- నాటక సేవ చరిత్రలో నాలుగు తరాలు
- తెలంగాణలో మొదటిది
” ఓ నాట్యమండలి కి 85 ఏళ్లు నిండడం, నాలుగు తరాల నటులు నాటక సేవ చరిత్ర గతిలో కొనసాగడం అబ్బుర పరచడంతో పాటు , అపురూపమైనదే. గోదావరి నదీ తీరంలో గల ప్రసిద్ధ ధర్మపురి పుణ్యక్షేత్రం లో ఆవిర్భవించిన నాట్యమండలి తెలంగాణా లో మొదటిది. తెలుగు భాషకు విలువ లేని నైజాం ప్రభుత్వం లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇవ్వని నాటి బ్రిటిష్ ప్రభుత్వాల కాలం లో 1936 సంవత్సరంలో పురుడు పోసుకుని వటవృక్షంగా నేటికీ కొనసాగుతున్న ధర్మపురి నాట్యమండలి ప్రస్థానం ఇది.
నాట్య మండలి ఆవిర్భావం తీరు !!
జాగీర్ ఈనామ్ మక్త ( అగ్రహారం ) గా పేరుగాంచిన ధర్మపురి క్షేత్రం లోని జాగీర్ దార్లు, వారి మిత్రులు జాగీర్ పనులపై, హైదరాబాదుకు వెళ్తుండేవారు. అక్కడ ప్రసిద్ధ కంపెనీల నాటక ప్రదర్శనలు తిలకించేవారు. కాసర్ల వెంకట్ రాజయ్య, రాపాక రామకృష్ణయ్య, పెద్దమ్మ బట్ల నరహరి ,పాత కాంతయ్య, ఇందారపు చిన్న రామకృష్ణయ్య, ఓ నాటక ప్రదర్శన అక్కడ అ తిలకించి, వారు తాము ఒక నాటక మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే సందర్భంలో మైలవరం కు చెందిన నరసమ్మ నాటక కంపెనీ శాఖ ధర్మపురిలో నాటకాలు ప్రదర్శించింది. ఆ నాటకాన్ని తిలకించిన వారిలో కొందరు జగ్గన్న గారి విశ్వనాథం, కజ్జాల శివరామయ్య, విట్టాల రామన్న, కాకరి లక్ష్మీ కాంత శాస్త్రి, రొట్టె చంద్రశేఖరశాస్త్రి నటులుగా “సతీ సావిత్రి” నాటకాన్ని ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు. కాసర్ల వెంకట రాజయ్య సారథ్యంలో ” శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి” గా ఆవిర్భవించింది. మొదటి నాటకం 12 జూన్ 1938 న ” సతీ సావిత్రి ” నాటక ప్రదర్శన ఈ నాట్య మండలి ద్వారా ప్రదర్శించారు.
Also Read: ధర్మపురి శ్రీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు
మొదటి నాటకం తర్వాత నెల రోజులకు ద్రౌపది వస్త్రాపహరణం నాటకాన్ని ప్రదర్శించారు. మరో నెల రోజుల తర్వాత భక్త ప్రహల్లాద మూడవ నాటకం. నాలుగవ నాటకం గయోపాఖ్యానం తరువాత వరుసగా భక్త రామదాసు, సతీ సక్కుబాయి, సతీ తులసి, రాయబారం, తులాభారం, లవకుశ తదితర నాటకాలు క్రమం తప్పకుండా ప్రదర్శించేవారు.
సురవరం ప్రతాపరెడ్డి తిలకించారు !!
1946 ఫిబ్రవరి 1న నాటి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల పట్టణ కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్ మహాసభలు జరిగాయి. మురళి మనోహర్ రావు నస్పూర్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కెవి కేశవులు కార్యదర్శిగా ఈ మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయబడింది. ఈ సభలకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ నాట్య మండలి వారు “తులాభారం” నాటకం ప్రదర్శించారు. అంతా ఈ నాటకాన్ని ప్రశంసించారు మాడపాటి హనుమంతరావు స్త్రీ పాత్ర ధారి అయిన దేమ్మ బాలకిష్టయ్య ను అభినందించారు. తర్వాతి కాలంలో లో చత్రపతి శివాజీ, రంగూన్ రౌడీ, వరవిక్రయం, చింతామణి ,తదితర నాటకాలు మండలి ప్రదర్శించింది. కాసర్ల వెంకట రాజయ్య దర్శకత్వం సంగీత నేతృత్వం గా బహుముఖ ప్రతిభను ఈ నాటకాల్లో ప్రదర్శించారు సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావులే కాకుండా దేవులపల్లి రామానుజరావు, కాళోజీ నారాయణరావు, నార్ల వెంకటేశ్వరరావు, బూర్గుల రామకృష్ణారావు వానమలే వరదాచార్యులు, దివాకర్ల వెంకటావధాని, పీవీ నరసింహారావులు వీరు ప్రదర్శించిన నాటకాలను, నాట్యమండలినీ నటులను, పలు సందర్భాల్లో ప్రశంసించారు.
Also Read: నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం జువ్వాడి రత్నాకర్ రావు
ప్రముఖులతో పాటు సన్మానాలు !!
ఆంధ్ర నాటక కళా పరిషత్ 19 వ వార్షిక మహాసభలు 1955 అక్టోబర్ 21- 24 తేదీలలో ఎగ్జిబిషన్ థియేటర్ హైదరాబాద్ లో జరిగాయి. ఘంటసాల వెంకటేశ్వరరావు, రేలంగి వెంకట్రామయ్య, శాంతకుమారి, పీసపాటి, తాపీ ధర్మారావు, లతోపాటు ధర్మపురి నాట్యమండలి నటులు కాకరి లక్ష్మీకాంత్ శాస్త్రి కి సన్మానం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ కర్నూల్ సభ వారిచే వారు నిర్వహించిన నాటకోత్సవాలు 1983 మార్చి 14న నాటి ప్రముఖ హీరోయిన్ శ్రీమతి జమున ధర్మపురి నాట్యమండలి స్త్రీ పాత్రధారి బాలకిష్టయ్య ను సన్మానించారు. ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య, పెండ్యాల సీతారామయ్య ను సన్మానించారు. తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహణ లో జరిగిన సన్మాన కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారిచే రవీంద్రభారతిలో పెండ్యాల సీతారామయ్య కు సన్మానం జరిగింది .సంస్థ కళాకారులు ఎందరో ఎన్నోచోట్ల సన్మానాలు అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు అందుకున్నారు సంస్థ కూడా సహాయం పొందుతుంది.
నాట్య మండలి లో నాలుగు తరాలు !!
తొలితరం (1936 -1956 )
నాట్య మండలి ప్రారంభం 1936 విజయదశమి తొలి నాటక ప్రదర్శన వటసావిత్రి పూర్ణిమనాడు సతీ సావిత్రి నాటక ప్రదర్శన 1938 జూన్ 12. ఆంధ్ర సారస్వత పరిషత్తు ద్వితీయ మహాసభలు మంచిర్యాల్ లో శ్రీకృష్ణ తులాభారం 1-2-946. జూలై 1938 ద్రౌపది వస్త్రాపరణం. ఆగస్టు 1938 భక్త ప్రహ్లాద. 24-10-1955 ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చే కాకర్ల లక్ష్మీకాంత శాస్త్రి కి సన్మానం.
రెండవ తరం (1966-1986)
వీరపాండ్య కట్టబొమ్మన్ 1967, నాట్య మండలి రిజిస్ట్రేషన్ 1969 జనవరి 10. 1969లో స్థానిక యువజన సంఘ భవన నిర్మాణం కోసం ఆకు రాలిన వసంతం నాటక ప్రదర్శన. ధర్మపురి లోని. శ్రీ లక్ష్మీ నరసింహం సంస్కృతాంధ్ర కళాశాల సహాయార్థం. దాదా గారి కిషన్ రావు ఆధ్వర్యంలో, గయోపాఖ్యానం, నాటక ప్రదర్శన 1966-1969. నిజాంబాద్ జిల్లా నాటక పోటీలలో నాట్య మండలి ఉత్సవాలు, 1975లో ధర్మపురి సాయిబాబా థియేటర్ లో జరిగిన కార్యక్రమంలో ఈలపాటి రఘురామయ్య, చాట్ల శ్రీరాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 1982 జగిత్యాల ధరూర్ క్యాంప్ లో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా సుందరకాండ నాటక ప్రదర్శన.
Also Read: ధర్మపురి నరసింహుడి ఆలయంలో అపచారం
మూడవ తరం (1987-2007 )
కాకరి లక్ష్మీకాంత శాస్త్రి కి కర్నూల్ లో సన్మానం కాకర్ల లక్ష్మి నరహరికి రవీంద్రభారతిలో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సన్మానం. పెండ్యాల సీతారామయ్య కు తెలుగు విశ్వవిద్యాలయం లో సన్మానం. కలెక్టర్ కె ఎస్ శర్మ ఆహ్వానం మేరకు కరీంనగర్లో వీరపాండ్య కట్టబొమ్మన, నాటక ప్రదర్శన మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంగనభట్ల నరసయ్య, నరహరి గార్లకు గ్రామీణ కళా జ్యోతి అవార్డు బహూకరణ. 55 వసంత ల పండుగ స్వర్ణోత్సవాల సందర్భంగా ధర్మపురి దేవస్థానం లో 1993 సంవత్సరంలో వృద్ధ కళాకారుల సన్మానం ,సావనీర్ను విడుదల వీరపాండ్య కట్టబొమ్మన్, నాటక ప్రదర్శన ప్రముఖ సినీ దర్శకులు బి.ఎస్.నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 1999 లో రొట్టె విశ్వనాథశాస్త్రికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చే సన్మానం.
2008 నుంచి కొనసాగుతున్న నాల్గవ తరం
హైదరాబాద్, వరంగల్ ,వేములవాడ ,మట్ట పెళ్లి రవీంద్ర భారతి, నల్లగొండ తదితర పట్టణాలలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, దసరా ఉత్సవాలలో, నాట్య మండలి అనేక పద్య, గద్య సాంఘిక, నాటక ప్రదర్శనలు ఇస్తూ ప్రశంసలందుకున్నారు
80 ఏళ్ల పండుగ ఉత్సవాలు (1936. 2016 )
శ్రీ లక్ష్మీనరసింహ నాట్యమండలి 80 ఏళ్ల పండుగ ఉత్సవాలు 2017 ఏప్రిల్ 2, 3 తేదీల్లో రెండు రోజులపాటు ఘనంగా జరిగాయి. దీనికి తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ చేయూత అందించింది. ఈ సందర్భంగా నాట్య మండలి సమస్త చరిత్ర పుట్టుపూర్వోత్తరాలు వ్రాసిన గ్రంధం ఆవిష్కరణ జరిగింది. చారిత్రక, పౌరాణిక, నాటకాల ప్రదర్శన ఉత్సవాల్లో కీర్తి నిలిచాయి. వృద్ధ కళాకారులకు సన్మానాలు, యువ కళాకారుల కు ప్రశంసా పత్రాల పంపిణీ జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథిగా నాటి స్థానిక శాసనసభ్యులు నేటి మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, విశేష అతిథులుగా నాటి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బి ఎస్ రాములు, దక్కన్ టివి వైస్ చైర్మన్ , దక్కన్ ల్యాండ్, మాస పత్రిక ప్రధాన సంపాదకులు వేద కుమార్, రాష్ట్ర గిరిజన వస్తు ప్రదర్శనశాల క్యూరేటర్, మరియు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ వేదికపై ఆసీనులై నారు. ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ భాగవత పురాణ ప్రవచకులు, హంపి విద్యారణ్య పీఠ ఆస్థాన విద్వాంసులు,కాకర్ల దత్తాత్రేయ శర్మ అధ్యక్షత వహించారు. నాట్య మండలి కార్యకలాపాలు ,విస్తరణకు నిధుల కూర్పుకు, రాష్ట్రం నలుమూలల ప్రదర్శనలకు తెలుగు కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంగనభట్ల నరసయ్య , నాట్యమండలి కార్యదర్శి కొరిడె నరహరి, సంగనభట్ల రామకృష్ణయ్య. కాకరి దత్తాత్రేయ శర్మ. తదితరులు నాట్య మండలి లోని యువ నటులను మహిళా నటీమణులను ప్రోత్సహిస్తూ ఉత్తేజపరుస్తుంది అనడంలో సందేహం లేదు.
( మార్చి 27 న ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం)
Also Read: ఆలయ అధికారులు పొరపాటును సరిదిద్దుకున్నారు.. రీ టెండర్ ప్రకటన జారీ చేశారు !!