ఫొటో రైటప్: పాము మహాలక్మికి చెందిన భూమి, జేసీబీ
తన కధను బయట ప్రపంచానికి చెప్పడానికి నా సెల్ పోన్ తో తీసిన మొదటి చిత్రంకు జులై 27కు రెండేళ్ళు అవుతుంది. రెండవ వీడియో చిత్రం తీసి ఈ నెల (జులై) 11వ తేదికి ఒక ఏడాది అవుతుంది. 30 సెంట్ల భూమి కోసం పాము మహాలక్ష్మి కధ కంచికి చేరడానికి మూడేళ్ళు పట్టింది.
మీకు ఈ ఫోటోలో ఒక ప్రోక్లయిన్ కనిపిస్తుంది కదా?! దానికి వెనుక వున్న కొండను చూడండి. మీరు పరిశీలనగా చూస్తే అందులో మీకు జీడి మామిడి చెట్లు కనిపిస్తాయి. అవును! దిగువనున్న ఖాళీ స్థలంలో కూడా అలాంటి జీడి మామిడి తోట ఆవరించి వుండేది. ఆ చివరి నుండి ఈ చివరి దాకా అది మొత్తం 3 ఎకరాల జీడి మామిడి తోట. ఒకానోక్కప్పుడు అక్కడ తోట వుండేది అనడానికి పురావస్తు గుర్తులాగ అవి మిగిలి వున్నాయి.
అనకాపల్లి మండలం, అచ్చియ్యపేట గ్రామానికి దగ్గిరలో వున్న కొండ పేరు “సూది కొండ.” రికార్డు దాఖలా అది కొండ బంజరు. అచ్చియ్యపేట గ్రామం పశుపోషకుల గ్రామం. పశుపోషణ, వ్యవసాయం, కూలి పని వారి జీవనాధారం.
మొన్న ఉదయం పాము మహాలక్ష్మి నుండి ఫోను. తాను ఎప్పుడు ఫోన్ చేసినా, “బాబో! నేను పాoమాలచ్చిని” అని అంటుంది. అందుకు జవాబుగా నేను “నేను ముంగిస అజయ్ కుమార్” ని అంటాను. ఇద్దరం నవ్వుకుంటాం.
Also read: నాన్ షెడ్యూల్ ఏరియా ఆదివాసీలకు రక్షణ కల్పించాలి
మొన్న తన నుండి ఫోన్. “బాబో! స్తంబాలు ఏయించినాను. ఒకపాలి వచ్చి చుడవా!” . వెళ్లి చూశాను. సర్వేయరు హద్దులు చూపించి అప్పగించిన 30 సెంట్లు (సెంటు భూమి 48 చదరపు గజాలు) భూమిలో ఒక వైపు సరిహద్దు స్తంభాలు వేయించింది. 3 ఎకరాల జీడి మామిడి తోటతో వున్న భూమి పొగా ఇప్పుడు తనకు 30 సెంట్లు భూమి దక్కింది. ఆ 30 సెంట్లు భూమి కోసం తాశీల్దార్, RDO, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ మూడు ఏళ్లుగా తిరగ వలసి వచ్చింది. తన నుండి తీసుకున్న భూమికి గాను భూమి ఇవ్వడానికి ఇన్ని తిప్పలు.
కత్తితో పోడిస్తేనో, తుపాకితో కాలిస్తేనో హింస అనుకుంటారు చాలా మంది. కాని రక్తం బయటకు రాకుండ వ్యవస్తలు చేసే ‘హింస’ ఎవరికీ కనిపించదు, వినిపించదు. అలాంటి వ్యవస్థాగత హింసకు నలిగిపోయిన జీవితం పాము మహాలక్ష్మిది.
లోవ రాజు – మహాలక్ష్మిలకు ముగ్గురు ఆడ సంతానం. పెంచాలి. పెద్ద చేయాలి, పెళ్లిల్లు చేసి పంపాలి. అందుకే భార్య, భర్తలు ఇద్దరూ సూదికొండను ఆనుకొని వున్న కొండ బంజరును సాగులోకి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొద్ది రోజులు మెట్టు (కుష్కి) పంటల సాగు చేసారు. అది చేస్తూనే జీడి మామిడి తోటను పెంచారు.
పట్టా రాలేదు .. ప్రాణం పోయింది
మూడు ఎరాల కొండ బంజరు సాగులోకి వచ్చిన తరువాత ఆ భూమికి పట్టాకోసం అనకాపల్లి తాశీల్దార్ కచేరికి తిరిగడం మొదలు పెట్టాడు లోవరాజు. మీకు తెలుసా!? తాశీల్దార్ చాంబర్ కు వుండే తలుపు తోసుకొని వెళ్ళాలంటే అక్కడ బిళ్ళ బంట్రోతు కరుణకు ముందుగా పాత్రుల్వలి. లోవరాజు వంటి వారికీ అదoత త్వరగా దొరకదు. పది సార్లు పడిగాపులు పడితే ఒక సారి ధర్మ దర్శనం దొరుకుతుంది. అలా ఎన్నో రోజులు లోవరాజు అచ్చియ్యపేటకు – అనకాపల్లికి మధ్య తిరిగాడు.
మహాలక్ష్మి కధనం ప్రకారం, ఒక రోజు తాశీల్దార్ ఆఫీసుకు వెళ్లి వచ్చిన లోవరాజు అన్నం తినలేదు. అన్యమనస్కంగా వున్నాడు. తోటలోకి వెళ్లి వస్తానని వెళ్ళిన లోవ రాజు, తాను పసిపిల్లలా సాదిన జీడి మామిడి చెట్ల మధ్యనే, తోటకోసం తెచ్చిన పురుగుల మందు తాగి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.
తన భర్త ప్రాణాల తీసుకోవడానికి కారణాలు నెమ్మదిగా తెలిసి వచ్చాయి మహాలక్ష్మి. తాశీల్దార్ కచేరిలో, తనకు ఆ అధికారికి మధ్య జరిగిన సంభాషణ లోవరాజును అంతటి తీవ్ర నిర్ణయానికి పురికోప్పింది. “పట్టాలేదు గిట్టా లేదు బయటకు ఫో” అని గదమాయించాడు అధికారి. “పట్టా ఇవ్వకోతే మందు తాగి చస్తానన్నాడు” లోవరాజు. “నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు” అధికారి. అన్నంత పనీ చేసాడు లోవరాజు.
Also read: అల్లూరి సీతారామరాజు – ఇందిరమ్మ ఇచ్చిన భూమి
ముగ్గురు ఆడ పిల్లాలు. ఆర్చేవాళ్ళు తీర్చే వాళ్ళు లేరు. కూలినాలి చేసుకుంటూ పిల్లలను పెంచింది మహాలక్ష్మి.
చట్టం తన పని తాను చేస్తే …
“చట్టం తన పని తాను చేసుకుంటూ పొతుందని” అప్పుడప్పుడు మన నాయకమ్మన్యులు అంటూ వుంటారు. అదే గనుక జరిగితే, లోవరాజుకు పట్టా వచ్చి వుండాలి. ప్రభుత్వ బంజరు భూమిని పేదలు సాగు చేస్తూ వుంటే వారు పట్టా పొందడానికి వున్న చట్టం బోర్డు స్టాoడింగ్ ఆర్డర్స్ (BSO) -15. సదరు నియమాలు ప్రకారం చుస్తే లోవరాజు పట్టా పొందడానికి నూటికి నూరు శాతం అర్హుడు. కాని ఇక్కడ చట్టం తన పని చేయలేదు. అధికారి తన పని తాను చేయలేదు.
మనిషి పోయాడు – పట్టా వచ్చింది
లోవరాజు మరణం, అందుకు కారణం బయటకు పొక్కడంతో స్థానిక ప్రభుత్వ అధికారులు ‘డేమేజి కంట్రోల్’లో భాగంగా ఆమె చేతికి ఒక పట్టా ఇచ్చారు. చదువురాని మహాలక్ష్మికి అందులో ఏముందో తెలీదు.
పాము మహాలక్ష్మి పేరుతొ ఇచ్చిన పట్టాలో తాశీల్దార్ నమోదు చేసింది కేలవం 1 ఎకరా 50 సెంట్లు. కాని తన స్వాధీనంలో వున్న భూమి 3 ఎకరాల 35 సెంట్లు. అంటే మొత్తం సాగు భూమికి పట్టా ఇవ్వలేదని అర్దం.
ఇప్పుడు చట్టం పరిభాషలో చెప్పాలంటే, ఆమె ఎకరా యాబై సెంట్లు(1.50)కు D-పట్టాదారు. మిగిలిన ఒక ఎకరా ఎనబై సెంట్లుకు(1.85) ‘ఆక్రమణదారు’.
బడి కోసం అంటూ ..
ఈ మూడు ఎకరాలను చూపించి ముగ్గురు కుమార్తెలకు పెళ్లిలు చేసింది మహాలక్ష్మి. గత ‘తెలుగు వెలుగు’ పాలనలో తన స్వాధీనంలో వున్న భూమిలో 1.50 సెంట్లు భూమిని కేంద్రీయ విద్యాలయం కోసం అంటూ తీసేశారు. అందులో వున్న జీడి మామిడి తోటను JCBతో లాగేశారు.
ఆ విద్యాలయం స్థలం సేకరణ దస్త్రాన్ని నేను సమాచార హక్కు చట్టం ఆసరాతో, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) కార్యాలయంలో పరిశీలిన చేశాను. అందులో మహాలక్ష్మి స్వాధీనంలో వున్న భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్కడా రాయలేదు. కేంద్రియ విద్యాలయం కోసం తాము ఖాళీగా వున్న భూమిని సేకరించినట్లు అందులో రాసుకున్నారు అధికారులు.
ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే, పాము మహాలక్ష్మిని ఆక్రమణదారుగా ఎక్కడ నమోదు చేయలేదు. అలా నమోదు చేసుకోవాలని ఆమెకు తేలీదు. ఒక్క రూపాయి నష్టపరిహారం లేకుండా ఎకరా యాబై సెంట్లు భూమి, అందులో ఏపుగా ఎదిగని జీడి మామిడి తోట పోయింది.
పేదలకు ఒక సెంటు పట్టా కోసం ..
25 జనవరి 2020న జగన్ మోహన్ రెడ్డి ప్రభుతం ఒక ఉత్తర్వు ఇచ్చింది. అది G.O.Ms. no: 72, MA & UD (M) Department. దానినే “లేండ్ పూలింగ్” GO అన్నారు. దీని ప్రకారం పేదలకు ఇల్ల స్థలాలు ఇవ్వడానికిగాను పేదలకు ఇచ్చిన D-పట్టా భూములను సేకరిస్తారు. D-పట్టా వుంటే, అమ్ముకొనే హక్కుతో సహా, పూర్తి హక్కులతో ఎకరాకు 18 సెంట్లు ఇస్తారు, అదే పదేళ్ళు పై బడి ఆక్రమణలో వుంటే 9 సెంట్లు మాత్రేమే ఇస్తారు.
పాము మహాలక్ష్మి సాగులో వున్న మిగిలిన భూమిని అందులోని జీడి మామిడి తోటను రెడ్డి గారి పాలనలో JCBలతో లాగేశారు. ఆమె చేతిలో ఒక కాగితం (Land Pooling ownership Certificate) పెట్టారు.
పట్టాదారు కాదు – ఆక్రమణదారు
లేండ్ పూలింగ్ పేరుతొ ఆమె భూమిని, జీడి మామిడి తోటతో సహా లాగేసిన అధికారులు ఆమె చేతిలో పెట్టిన Land Pooling ownership Certificate అనే పత్రాన్ని చుస్తే 1.85 సెంట్లుకు ఆమెను ఆక్రమణదారుగా చూపి, ఆ ప్రకారం ఆమెకు ప్రత్యామ్నాయ / పునరావాస భూమి పొందడానికి అర్హురాలని వుంది. కాని ఆమె 1.50 సెంట్లుకు D-పట్టా వున్న రైతు కదా?!
లోవరాజు చనిపోయినప్పుడు అప్పటి తాశీల్దార్ హడవిడిగా ఒక D-పట్టా నమూనా మీద రాసి, సంతకం పెట్టి ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు. దాన్ని కార్యాలయం రికార్డులలో నమోదు చేయలేదు. అంటే, పాము హహలక్ష్మి చేతిలో వున్న పట్టా కాగితంలోని సమాచారం అనకాపల్లి తాశీల్దర్ కార్యాలయం రికార్డులో లేదు. పాము హహలక్ష్మి స్వాధీనంలో వున్న భూమికి (చట్టం దృష్టిలో) ఆమె పట్టాదారు కాదు కేవలం ఆక్రమణదారు మాత్రమె. ఆక్రమణదారు గనుక ఎకరాకి 9 సెంట్లు చొప్పున లెక్కగట్టి, ఆ ద్రువపత్రoలో రాశారు. పట్టాకి, పట్టాదారు పాసు పుస్తకానికి పాము హహలక్ష్మికి తేడా తెలీదు. బాబుగారు పాలనలో భూమి రికార్డుల ఆన్ లైన ప్రక్రియ, దానికి లీగల్ / చట్టబద్దమైన గుర్తింపు ఇచ్చారు. అంటే ఇప్పుడు చేతిలో పట్టాదారు పాస్ బుక్ వుంటే చాలదు. అది ఆన్ లైన్ భూమి రికార్డులో కూడా నమోదై వుండాలి. అసలు ఆఫ్ లైన్ రికార్డు గూర్చే తెలియని పాము హహలక్ష్మి ఆన్ లైన్ సంగతులు ఎలా తెలుస్తాయి?
నా పరిశీలనలో తేలిన విషయాలు ఇలా వున్నాయి: పాము హహలక్ష్మికి 1. D- పట్టా వుంది 2. కాని అలాంటి పట్టా ఒకటి ఆమెకు ఇచ్చినట్లుగా రెవెన్యూ రికార్డులలో ఎలాంటి రిఫరెన్స్ లేదు. 3. D- పట్టాను ఆధారం చేసుకొని తనకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వమని పాము హహలక్ష్మి ఎన్నడూ అడగలేదు. తనకి ఆ విషయం తెలియదు. ఆ కారణంగా ఆమె రైతులకు ఇచ్చే ఎలాంటి సహాయాన్ని ఇన్నేళ్ళు పొందలేదు. 4. పాసు పుస్తకం అంటూ ఒకటి ఇవ్వలేదు గనుక పట్టాదరుల రిజిస్టర్ (దీనినే 1B రిజిస్టర్ అంటారు)లో పాము హహలక్ష్మి పేరు నమోదు కాలేదు. 5. అలా నమోదు కాలేదు గనుక, సదరు 1B రికార్డును కంప్యుటరుకు ఎక్కించే సమయంలో ఆమె పేరు నమోదు కాలేదు.
Also read: రెండు నెలల రేషన్ అందింది, ఆహార భద్రతా చట్టం గూర్చి తెలిసింది
కేంద్రీయ విద్యాలయం కోసం తన జీడి మామిడి తోటను JCBలతో లాగేస్తున్నప్పుడు పాము హహలక్ష్మి ఒక్కతే అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. స్థానిక అధికార, ప్రతిపక్ష గ్రామ సింహలు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఆ సమయంలో నేను దూరం ప్రాంతంలో వున్నాను.
అనకాపల్లి RDO కార్యాలయంలో కేంద్రీయ విద్యాలయం స్థల సేకరణ దస్త్రాన్ని తనఖీ చేశాను. ఎక్కడ ఆమె భూమిలో వున్నట్లు ప్రస్తావించలేదు. అప్పటికే చేజారిపోయింది. ఆనాటి రెవిన్యూ అధికారుల దాష్టికాన్ని దునమాడడానికి ఏ భాషా చాలదు.
రెండవ సారి “జగనన్న, ఒక సెంటు ఇంటి పట్టా” పేరుతో మిగిలిన భూమి లాగేశారు.
ఈ సారి కనీసం ఆమెను ఆక్రమణదారుగానైనా గుర్తించి, ఆమె వద్ద భూమి తీసుకుంటున్నందుకు GOలో ఆక్రమణదారుకు ఇచ్చే ఎకరాకు 9 సెంట్లు ప్రాప్తికి లేండ్ పూలింగ్ దృవపత్రం ఇచ్చారు. ఆమె D- పట్టా రైతా లేక అనామత్తుగా వున్న ఆక్రమణదారా ?
చిన్నకూతురు వలపోత
పత్రాలు పరిశీలించడానికి తన ఇంటికి వెళ్లాను. అక్కడ తన మూడవ కుమార్తె ఇద్దరు బిడ్డలతో అప్పుడే వచ్చి వుంది. తాను తన అక్కలు పడుతున్న బాధలను ధారగా కన్నీళ్ళు కారుతుండగా చెప్పుకొచ్చింది.
తాను అమ్మ కడుపులో ఉన్నప్పుడే నాన్న ఈ భూమి కోసం పురుగులు మందు తాగి చనిపోయాడు. కనుక నాన్న ఫోటో తప్ప తనను చూడలేదు. పాము మహాలక్ష్మి ముగ్గురు పిల్లలను పెంచింది. ఆ జీడి మామిడి తోట చూపించి, అదే కట్నం అని చెప్పి పెళ్లిల్లు చేసింది. ఇప్పుడు ఆ తోటలేదు, ఆ భూమి లేదు. దాంతో వారు తమ అత్త వారి నుండి భర్తల నుండి మాటలు పడవలసి వస్తున్నది. అవన్నీ చెపుతూవుండగా తన గొంతు జీరబోయింది. ఒక కొత్త అగంతకుడి ముందు వాళ్ళ అమ్మ ఏడ్వడం చూస్తూ ఆ పసివాళ్ళు బిత్తరపోయారు.
తుపాకీ లేదు … కాని సెల్ ఫోన్ వుంది
దండకారణ్యం అడవులలో ‘జమ్మి చెట్టు’ మీద ఆయధాలు వుండిపోయాయి. వాటిని వెతుక్కుoటూ వెళ్లిపోదుమా!? అనేంతగా ఆగ్రహం కలిగింది. చేతిలో తుపాకి లేదు కాని సెల్ ఫోన్ వుంది.
ఆ సెల్ ఫోన్ నే సాధనంగా చేసుకొని తన కధను తెరకు ఎక్కించాను. దానికి “రెవిన్యూ పెద్దపాము కాటు – ఇది పాము మహాలక్ష్మి కథ” అని టైటిల్ పెట్టాను. జులై 27, 2020న నా చానల్ ద్వారా ఎయిర్ చేసాను. (https://www.youtube.com/watch?v=RgsoLHDLmiA)
ఆ లింక్ ను నా వద్ద వున్న అన్ని ఫోన్ నెంబర్లకు పంపాను.
RDO అనకాపల్లి నుండి ఫోన్
నేను లింక్స్ ఫార్వార్డ్ చేసిన 40 నిముషాల తరువాత. అనకాపల్లి RDOగారి నుండి ఫోన్ వచ్చింది. తనకు పాము లోవరాజు విషయం తెలుసని చెప్పారు. ఆయన కొంతకాలం అనకాపల్లి మండలానికి తాశీల్దార్ గా చేసారు. మావద్ద వున్న రికార్డు పట్టుకొని తన కార్యాలయానికి రమ్మని చెప్పారు.
Also read: రూ. 2,33,04559 అప్పుల సాలెగూడు నుండి బయటపడిన రోచ్చుపనుకు ఆదివాసీలు
అనకాపల్లి మండల రెవిన్యూ కార్యాలయం డిప్యూటి తాశీల్దార్(DT)ని పిలిపించారు. పాము మహాలక్ష్మికి 1.50 సెంట్లకు D-పట్టా వుoది గనుక ఆ ప్రకారం మొత్తం ఫైల్ తయారు చేయాలని చెప్పారు. 1.50 సెంట్లు D-పట్టా భూమి, 0.35 సెంటు సాగులో వున్న భూమి మొత్తం 1.85 సెంట్లు తీసుకున్నట్లుగా రికార్డు పునరుద్దరణ అయ్యింది. ఆ ప్రాప్తికి లేండ్ పూలింగ్ GO ప్రకారం ఆమె షుమారుగా 30 సెంట్లు ప్రత్యమ్మయ భూమికి అర్హురాలని కొత్త ధ్రువపత్రం (Land Pooling ownership Certificate) ఇచ్చారు.
ధ్రువ పత్రం ఇచ్చారు – భూమి ఇవ్వడం మరిచారు
అసలు లేండ్ పూలింగ్ పేరుతొ పేదలకు ఇచ్చిన భూమి తీసుకోవడం ఏమిటి? టాట్! అంటూ కామ్రేడ్స్ కొందరు కోర్టుకు వెళ్ళారు. మరి కొద్ది నెలలు గడిచాయి. అధికారులు బదిలీలపై వెళ్లిపోయారు.
లేండ్ పూలింగ్ కోసం భూములు తీసుకున్న వారికి అనకాపల్లి మండలం “కోడూరు” అనే గ్రామంలో భూమి ఇస్తాం అంటారు కొత్త అధికారులు. పాము మహాలక్ష్మిలాంటి అనేకమంది తమ గ్రామం నుండి అక్కడ ప్రతి రోజు వెళ్తూ తమకు ఇచ్చిన భూమిని చూసుకోవడo కుదురుతుందా ?. ఈ ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం లేదు. ఇంత చిన్న విషయం అంత పెద్ద పెద్ద అధికారులకు ఎందుకు తెలీదు ?
వివిధ సోర్సుల నుండి సమాచారం సేకరిస్తే, దీనికి కారణం “రియల్ ఎస్టేట్” మాఫియా , దాని వెనుక వున్న “పొలిటికల్” మాఫియా అని అర్ధం అయ్యింది. లేండ్ పూలింగ్ కారణంగా ఇచ్చే ప్రత్యామ్నాయ భూములు అమ్ముకునే హక్కుతో ఇచ్చే భూములు. ఇలాంటి నాదారోల్లు అందరికీ ఒక చోట ఇస్తే వాళ్ళు ఎలానూ అక్కడకు వెల్లలేరు. ఈ మాఫియాగాళ్ళు, మండల రెవిన్యూ కార్యాలయం నుండి పాము మహాలక్ష్మి వంటి వారి వివరాలు సేకరిస్తారు. వారి చేతిలో తృణమోపణమో పెట్టి భూమి లాగేస్తారు. ఇది “గేం ప్లాన్”.
తన గ్రామంలో, తన వద్ద తీసుకున్న భూమిలో పాము మహాలక్ష్మికి ప్రత్యామ్నాయ భూమి ఇస్తే రోజు వెళ్లి చూసుకోగలదు. గ్రామ ప్రజల మాట సహాయం ఎలాను వుంటుంది.
తాశీల్దార్ కచేరి నుంచి కలెక్టర్ కచేరికి…
తాశీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ .. తాశీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ …. ఇలా చక్రంలా తిరుగుతూ, వినతిపత్రాలు ఇస్తూ వచ్చాం. జులై 11, 2022న “నా భూమిలోనే నాకు భూమి ఇవ్వండి” అనే మకుటంతో రెండవ వీడియో చేశాను.
మొత్తానికి భూమి అప్పగించారు
తన సంతగతి ఏమీ తేల్చని రెవిన్యూ అధికారులు, ఆమె వద్ద తీసుకున్న భూమిలో ఒక సెంటు ఇంటి పట్టాలు పంపంణి లే అవుట్ లు వెయడానికి వీలుగా భూమి చదును చేసే పనులకు సిద్దం అయిపోయారు.
“బాబో! నాకు జాడుజవాబు చెప్పకుండా నా భూమిలోకి పొక్కిలైను తెచ్చీసినారు” ఇది పాము మహాలక్ష్మి నుండి ఫోన్ సందేశం. “ఆ యంత్రాలకు అడ్డుగా కూర్చో. పోలీసులు వస్తే అరెస్టు అయిపో !” ఇది నా తిరుగు టపా. తాను అలానే చేసింది.
ఇక లాభం లేదని పెద్ద అధికారులు రంగంలోకి దిగారు. అదే లే అవుట్ లో ఆమెకు 30 సెంట్లు స్థలం మార్కింగ్ చేసి, నా సమక్షంలో అప్పగించారు. ఆ లే అవుట్ మేప్ (map) తీసుకొని, తశీల్దార్ తో సంతకం పెట్టించుకొని, ఆ సంతకం దిగువన కార్యాలయం ముద్ర కూడా వేయించి పాము మహాలక్ష్మి చేతిలో పెట్టగా ఆమెకు అధికారికంగా ఆ భూమి ఇచ్చినట్లు అయ్యింది. అయితే మరికొంత పని వుంది. కాని అది అయిపోతుంది.
మహాశయులారా! ఇప్పుడు చెప్పండి. మనది చట్టబద్దమైన, రాజ్యంగబద్దమైన పాలనేనంటారా? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నదా?
Also read: ఆదిమ తెగల ఆదివాసీల జీడి తోటలను నరికివేసే ప్రయత్నం:అడ్డుకున్న గిరిజన మహిళలు
P.S. అజయ్ కుమార్
(అనకాపల్లి తాశీల్దార్ గా పని చేసిన శ్రీనివాస్ గారికి, అప్పుడు అనకాపల్లి రెవిన్యూ డివిజన్ కు ఆర్డీవోగా చేసిన శ్రీ సీతారామ రావు గారికి నేను ఈ వ్యాసాన్ని dedicate చేస్తున్నాను)
When I completed Inter in1980 , I approached Chandragiri Tahsil office for Agricultorist certificate for entry in to Bsc(ag) under agricultorist quota as we are small farmers. At the age of 16 years, I approached them as my father died when I was 8 yrs. They didn’t give as didn’t satisfy them. I lost the seat. Still after 43 years not much change happened. As you said definitely it’s also Himsa. But who cares at a time even murder isn’t a crime.
థాంక్స్ అనే ఒక్క మాట సరిపోదు . జన్మించిన ప్రతిమనిషి మీలా ఒక రోజైనా బ్రతికిన చాలు .సమాజం తారతమ్యాలు అవతరించి పోవును నోరులేని ప్రజలగొంతైనందుకు నా ధన్యవాదాలు