Tuesday, January 21, 2025

బీజేపీని ఓడించేందుకు ‘ఇండియా’ కు మూడు రణక్షేత్రాలలో మూడు వ్యూహాలు

గతంలో 2019లో ఎన్నికల కంటే ముందు బీజేపీ ఓట్ల శాతం అమాంతంగా పెరిగినట్టు ఈ సారి 2024 ఎన్నికల ముందు పెరగదని నా అంచనా. దాని ఆధారంగానే కింది విశ్లేషణ.

వరుసగా మూడవసారి విజయం సాధించకుండా బీజేపీని నిలువరించడం సాధ్యమా? 2024 ఎన్నికలలో అధికార పార్టీ మెజారిటీ సాధించకుండా నిరోధించడానికి ఏదైనా వ్యూహం ఉన్నదా? చాలామంది రాజకీయ పరిశీలకులూ, స్వతంత్ర విశ్లేషకులూ ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు, చేతులెత్తేసినట్టు కనిపిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు సైతం అంతే.

నేను మాత్రం అంగీకరించను. ఏదో చివరి క్షణంలో అద్భుతాలు జరుగుతాయని నమ్మడం వల్ల కాదు. ‘ఇండియా’కు ఆధిక్యం వస్తుందన్న విశ్వాసం ఉండటం వల్ల కూడా కాదు. ఇటీవల మూడు హిందీ రాష్ట్రాలలో బీజేపీ విజయం పంపించే సంకేతాలను నేను పట్టించుకోబోనని కాదు. నరేంద్రమోదీ ప్రభుత్వంపైన నా అభిప్రాయం ఎట్లా ఉన్నప్పటికీ ప్రధాని ప్రాబల్యం గురించి అభిప్రాయ సేకరణ వెల్లడించిన అంచనాను కాదనలేను.

Also read: 2023 ఎన్నికల ఫలితాలపై సోమరి వివరణల వెనుక వాస్తవాలు, ప్రతి విశ్లేషకుడికీ అంతుచిక్కని మార్పులు, బదలాయింపులు

అయినప్పటికీ, 2024 ఎన్నికల సంగతి ఇప్పటికే తేలిపోయిందనే అభిప్రాయంతో నేను ఏకీభవించను. వాస్తవాలూ, సాక్ష్యాలూ ఏమిటో పరిశీలించడం

నేర్చుకున్నాను. వాటి చుట్టూ అల్లిన సానుకూలమైన కృత్రిమ అభిప్రాయాన్ని తగ్గించి వాస్తవాలను వీక్షించడం తెలుసుకున్నాను. నిజమే. ఇటీవల జరిగిన ఎన్నికల పలితాలూ, సర్వే నివేదికలూ పరిశీలించిన అనంతరం బీజేపీ 2004లో లాగా పెద్ద వ్యత్యాసంతో ఓడిపోయి దిగ్భ్రాంతికి గురి అవుతుందని అనుకోవడం లేదు. కానీ కనిపిస్తున్న సాక్ష్యాధారాల ప్రకారం ‘ఇండియా’కు ఆధిక్యం రాకపోయినా బీజేపీ 273 స్థానాల మార్కుకు తక్కువే సాధించవచ్చునని అనిపిస్తున్నది. ప్రతిపక్షానికి వ్యూహం ఉంటే, దాన్ని అమలు పరచడానికి అవసరమైన రాజకీయ ఆకాంక్ష, సృజనాత్మక శక్తీ ఉన్నట్లయితే,  ఈ ఫలితం సాధ్యం కావచ్చు. కనుక ఈ రోజుకు 2024 ఎన్నికలలో ఫలితాలు ఎటువైపైనా రావచ్చు.

ప్రతిపక్షాలు అనుసరించవలసిన వ్యూహం రేఖామాత్రంగా ఇది. 2024 ఎన్నికల పోరాటాన్ని మూడు మండలాలుగా లేదా యుద్ధభూములుగా లేదా రణక్షేత్రాలుగా విభజిద్దాం – ప్రథమ, ద్వితీయ, తృతీయ. మూడు రణక్షేత్రాలకు మూడు రకాల వ్యూహాలు రూపొందించాలి.

మూడు రణక్షేత్రాలు, ఏ విధంగా పోరాడాలి?

బీజేపీ ఎన్నికల శక్తిగా బలహీనంగా ఉన్న తృతీయ క్షేత్రం ముందుగా పరిశీలిద్దాం. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బీజేపీ ద్వితీయ శక్తి కూడా కాదు. వీటికి పంజాబ్, కశ్మీర్, మిజోరం, నాగాలాండ్, లక్షద్వీపాలను కూడా కలపాలి. ఈ జాబితాలో 120 లోక్ సభ స్థానాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో బీజేపీ పోయినసారి ఆరు స్థానాలు మాత్రమే గెలుచుకుంది – తెలంగాణలో నాలుగు, పంజాబ్ లో రెండు. గత అయిదేళ్ళలో ఈ ప్రాంతంలో బీజేపీ చెప్పుకోదగిన విధంగా బలం పెంచుకోలేదు. బెంగాల్ లోలాగా తెలంగాణలో విజృంభించాలని కలలు కన్నది కానీ సాధ్యం కాలేదు. మామూలు పరిస్థితులలో అయితే ఈ ఆరు స్థానాలనూ నిలబెట్టుకోవడం కష్టం. పంజాబ్ తో అకాలీదళ్ తోనూ, తెలంగాణలో బీఆర్ఎస్ తోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొత్తు పెట్టుకుంటే మాత్రం వేరే రకంగా ఫలితాలు ఉంటాయి.

‘అడ్డగించి, నిలువరించడం’ అన్నది ఈ ప్రాంతంలో ‘ఇండియా’ కూటమి ఆచరించదగిన వ్యూహం. ఈ రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక కూటమి అవసరం లేదు. బీజేపీ గెలవడానికి ప్రయత్నించే ఆ కొన్ని సీట్లపైన దృష్టి కేంద్రీకరిస్తే చాలు. ఉదాహరణకు కేరళలో తిరువనంతపురం, తమిళనాడులో కన్యాకుమారి, కొయంబత్తూరు. ప్రతిపక్షాలు, పౌరసమాజం నిర్దిష్టమైన ప్రచారం చేస్తే బీజేపీని నిలువరించవచ్చు. కాకపోతే కొన్ని ఓట్ల బదిలీకి ఇండియా భాగస్వామ్య పక్షాలు సర్దుబాటు చేసుకోవచ్చు. ఇందుకు తోడుగా బీజేపీకి ప్రస్తుతం ఉన్న మిత్రపక్షాలు గెలుచుకునే సీట్ల సంఖ్యను తగ్గించగలగాలి.

Also read: తెలంగాణలో కాంగ్రెస్ పునరుద్ధరణ 2023 ఎన్నికలలో చెప్పుకోని కథ, అది గాలా లేక తుపానా?

ద్వితీయ రణక్షేత్రంలో 223 స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ గట్టిగా ఉంది. వచ్చే మూడు మాసాలలో దాన్ని కదిలించజాలం. ఇది ప్రధానంగా హిందీ ప్రాంతం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, ఢిల్లీ. దీనికి గుజరాత్, జమ్మూ, అస్సాంను కలపాలి. త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, గోవా వంటి చిన్న ప్రాంతాలను కూడా కలిపివేయండి. దీన్ని బీజేపీ అనుకూల మండలం అనవచ్చు. పోయిన సారి ఇక్కడ 85 శాతం సీట్లు గెలుచుకున్నది. 223లో 190 స్థానాలు కైవసం చేసుకున్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అభిప్రాయ సేకరణ సర్వేల ప్రకారం ఇప్పటికీ ఇక్కడ బీజేపీ అజేయంగానే ఉంది. బీజేపీ ఇక్కడ మొత్తం కైవసం చేసుకోవాలి. బీజేపీ విజయాలు  85 శాతం నుంచి కాస్త తగ్గి 75 శాతానికి పడిపోతే, అధికారపార్టీ ఆధిక్యానికి గండి పడుతుంది. ప్రతిపక్షాలకి ఇక్కడే అవకాశం ఉంది.

కొరుకుడు పద్ధతి

‘కొరుకుడు పద్ధతి’ (చిప్పింగ్ అవే)ని ప్రతిపక్షాలు ఇక్కడ అవలంబించవచ్చు. కొన్ని పరిమితమైన స్థానాలపైన దృష్టిపెట్టి ప్రతిపక్షాల శక్తియుక్తులన్నిటినీ వాటిపైనే కేంద్రీకరించాలి. ఉదాహరణకు గుజరాత్ బీజేపీకి పెట్టని కోటగానే ఉంది. గిరిజన ప్రాంతంలో నాలుగు స్థానాలపైన కాంగ్రెస్ దృష్టి పెట్టాలి. రాజస్థాన్ లో ఈశాన్య ప్రాంతంలో అరడజను స్థానాలు గెలుచుకునే అవకాశాలు కాంగ్రెస్ కు ఉన్నాయి. అదే విధంగా రాజస్థాన్ దక్షిణ ప్రాంతంలో  రెండు ఆదివాసీ స్థానాలు కాంగ్రెస్ కు రావచ్చు. దానికి భారతీయ ఆదివాసీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవలసి ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ లో కష్టం. సమాజ్ వాదీపార్టీ-ఆర్ఎల్ డీ- కాంగ్రెస్ కూటమి ఉత్తర ప్రదేశ్ లో రెండు  డజన్ల స్థానాలలో విజయం కోసం ప్రయత్నించవచ్చు. ఈ రాష్ట్రాలలో ప్రతిపక్షాలు బీజేపీ నుంచి ఓట్లు లాక్కోనవసరం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఓట్లను నిలబెట్టుకుంటే చాలు. అది కూడా కొన్ని ప్రాంతాలలోనే. ఇక్కడ కూడా ఉత్తర ప్రదేశ్ లో మినహా మరెక్కడా ప్రతిపక్షం మహాకూటమి అవతారంలో ఉండవలసిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి అక్కడక్కడ చిన్నచిన్న పక్షాలతో కూటమి పొత్తులు పెట్టుకోవచ్చు. అటువంటి 50 నియోజకవర్గాలపైన ప్రతిపక్షాలు దృష్టి పెడితే కనీసం 20 లేదా 25 స్థానాలు ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి గెలుచుకోవచ్చు.

ఈ వ్యూహం ప్రకారం ‘ఇండియా’ కూటమి ప్రథమ రణక్షేత్రంపైన దృష్టి సారించవచ్చు. ఈ రణక్షేత్రంలో తక్కిన 200 స్థానాలు ఉన్నాయి. పోయినసారి బీజేపీ ఇక్కడ అద్భుతమైన విజయాలు సాధించింది. ఇప్పుడు అంత బాగా చేయకపోవచ్చు. కారణాలు వేర్వేరు. మహారాష్ట్ర, బీహార్ లలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ‘ఇండియా’కు అనుకూలంగా పరిస్థితి మారినట్టు కనిపిస్తున్నది. పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలలో 2019 ఎన్నికల నుంచి బీజేపీ కష్టాలు ఎదుర్కొంటున్నది. హరియాణలో రైతుల ఉద్యమం వాతావరణాన్ని మార్చివేసింది. ఒడిశాలో బీజేడీ బీజేపీకి లోక్ సభ స్థానాలు 2019లో ఇచ్చినట్టు ఇవ్వకపోవచ్చు. ఈ జాబితాకు మణిపూర్, మేఘాలయ, లద్ధాఖ్, చండీగఢ్, పుదుచ్ఛేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాలను కలపవచ్చు. ఈ స్థానాలలో బీజేపీ 2019లో 107స్థానాలు గెలుచుకుంది. మిత్రపక్షాలను కలుపుకుంటే 147 స్థానాలు.

పూర్తిస్థాయి పోరాటం

ఇక్కడ ప్రతిపక్షం పూర్తిస్థాయిలో పోరాటం చేయాలి. అధికారపార్టీకి స్థానాలు తగ్గే విధంగా యుద్ధం చేయాలి. సీట్ల సర్దుబాట్లతో  సరిపెట్టుకోకుండా మంచి పటిష్టమైన కూటమిలాగా ‘ఇండియా’ పోరాడాలి. బీహార్, మహారాష్ట్రలలో అతిపెద్ద కూటమి కావాలి. మహారాష్ట్రలో వంచిత్ బహుజన అగాధీనీ, బీహార్ లో సీపీఐ-ఎంఎల్ నీ కలుపుకోవాలి. బెంగాల్ లో కాంగ్రెస్-తృణమూల్ గొడవలు సద్దుమణగాలి. సీపీఎంతో ఒక అవగాహనకు రావాలి. చిన్న చిన్న పార్టీలతో, గ్రూపులతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవాలి. ఉదాహరణకు కర్ణాటకలో చీలిపోయిన జేడీ(ఎస్), హరియాణా, హిమాచల్ ప్రదేశ్ లలో చిన్న గ్రూపులతో అవగాహనకు రావాలి. ఒడిశాలో ప్రతిపక్ష స్థానాన్ని కాంగ్రెస్ ఆక్రమించుకోవాలి. దీని తర్వాత ‘ఇండియా’ నాయకులు శక్తివంతమైన ప్రచారం చేయాలి. ‘ఇండియా’ కూటమి పక్కాగా ఒక వ్యూహం ప్రకారం వ్యవహరిస్తే అధికారపార్టీకి 30 లేదా 40 స్థానాల నష్టం చేయవచ్చు.

ఈ మూడు రణక్షేత్రాలలో అధికారపార్టీకి ప్రతిపక్షాలు నష్టాలు కలిగించగలిగితే బీజేపీకి 50 (0+20+30) స్థానాలు తగ్గవచ్చు. అప్పుడు బీజేపీకి వచ్చే స్థానాల సంఖ్య 253కి తగ్గుతుంది. అంటే మెజారిటీ మార్క్ కు 20 స్థానాలు తక్కువ. మిత్రపక్షాలు దెబ్బతింటే బీజేపీ ఈ కొరవ పూడ్చడం కష్టం కావచ్చు. ఇదే జరుగుతుందని చెప్పజాలం. కానీ ఇది కూడా జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత విశ్లేషణ నిజం కావాలంటే కొన్ని షరతులూ, నిబంధనలూ ఉంటాయి. 2019లొ లాగా వచ్చే రెండు, మూడు మాసాలలో బీజేపీ ఓట్లు అమాంతరంగా పెరగకూడదు. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటు చేసినవారు అకస్మాత్తుగా బీజేపీవైపు మొగ్గకూడదు.  ఈ అంచనా నిలబడాలంటే ‘ఇండియా’ విఫలం కాకూడదు. దేశానికి ఒక అజెండా ప్రసాదించి ప్రస్తుత అధికారపార్టీకి తగిన ప్రత్యామ్నాయ కూటమిగా ప్రజలు భావించే విధంగా నడుచుకోవాలి.

ఈ మాత్రం ఆశించడం, అడగడం అత్యాస అవుతుందా? నిర్ణయం మీకే వదిలివేస్తున్నాను.

Also read: మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ పోరాటం

Yogendra Yadav
Yogendra Yadav
యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు. స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ సంస్థల సభ్యుడు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై శ్రమిస్తున్న బుద్ధిజీవులలో ఒకరు. దిల్లీ నివాసి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles