సింగరేణి కాలరీస్ కంపెనీకి సంబంధించి 99వ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ కొత్తగూడెం కార్పోరేట్ కార్యాలయంలో బుధవారం (డిసెంబర్ 30వ తేదీ) నాడు నిర్వహించారు. ఈ సమావేశంలో సాధారణంగా బోర్డు ఆఫ్ డైరెక్టర్లు తీసుకొన్న నిర్ణయాలు, డివిడెండ్ చెల్లింపు, డైరెక్టర్ల జీతభత్యాలకు ఆమోదం తదితర అంశాలపై చర్చించి ఆమోదం తెలుపుతుంటారు. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సమావేశాన్ని బుధవారం (డిసెంబర్ 30వ తేదీ) నాడు నిర్వహించారు. ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ లో క్లీన్ చిట్ సాధించిన వార్షిక అకౌంట్సుకు వార్షిక సమావేశం ఆమోదం తెలిపింది. అలాగే 2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 10 శాతం డివిడెండ్ ఇవ్వాలన్న బోర్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
సింగరేణి సంస్థ సి&ఎం.డి.గా శ్రీ ఎన్.శ్రీధర్ ను అదే హోదాలో ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు కొనసాగించాలని గతంలో సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని జనరల్ బాడీ సమావేశం మెజారిటితో ఆమోదం తెలిపింది. అలాగే డైరెక్టర్ (ఇ&ఎం)గా శ్రీ డి.సత్యనారాయణరావును సెప్టెంబర్ 2020 నుండి 2 సంవత్సరాల పాటు నియమించడానికి వార్షిక జనరల్ బాడీ మీటింగ్ తమ ఆమోదం తెలియజేసింది. ఛైర్మెన్ మరియు డైరెక్టర్ల జీతభత్యాల చెల్లింపుపై కూడా బోర్డు నిర్ణయానికి జనరల్ బాడీ ఆమోదం తెలిపింది. బోర్డు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి శ్రీ రామకృష్ణారావు, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుండి శ్రీ ఆర్.ఆర్.మిశ్రా, శ్రీ అజితేష్ కుమార్, శ్రీసందీప్ కుమార్ సుల్తానియా లను కొనసాగించాలని గత బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం తీసుకున్న నిర్ణయానికి ఈ సమావేశం ఆమోదం తెలిపింది.
సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంధన శాఖ సహాయ కార్యదర్శి శ్రీ జి.ఎల్లయ్య, కేంద్ర బొగ్గు శాఖ అండర్ సెక్రటరీ శ్రీమతి అల్కా శేఖర్, సింగరేణి సంస్థ నుండి డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీ ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్ మరియు పి&పి) శ్రీ ఎన్.బలరామ్, డైరెక్టర్ (ఇ&ఎం) శ్రీ డి.సత్యనారాయణరావు, కంపెనీ కార్యదర్శి శ్రీమతి సునీతా దేవి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రక్షణ విషయంలో ఖర్చుపై పరిమితులు పెట్టబోము