- 3 దశలకు చెందిన నిర్మాణ ఏజెన్సీలు, అధికారులతో సి&ఎం.డి. సమీక్ష
- తొలిదశ, రెండవ దశలోని 219 మెగావాట్ల ప్లాంటులు ఏప్రియల్ కల్లా పూర్తి
- 3వ దశలోని 81 మెగావాట్ల ప్లాంటులు సెప్టెంబర్ కల్లా సంసిద్ధం
- పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలని ఆదేశించిన సి&ఎం.డి. శ్ ఎన్.శ్రీధర్
- మానేరు డ్యాం మీద మరో 350 మెగావాట్ల తేలియాడే సోలార్ ప్లాంటు నిర్మాణంపై సమీక్ష
సింగరేణి సంస్థ నిర్మించతలపెట్టిన 300 మెగావాట్ల సోలార్ ప్లాంటులలో మొదటి, రెండవ దశలోని 219 మెగావాట్ల సోలార్ ప్లాంటుల నిర్మాణాలు మొత్తం ఏప్రియల్ మాసాంతానికి పూర్తి చేయాలనీ, 3వ దశలోని 81 మెగావాట్ల నిర్మాణం సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి మొత్తం 300 మెగావాట్ల సింగరేణి సోలార్ విద్యుత్తును రాష్ట్ర ట్రాన్స్ కో కు అనుసంధానం చేయాలనీ సి&ఎం.డి. ఎన్.శ్రీధర్ సంబంధిత అధికారులు, ఏజెన్సీలకు సూచించారు.
హైద్రాబాద్ సింగరేణి భవన్ లో ఆయన డైరెక్టర్ (ఇ&ఎం) డి.సత్యనారాయణతో పాటు సింగరేణి సోలార్ ప్లాంటుకు చెందిన 3 దశల నిర్మాణ ఏజెన్సీలు, సోలార్ విభాగం అధికారులు, కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖకు చెందిన సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో బుధవారం (ఫిబ్రవరి 24వ తేదీ) నాడు సుదీర్ఘ సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి సంస్థ కరీంనగర్ సమీపంలోని మానేరు డ్యాంపై నిర్మించతలపెట్టిన 350 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటు డి.పి.ఆర్. ప్రతిపాదన అనంతరం సాగిన ప్రగతిని కూడా సమీక్షించారు.
Also Read: వచ్చే నాలుగేళ్లలో 14 కొత్త గనులకు ప్రణాళికలు
దేశంలో ఏ ప్రభుత్వ బొగ్గు సంస్థ చేపట్టని విధంగా సింగరేణి కాలరీస్ కంపెనీ 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటును సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాల్లో నిర్మిస్తోంది. దీనిలో తొలిదశలో రామగుండం-3 ఏరియాలో 50 మెగావాట్లు, ఇల్లందు ఏరియాలో 39 మెగావాట్లు, మణుగూరు ఏరియాలో 30 మెగావాట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలో 10 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటుల నిర్మాణం ప్రారంభించగా వీటిలో ఇప్పటికే 85 మెగావాట్ల విభాగాల నిర్మాణం పూర్తయి, విద్యుత్తు ఉత్పత్తి మొదలు కాగా దీనిని ట్రాన్స్ కో కు అనుసంధానం చేశారు.
మొదటి దశలో ఇంకా మిగిలి ఉన్న ఇల్లందు లోని 24 మెగావాట్లు వారంలోపు, రామగుండంలోని 20 మెగావాట్ల నిర్మాణం మార్చి నెలాఖరు కల్లా పూర్తి చేసి విద్యుత్తును అనుసంధానం చేయాలని సి&ఎం.డి. ఆదేశించారు. దీనికి కాలక్రమ ప్రణాళికలను రూపొందించుకొని అమలు చేయాలని ఆయన నిర్మాణ సంస్థ అయిన బి.హెచ్.ఇ.ఎల్. సంస్థ ప్రతినిధులకు, సింగరేణి సోలార్ అధికారులకు సూచించారు.
కాగా రెండవ దశలో నిర్మించతలపెట్టిన మొత్తం 90 మెగావాట్ల ప్లాంటులో మందమర్రి ఏరియలో 43 మెగావాట్లు, కొత్తగూడెం ఏరియాలో 37 మెగావాట్లు, భూపాలపల్లి ఏరియాలో 10 మెగావాట్ల ప్లాంటులను ఏప్రియల్ నెల ముగిసే నాటికి దశల వారీగా నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ అదానీ గ్రూపుకు సూచించారు.
Also Read: సింగరేణిలో రాజకీయాలు
3వ దశలో నిర్మించతలపెట్టిన మొత్తం 81 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో నీటిపై తేలియాడే 15 మెగావాట్ల ప్లాంటుల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, మరో 7 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్ కు, అలాగే రామగుండం-3 లోని ఓ.బి. డంపులపై నిర్మించే 22 మెగావాట్ల ప్లాంటు, డోర్లీ ఓ.బి. డంపులపై నిర్మించే 10 మెగావాట్ల ప్లాంటు, చెన్నూరులో నేెలపై నిర్మించే 11 మెగావాట్లు, కొత్తగూడెం ఏరియాలోని ఖాళీ ప్రదేశాల్లో నిర్మించే 23 మెగావాట్ల నిర్మాణాలను కూడా కాలక్రమ ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి చేసి ఇవ్వాలని అదానీ గ్రూపుకు సూచించారు. మొత్తం మీద ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి సింగరేణి నుండి 300 మెగావాట్ల సోలార్ విద్యుత్తును ట్రాన్స్ కో కు అనుసంధానం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రతీ నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఆయన నిర్మాణ దశ గురించి కూలంకషంగా చర్చించారు. నిర్ణయించబడిన సమయం కల్లా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ (ఇ&ఎం) డి.సత్యనారాయణ రావు, జి.ఎం. (సి.డి.ఎన్.) కె.రవిశంకర్, జి.ఎం. సోలార్ డి.వి.ఎస్.ఎస్.ఎన్.రాజు, ఎస్వోటు డైరెక్టర్ ఎన్.వి.కె.విశ్వనాథరాజు, సోలార్ సలహాదారు మురళీధరన్ రాజగోపాలన్, బి.హెచ్.ఇ.ఎల్. నుండి జి.ఎం. సుధీర్ గుప్తా, జి.ఎం. పంకజ్ గుప్తా, అదానీ కంపెనీ నుండి సి.ఎం.ఓ. ప్రశాంత్ మాథూర్, ఇంజనీరింగ్ హెడ్ చంద్రప్రకాశ్ జాదవ్, నోవస్ నుండి ఎం.డి. అన్షుమన్, సౌత్ ఇండియా హెడ్ ఆదిత్య, సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుండి మేనేజర్ పదం నారాయణ, ఏ.జి.ఎం. ప్రాజెక్టు శ్రీధర్ సింగ్ లు పాల్గొన్నారు.
Also Read: సింగరేణి డిస్మిస్ కార్మికుల దీక్షలు