గణతంత్ర దినోత్సవాలు జరుగుతున్న వేళ ఢిల్లీ రణరంగాన్ని తలపిస్తోంది. రైతులు తలపెట్టిన కిసాన్ పరేడ్ హింసాత్మకంగా మారింది. ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో దేశ రాజధానిలోకి ప్రవేశించారు. అడ్డుకునేందుకు లాఠీఛార్జీ చేసిన పోలీసులపై రైతులు ఎదురు దాడికి దిగారు. పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. ఐటీవో ప్రాంతంలో ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కు చెందిన బస్సును ధ్వంసం చేశారు. కర్నాల్ బైపాస్ వద్ద బారికేడ్లను తొలగించి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఫరీదాబాద్ లో రైతులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. సరిహద్దుల్లో పలుచోట్లు పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. పోలీసులు లాఠీ ఛార్జిలో స్టీల్ రాడ్ లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. దాడుల్లో పోలీసు గాయపడటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులపైకి కొంతమంది ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ లో పరిస్థితులు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఆందోళన కారులను పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆందోళన కారులు ట్రాక్టర్లతో పోలీసులపైకి విచక్షణారహితంగా దూసుకెళ్లడంతో పోలీసులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. సెంట్రల్ ఢిల్లీలోకి ప్రవేశించే అన్ని రోడ్లను మూసివేశారు. దాదాపు 60 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతుల ఆందోళన కిసాన్ పరేడ్ సందర్భంగా అదుపు తప్పింది. ఇన్నాళ్లు సంయమనంతో ఆందోళన చేపట్టిన రైతులు అనూహ్య రీతిలో హింసాత్మక ఘటనలకు పాల్పడటం ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళన కారులను ఇండియా గేట్, రాజ్ పథ్ రాజ్ ఘాట్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఇది చదవండి: మెట్టు దిగిన ప్రభుత్వం, బెట్టువీడని రైతన్నలు
మెట్రో స్టేషన్లు మూసివేత:
ట్రాక్టర్ పరేడ్ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. సెంట్రల్, నార్త్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో ప్రకటించింది.
ఇది చదవండి: ఢిల్లీలో కిసాన్ పరేడ్
పోలీసుల తీరును ఖండించిన రైతు సంఘాలు:
రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా తో పాటు పలు రైతు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆందోళనలతో రైతులకు సంబంధం లేదని రైతు సంఘాల నేతలు స్పష్టంచేశారు ఆందోళనల్లో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించినట్లు రైతు సంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.