Sunday, December 22, 2024

కాబూల్ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్ళు, 85మంది మృతి

  • ఇది ఐసీస్ పనే, అంతర్జాతీయ నిఘా సంస్థలు
  • ఉప్పు అందింది, చర్యలు తీసుకునే లోగానే దాడులు
  • మృతులలో 13మంది అమెరికన్లు
  • 143 మందికి గాయాలు
  • పేలుళ్ళ వెనుక తాలిబాన్ లేదు: బైడెన్
  • భారతీయులు క్షేమం

కాబూల్ విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దళాలు గురువారంనాడు సృష్టించిన  రెండు రక్తపాతాలలో 85 మంది దుర్మరణం పాలైనారు.143 మంది గాయపడ్డారు. మరణించినవారిలో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇస్లామిక్ స్టేట్ కి చెందిన ఆత్మాహుతి దళాల దాడులకు తమ కమాండర్లు సిద్ధంగా ఉన్నారని అమెరికా సేనల నాయకుడు జనరల్ ఫ్రాంక్ మెకెంజీ తెలియజేశారు. తాలిబాన్ కూడా తమకు అందిన సమాచారాన్ని అమెరికా సైనికాధికారులతో పంచుకుంటున్నారనీ, కొన్ని దాడులను తాలిబాన్ నివారించి ఉంటారనీ జనరల్ అన్నారు.

 ఉగ్రవాదులు కాబూల్ లోని హమీద్ కార్జాయ్ విమానాశ్రయం వెలుపల జంటపేలుళ్ళకు తెగించారు. మృతులలో ఎక్కువమది అఫ్ఘాన్ పౌరులే. హిందువులూ, సిక్కులూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. చనిపోయినవారిలో తమ మెరీన్ కమాండోలు 12 మంది, ఒక నావికాదళం వైద్యుడు ఉన్నారని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితితో పాటు ఇండియా, మరి పెక్కు దేశాలు ఖండించాయి. ఐఎస్ఐెఎస్ -కె గురువారంనాటి దాడులకు బాధ్యత తీసుకున్నది కనుక ఆ సంస్థపైన ఎట్లా దాడులు నిర్వహించాలో సూచించాలని తాను పెంటగాన్ ను ఆదేశించినట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు.

పేలుళ్ళతో ఆ ప్రాంతం దద్దరిల్లగా గాయాలైనవారు రక్తపు మడుగుల్లో పడి ఉండి హాహాకారాలు చేయడం కనిపించింది. కొందరి శరీరాలు ముక్కులు ముక్కలైనాయి. ఈ దాడులు జరగడానికి కొద్ది గంటల ముందే ఐసీస్ (ISIS) దుండగులు దాడులకు బరితెగించనున్నారని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు హెచ్చరించాయి. దేశం వీడి వెళ్ళిపోయే ఉద్దేశంతో కాబూల్ విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న అఫ్ఘాన్ పౌరులనూ, అమెరికా సైనికులనూ లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపారు. తాలిబాన్ కూడా ఈ దాడులను ఖండించడం విశేషం.

తాలిబాన్ అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత లోగడ అమెరికా సైనికులకూ, కార్జాయ్, ఘనీ ప్రభుత్వాలకూ సహకరించిన అఫ్ఘాన్ పౌరులు ఇక తమకు అఫ్ఘానిస్తాన్ లో రక్షణ లేదని భావించి దేశం వదిలివెళ్ళడానికి సిద్ధపడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అమెరికా సైనికులు అఫ్ఘానిస్తాన్ ని వదిలి వెళ్ళడానికి గడువు ఈ నెల 31తో ముగుస్తుంది. ఈ లోగా దేశం వదిలి వెళ్ళాలని అమెరికాతో సహకరించిన అఫ్ఘాన్ పౌరుల తహతహ.

అబే గేటు నుంచి విమానాశ్రయం లోపలికి ప్రవేశించేందుకు గుమికూడిన పౌరులను లక్ష్యంగా చేసుకొని మొదటి మానవబాంబు పేలింది. అక్కడికి సమీపంలోనే ఉన్న బేరన్ హోటల్ దగ్గర మరో బాంబు పేలింది. ఈ రెండు ఘటనలలో ఆత్మాహుతి దళానికి చెందిన ఇద్దరు సభ్యులు తమను తాము పేల్చుకున్నారని అమెరికా రక్షణశాఖ కార్యాలయం ప్రతినిధి జాన్ కిర్బి చెప్పారు. అమెరికా సైనికులపైన దాడులు జరుపుతామని కొన్ని మాసాల కిందట ఐసీస్ ప్రకటించింది. దానిని దృష్టిలో పెట్టుకొనే సాధ్యమైనంత త్వరలో అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైనికులను ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయించారు.

కాబూల్ విమానాశ్రయంలో జరిగిన పేలుళ్ళలోో గాయపడినవారిని ఆస్పత్రిలో చేర్పిస్తున్న దృశ్యం

ఐసీస్ దాడులు జరిగే ప్రమాదం ఉన్నట్టు సమాచారం అందిందని బైడెన్ కు అమెరికా నిఘావర్గాలు తెలిపాయి. అమెరికా సేనలు వైదొలిగే వరకూ అటువంటి ఘటనలు ఏవీ జరగబోవంటూ తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిదీన్ హామీ ఇచ్చారు. ఐసీస్ దాడులను జబిబుల్లా ఖండించారు. తాలిబాన్ అఫ్ఘానిస్తాన్ ని స్వాధీనం చేసుకున్న వెంటనే జైళ్ళలో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేశారు. వారిలో కొందరు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని అంతర్జాతీయ నిఘావర్గాలు భావిస్తున్నాయి.

హిందువులూ, సిక్కులూ క్షేమం

కాబూల్ విమానాశ్రయంలో గురువారంనాడు జరిగిన ఆత్మాహుతి దాడుల నుంచి తలవెంట్రుక వాసిలో సుమారు 160 మంది అఫ్ఘాన్ హిందువులూ, సిక్కులూ తప్పించుకున్నారు. యుద్ధంతో కకావికలమైన ఈ దేశంలోని హిందువులూ, సిక్కులూ గురుద్వారాలో తలదాచుకున్నారు. విమానాశ్రయంలో పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందు విమానాశ్రయం దగ్గరలోనే 145 మంది సిక్కులూ, 15 మంది హిందువులూ ఉన్నారు. ఆ దేశం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కొంతసేపు అక్కడ వేచి చూసి గురుద్వారాకు తిరిగి వచ్చారు. కనుక బతికిపోయారు. సిక్కులూ, హిందువులూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని దిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్ మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజీందర్ సింగ్ అన్నారు.

వేటాడుతాం, ప్రతీకారం తీర్చుకుంటాం: బైడెన్ హెచ్చరిక

మానవబాంబుల పేలుళ్ళతో తాము బెదిరిపోమనీ, అనుకున్నట్టే ఆగస్టు 31వ తేదీన అఫ్ఘానిస్తాన్ ను వదిలి ఆఖరి అమెరికా సైనికుడు వెడతాడనీ, అంతలోపే రక్తపాతం సృష్టించి 13 మంది అమెరికా సైనికులను బలితీసుకున్న ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తి లేదనీ, ప్రతీకారం తీర్చుకుంటామనీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిజ్ఞ చేశారు. ‘‘మేము విస్మరించడం, క్షమించం, ప్రతీకారచర్యలు తీసుకొని తీరుతాం,’’ అంటూ విస్పష్టమైన ప్రకటన చేశారు. ఈ పేలుళ్ళ వెనుక తాలిబాన్ ఉన్నారని తాను భావించడం లేదనీ, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో తాలిబాన్ మిలాఖత్ అయినట్టు సమాచారం ఏదీ తమకు అందలేదనీ బైడెన్ చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles