- మోడీ స్టేడియంలో మెరిసిన ఢిల్లీ డైనమైట్
- ఇంగ్లండ్ ప్రత్యర్థిగా రిషభ్ రెండో శతకం
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ మెరుపు సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న కీలక నాలుగోటెస్టు రెండోరోజుఆటలో రికార్డుల మోత మోగించాడు. భారతజట్టు కీలక తొలిఇన్నింగ్స్ ఆధిక్యత సాధించడంలో ప్రధానపాత్ర వహించాడు.
ఇంగ్లండ్ పై రెండో శతకం:
ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూలంగా బ్యాటింగ్ చేయటంలో మొనగాడిగా పేరుపొందిన రిషభ్ పంత్ ప్రస్తుత సిరీస్ ఆఖరి టెస్టులో సైతం తన బ్యాటింగ్ జోరును కొనసాగించాడు. భారతజట్టు 84 పరుగులకే 4 కీలక వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయిన తరుణంలో క్రీజులోకి అడుగుపెట్టిన రిషభ్ తనదైన శైలిలో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. రోహిత్ తో కలసి 5వ వికెట్ కు 41, అశ్విన్ తో కలసి 6వ వికెట్ కు 25 పరుగుల కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి పరిస్థితి చక్కదిద్దాడు. అంతేకాదు మరో యువఆటగాడు వాషింగ్టన్ సుందర్ తో కలసి 7వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ ను మలుపుతిప్పాడు. మొత్తం 118 బాల్స్ ఎదుర్కొని సిక్సర్ తో శతకం పూర్తి చేశాడు. రెండు సిక్సర్లు, 13 బౌండ్రీలతో 101 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. 23 సంవత్సరాల రిషభ్ టెస్టు కెరియర్ లో ఇది మూడో సెంచరీ కాగా ఇంగ్లండ్ ప్రత్యర్థిగా రెండో శతకం కావడం విశేషం.
Also Read: విరాట్ ను వెంటాడుతున్న వైఫల్యాలు
రికార్డుల కుర్రోడు రిషభ్:
రెండుపదుల వయసులోనే ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ ప్రత్యర్థిగా టెస్టు అరంగేట్రం చేసిన రిషభ్ … ఓ టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన భారత తొలి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్ లో ఓపెనర్ రాహుల్ తో కలసి ఆరో వికెట్ కు 204 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన రిషభ్ పంత్15 బౌండ్రీలు, 4 సిక్సర్లతో కేవలం తన రెండోటెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్ లోనే మూడంకెల స్కోరు సాధించగలిగాడు. 2007 సిరీస్ లో ఇంగ్లండ్ పై నాలుగో ఇన్నింగ్స్ లో మహేంద్రసింగ్ ధోనీ సాధించిన 76 పరుగుల నాటౌట్ స్కోరే ఇప్పటి వరకూ..నాలుగో ఇన్నింగ్స్ లో ఓ భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అత్యధిక స్కోరుగా ఉంది. అయితే…ఆ రికార్డును రిషభ్ పంత్…ఓవల్ టెస్ట్ ద్వారా తెరమరుగు చేయగలిగాడు. 2018 ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ పై తన తొలి టెస్టు శతకం బాదిన రిషభ్ 2021 సిరీస్ ఆఖరిటెస్టులో సైతం ఇంగ్లండ్ ప్రత్యర్థిగానే మరో శతకం బాదడం విశేషం.
Also Read: ఆఖరిటెస్ట్ తొలిరోజునా అదే సీన్
6 టెస్టుల్లో 515 పరుగుల రికార్డు:
2021 టెస్ట్ క్రికెట్ సీజన్లో రిషభ్ పంత్ ఆడిన ఆరుటెస్టుల్లో 500కు పైగా పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 764 పరుగులతో అగ్రస్థానంలో ఉంటే…రిషభ్ పంత్ 515 పరుగులతో తర్వాతి స్థానంలో నిలిచాడు. మొత్తం 6 టెస్టుల్లో ఓ శతకం, నాలుగు అర్థశతకాలతో 500కు పైగా పరుగులు సాధించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోడీ స్టేడియంలో టెస్టు శతకం బాదిన తొలి క్రికెటర్ గా రిషభ్ పంత్ రికార్డుల్లో చేరాడు. తన కెరియర్ లో 20వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న రిషభ్ పంత్ 3 సెంచరీలు, 6 అర్థసెంచరీలతో 1358 పరుగులు సాధించగలిగాడు.