- దేశంలో 40 వేల పాజిటివ్ కేసులు,
- మహారాష్ట్రలోనే 25 వేలకు పైగా కేసులు
- లాక్ డౌన్ దిశగా మహారాష్ట్ర
- రేపు మధ్య ప్రదేశ్ లో 24 గంటలపాటు లాక్ డౌన్
దేశంలో కోవిడ్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 40వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా ఒక్క మహారాష్ట్రలో నిన్న (మార్చి 19) ఒక్క రోజే 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలోనూ తొలిసారిగా రోజువారీ కేసులు 3,000 మార్క్ ను దాటాయి. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలను మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. కోవిడ్ నిబంధనలకు పూర్తిగా గాలికొదిలేసి పెళ్లిళ్లు, ఫంక్షన్లకు గుంపులు గుంపులుగా హాజరవుతుండటం కొవిడ్ విజృంభణకు ప్రధాన కారణమని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారు సూపర్ స్ప్రెడర్ లుగా మారుతున్నారని అన్నారు
ముంబయిలో శుక్రవారం 3,063కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు. కొవిడ్ కేసులు పెరుగుతున్నందున రోజువారీ టెస్టింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసి, 50వేలకు పెంచామని బృహణ్ ముంబయి కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ అన్నారు. రద్దీ ప్రాంతాల్లో ర్యాండమ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కరోనా రోగుల కోసం ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులలో ప్రత్యేక పడకలతో సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. వారాంతపు రద్దీని నివారించడానికి పలు ప్రాంతాలలో సంతలను నిషేధించారు. నవీ ముంబయిలో ఆరు నెలల తర్వాత అత్యధికంగా 347 కేసులు, పన్వేల్‌లో 238 కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మహారాష్ట్రలో వరుసగా రెండో రోజూ 25వేలకుపైగా కేసులు నమోదుకావడంతో మహమ్మారి రెండో దశ విజృంభణకు సంకేతమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలోని మొత్తం కేసుల్లో 65 శాతం ఒక్క మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. శుక్రవారం మహారాష్ట్ర వ్యాప్తంగా 25,681 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా మరో 70 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: కరోనా మహమ్మారితో పెరగనున్న చిన్నారుల మరణాలు
రేపు మధ్యప్రదేశ్ లో పలు ప్రాంతాలలో లాక్ డౌన్:
మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్, ఇండోర్ భోపాల్ లో 24 గంటలపాటు ఆదివారం ఉదయం 6 గంటలనుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. రాష్ట్రంలోని మిగతా నగరాలలో ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు షాపులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.. మార్చి 31 వరకు స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించారు.
కొవాగ్జిన్ కు నేపాల్ అనుమతి :
భారత్‌లో తయారు చేసిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి నేపాల్ జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించింది. కరోనా నిరోధంపై 81 శాతం సమర్థత కనబరిచిన ఈ టీకా వినియోగానికి కేంద్ర ప్రభుత్వం జనవరిలోనే అత్యవసర వినియోగం కింద అనుమతులు జారీ చేసింది. ఈ నెల ఆరంభంలో జింబాబ్వే ప్రభుత్వం సైతం కొవాగ్జిన్ టీకా వినియోగానికి పచ్చజెండా ఊపింది.
నేపాల్ ఇప్పటి వరకు ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కొవిషీల్డ్ తో పాటు చైనాకు చెందిన సైనోఫార్మ్ అభివృద్ధి చేసిన బీబీఐబీపీ-కోర్‌వీ టీకాల వినియోగానికి మాత్రమే అనుమతినిచ్చింది. భారత్ బయోటెక్ తమ టీకా కోసం జనవరి 13న దరఖాస్తు చేసుకోగా అందుకు నేపాల్ ప్రభుత్వం నుంచి ఇపుడు అనుమతి లభించింది. నేపాల్‌లో ఇప్పటి వరకు 2,75,750 మంది కరోనా బారిన పడగా సుమారు 3 వేల మంది మరణించారు.
Also Read: దేశవ్యాప్తంగా ఉధృతంగా కరోనా