- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వ్యాఖ్యాల పట్ల నిరసన ప్రదర్శన
- సోమవారంనాడు దేశవ్యాప్తంగా కార్యాచరణకు కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు
- కేంద్రమంత్రి వాహనాల కింద పడి ఇద్దరు మరణం
ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ మౌర్య, కంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాల పర్యటనకు నిరసనగా రైతులు ఆదివారంనాడు లఖింపూర్ ఖేరీలో ప్రదర్శనలు చేస్తున్న సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలలో ఎనిమిది మంది మరణించారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారని లఖింపూర్ ఖేరీ అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు అరుణ్ కుమార్ సింగ్ తెలియజేశారు. కేంద్రమంత్రి కారుల బారు కింద పడి ఇద్దరు నిరసనకారులు మృతి చెందారనీ, నిరసనకారులపై నుంచి కారు పోనిచ్చారనీ రైతు నాయకులు చెప్పారు. రైతుల పై నుంచి వెళ్ళినట్టు చెబుతున్న కారులోని నలుగురు వ్యక్తులూ మరణించారని పోలీసులు అన్నారు. ఒక వ్యక్తి గాయపడి రోడ్డు మీద పడుకొని ఉండగా కొందరు వాహనానికి నిప్పుపెట్టినట్టు రికార్డు అయిన దృశ్యాలు స్పష్టం చేశాయి.
సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాకేంద్రాలలో మెజిస్ట్రేట్ కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఘటన జరిగిన ప్రాంతానికి రైతు నాయకుడు రాకేష్ తికాయత్, ఇతర రైతు నాయకులు బయలుదేరి వెళ్ళారు. ఎనిమిది మంది రైతులకు గాయాలు తగిలినట్టు కూడా రైతు సంఘాల నాయకులు చెప్పారు. లఖింపూర్ ఖేరీలో కేంద్రమంత్రి వాహనాల బారు రోడ్డు పక్కన నిలబడి ఉన్న రైతులమీదుగా వెళ్ళిన కారణంగా ఇద్దరు రైతులు మరణించారనీ, ఎనిమిది మంది రైతులు గాపడ్డారనీ సంయుక్త కిసాన్ మోర్చా ఒక ట్వీట్ లో తెలియజేసింది. ఇద్దరు వ్యక్తుల ఆస్పత్రికి రాకముందే చనిపోయారనీ, ఒక వ్యక్తి గాయపడ్డాడనీ అఖింపూర్ ఖేరీ జిల్లా ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లలిత్ కుమార్ వెల్లడించారు.
రైతుల నిరసన ప్రదర్శనలో పది పదిహేను మంది మాత్రమే ఉంటారనీ, వారిని పంపించి వేయడం రెండు నిమిషాల పని అనీ కేంద్ర మంత్రి మిశ్రా వ్యాఖ్యానించడం పట్ల నిరసనగా ఆదివారం ఉదయం నుంచీ రైతుల ప్రదర్శనలు చేస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి తన గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దానికి యూపీ ఉపముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఉపముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగకుండా హెలిపాడ్ ను ఘెరావ్ చేశారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత రైతులు తిరిగి వస్తుంటే వారిమీది నుంచి వాహనాలు వెళ్ళాయనీ, అక్కడికక్కడే ఒక రైతు మరణించారనీ, మరో రైతు ఆస్పత్రిలో మృతి చెందాడనీ రైతు నాయకుడు దర్శన్ పాల్ విలేఖరులకు చెప్పారు.