుడల్లా గిల్లి కజ్జాలకు దిగకండి… సమస్య ను సానుకూలంగా పరిష్కరించడానికి ఎవరో ఒకరు తగ్గాలి…విచిత్రం ఏమిటంటే ఆ తరువాత విజయం మీదే అవుతుంది.
10. భార్య/ భర్త ఇంట్లోనో షాపింగ్ లోనో తప్పులు చేస్తారు. దాన్ని పదే పదే విమర్శించకుండా ఉండండి.
11.పొరపాట్లు మానవ సహజం. స్వచ్ఛ మైన నడవడిక నేర్చుకోండి. ఒకరి నోకరు బాధించడం మానుకోండి. ఇతరుల ముందు అతన్ని/ ఆమెను అభినందించండి.
12. మీరు చేసిన తప్పులను అంగీకరించి భార్య / భర్త క్షమాపణ చెప్పండి.
13. అతనికి/ ఆమెకు ఇష్టమైన వస్తువులను బహుమతిగా ఇవ్వండి..మధురానుభూతిని పొందేలా మాట్లాడండి.. సీజన్ లో మల్లెపూల బండి దగ్గర మీ వాహనాన్ని ఆపండి.
14. మీ వృత్తిపరమైన, వ్యక్తిగతమైన జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం నేర్చుకోండి.
15. ఆరోగ్యకరమైన సంబంధాన్ని ప్రోత్సహించే సరిహద్దులను ఏర్పాటు చేయండి.
16. మృదువైన పదజాలం లేదా హావభావాల ద్వారా మీ ప్రేమను ఎల్లప్పుడూ వ్యక్తపరచండి.
(మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా…)
Also Read : అధికారం… అహంకారం