దిల్లీ కోర్టు ఆవరణంలో ఒక గూండానూ, మరి ఇద్దరు వ్యక్తులనూ గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. మరి కొందరు ఈ కాల్పులలో గాయపడ్డారు. జీతేందర్ గోగీ అనే గూండాను వైరి వర్గానికి చెందిన గూండాలు కాల్చి చంపివేశారు. ఉత్తర దిల్లీలోని రోహిణిలో ఉన్నకోర్టులో ఈ ఘటన జరిగింది, దాడిచేసినవారిలో ఇద్దరిని రక్షణదళానికి చెందినవారు కాల్చి చంపినట్టు చెబుతున్నారు. మొత్తం 30 నుంచి 40 రౌండుల వరకూ కాల్చారని తెలుస్తున్నది. తుపాకీ కాల్పుల మధ్య న్యాయవాదులూ, ఇతరులూ అటూ ఇటూ పరుగులు తీయడం కనిపించింది.
జీతెందర్ గోగీనీ, దిల్లీ యూనివర్శిటీలో అత్యధిక మార్కులు సంపాదించిన కుల్దీప్ ఫజ్జానూ నిరుడు దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ కు చెందిన అధికారులు అరెస్టు చేశారు. తుపాకులూ, తూటాలనూ ఆ సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 25 మార్చి 2020నాడు కుల్దీప్ ఫజ్జా పోలీసు నిఘాను తప్పించుకొని పారిపోయాడు. గోగీ ముఠాలో 50 మందికి పైగా ఉన్నారని పోలీసులు చెప్పారు. గోగీ సమాచారం అందించినవారికి రెండు లక్షల పారితోషికం ఇస్తానని హరియాణా ప్రభుత్వం, నాలుగులక్షలు చెల్లిస్తానని దిల్లీ ప్రభుత్వం ప్రకటించాయి.
అనేక నేరాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపైన తీహార్ జైలులో ఉంటున్న పేరుమోసిన రౌడీ జీతేదర్ ని రోహిణి కోర్టు నంబర్ 206లో శుక్రవారంనాడు పోలీసులు హాజరుపరిచారు. ఆయనకు ప్రత్యర్థివర్గమైన తుల్లు తాజ్ పురియా ముఠాకు చెందిన సభ్యులు లాయర్ల దుస్తులలో మారువేషంలో కోర్టులో ప్రవేశించారు. గోగిపైన కాల్పులు జరిపారు. అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ‘‘ ప్రత్యర్థివర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జీతేందర్ గోగీపైన కాల్పులు జరిపారు. వారిద్దరినీ దిల్లీ పోలీసు విభాగినికి చెందిన స్పెషల్ సెల్ భద్రతాసిబ్బంది కాల్చివేశారు,’’ అని దిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ అస్థానా వివరించారు. పోలీసులు వెంటనే స్పందించి కాల్పులు జరుపుతున్న ఇద్దరినీ కాల్చిచంపారు. గోగీతో సహా మొత్తం ముగ్గురు చనిపోయారు. కోర్టు ఆవరణలో భద్రతాలోపాన్ని ఈ ఘటన పట్టి ఇస్తున్నది. ఈ రెండు ముఠాల మధ్య కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటంలో కనీసం 25 మంది మరణించి ఉంటారు.
హరియాణాకు చెందిన గాయని హర్షిత హత్యకేసులో కూడా గోగీ పేరు వినపడింది. నరేలాలో ఆమ్ ఆద్మీపార్టీ నాయకుడు వీరేంద్రమన్ ను కూడా గోగీ ముఠానే చంపింది. 2018లో గోగీ, తుల్లూ ముఠాల మధ్య బురారీలో బాహాబాహీ పోరాటంజరిగింది. ముగ్గురు వ్యక్తులు మరణించారు. అయిదుగురు వ్యక్తులు గాయపడ్డారు.