ప్రజాస్వామ్యం ఓటు అనే శక్తిమంతమైన ఆయుధాన్ని ప్రసాదించింది. `ఓటు` అనే రెండక్షరాల పదం జాతి రాతనే మారుస్తుంది. ఓటు వేయడం ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కు. కుల,మత, ప్రాంత, లింగ,వర్ణ, జాతి, భాష అనే భేదం లేకుండా 18 ఏళ్లు నిండిన వారందరికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 కింద ఓటు హక్కు కల్పించారు. కానీ దానిని ఎంత వరకు వినియోగించుకుంటున్నారు? ఏ మేరకు సద్వినియోగమవుతోందన్నదే ప్రశ్న.
ఓటు వేయకపోవడం గొప్పకాదు
పోలింగ్ రోజును కేవలం సెలవు దినంగా భావించడం కాకుండా సరైన వ్యక్తులను తమ ప్రతినిధులుగా ఎన్నుకోవడం ద్వారా జాతి నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములు కావలసి ఉంది.ప్రతి ఓటు విలువైనదే. ఒక్క ఓటు తేడాతోనే ఫలితాలు తలకిందులైన సందర్భాలూ ఉన్నాయి. `నేను ఇప్పటి వరకు ఓటు వేయలేదు` అని కొందరు గొప్పగా చెప్పుకుంటుంటారు. ఓటు కలిగి ఉండి కారణాం తరాల వల్ల దానిని వినియోగించుకోలేకపోతే ఏమో కానీ అవకాశం ఉండీ ఓటు వేయకుండా ఇలాంటి ప్రకటలను చేసే వారిని వారి విచక్షణకే వదిలేయాలి. అయితే పనిచేయని వారికి తినే హక్కులేనట్లే ఓటు హక్కు వినియోగించుకోని వారికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కానీ, అది తీసుకునే నిర్ణయాలను నిలదీసే హక్కు కానీ లేదంటారు నిపుణులు, విశ్లేషకులు. అలాగే ఓటును నోటుకు తాకట్టు పెట్టే వారూ ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోయినట్లే అవుతుంది. `మేము డబ్బు ఇచ్చాం. మీరు ఓటేశారు`అని సంబంధిత నాయకగణం ఎదురు దాడికి దిగితే సమాధానం ఉండదు.అలాంటి అనుభవాలూ ప్రసార సాధనాల ద్వారా వెల్లడవుతూనే ఉన్నాయి.
అభ్యర్థుల గుణగణాలు,పూర్వ చరిత్ర,సేవాభావం,సమర్థతను గుర్తెరిగి నచ్చిన వారిని ఎన్నుకొని ప్రభుత్వ నిర్మాణంలో భాగస్వాములు కావడమే ఓటు హక్కు పరమార్థంగా చెబుతారు. ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉండాలో నిర్ణయించుకునే అధికారం ఓటు హక్కు ద్వారా ప్రతి పౌరుడికి సంక్రమించింది.
Also Read : టోక్యో ఒలింపిక్స్ కు కరోనా గ్రహణం
విప్లవాత్మక చర్య
మన దేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రపంచ రాజకీయాల్లోనే విప్లవాత్మకమైన చర్యగా నిపుణులు విశ్లేషిస్తారు. ఓటు హక్కు సాధనకు ఎన్నో దేశాలలో వందల ఏళ్లు పడితే భారత్ లో స్వరాజ్యం సిద్ధించి, రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే ఆ అవకాశం దక్కింది. మన దేశంలో సార్వత్రిక ఓటు హక్కు ప్రవేశ పెట్టేనాటికి గ్రీసు, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి దేశాలలో కొన్ని వర్గాల వారికి ఓటు హక్కు దక్కలేదు. కొన్ని దేశాలలో ఓటు హక్కు ధనికులకే పరిమితం కాగా,ఇంకొన్నిచోట్ల పురుషులే ఆ హక్కు కలిగి ఉండేవారు. అలాంటి దేశాలతో దేశంతో పోల్చి చూస్తే మన రాజ్యాంగ పరిణితి స్పష్టమవుతుంది.
యువతకు ప్రాధాన్యం
దేశ నిర్మాణంలో యువతకు భాగస్వామ్యం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఓటర్ గా నమోదు కావడానికి వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో యువత పాలుపంచుకునేలా ఆర్టికల్ 326కు చేసిన 61వ సవరణ 1989 మార్చి 29న అమలులోకి వచ్చింది. ఇది ఆహ్వానించదగిన పరిణామమే కానీ వారు ఓటు హక్కును మేరకు ఉపయోగించుకుంటున్నారనేదే ప్రశ్న. అందుకు ఇటీవల జరిగిన హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీఏ) ఎన్నికలను ఉదాహరణగా చెబుతారు.
Also Read : కేసీఆర్ కి మార్చి పిదప మహర్దశ?
మాధ్యమాలలో ప్రచారం
ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇటీవల కాలంలో ఎన్నికల ముందు ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేస్తున్న తీరు తెలిసిందే. కొన్ని సంస్థలైతే ప్రోత్సాహకాలు కూడా ప్రకటించాయి.నిజమైన పౌరుడిగా నిర్వర్తించవలసిన బాధ్యతను ఇతరులతో, సెలబ్రిటీలతో గుర్తు చేయించవలసి వస్తోంది. ఓటు వేయని వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయవద్దంటూ సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు వచ్చేస్థాయికి పరిస్థితి చేరింది.
గ్రామీణులే ముందంజ
ఓటు హక్కు వినియోగించుకోవడంలో పట్టణ, నగర ఓటర్ల కంటే గ్రామీణులు ముందుంటారని పలు ఎన్నికల ఓటింగ్ సరళి చెబుతోంది. మారుమూల ప్రాంతాలలో వయో వృద్ధులను,గర్భణీలను మంచాలు, డోలీలు, చేతులపై తీసుకు రావడం మాధ్యమాలలో కనిపిస్తున్నదే. అక్కడి వారికి పోలింగ్ అంటే పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది.
నిర్బంధ ఓటింగ్
ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటునిర్బంధ ఓటు విధానం ప్రవేశపెట్టాలనే అంశంపై 1951 నుంచి చర్చ జరుగుతూనే ఉంది. 1951లో ప్రజాప్రాతినిధ్య బిల్లుపై చర్చ సందర్భంగా ఒక సభ్యుడు చేసిన ప్రతిపాదనను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తోసిపుచ్చారు. ఆచరణలో ఇబ్బందులు ఎదురవు తాయన్న ఉద్దేశంతో ఆ నిర్బంధ ఓటు ప్రతిపాదనను తిరస్కరించారు. 1990లోనూ ఈ అంశం చర్చకు వచ్చింది.`తప్పనిసరి` ఓటింగ్ విధానం అంశాన్ని దినేష్ గోస్వామి కమిటీ క్లుప్తంగా పరిశీలించింది. దీనివల్ల ఓటింగ్ శాతం మెరుగుపడుతుందని కమిటీలోని ఒక సభ్యుడు చేసిన సూచన కూడా `అమలులో ఇబ్బందులు ఉన్నాయ`నే కారణంతోనే పక్కకు వెళ్లింది. తిరిగి 2004లో ఈ అంశంపైనే ఎంపీ బాచి సింగ్ రావత్ లోక్ సభలో నిర్బంధ ఓటింగ్ పై ప్రైవేట్ బిల్లును ప్రవేశపెడుతూ, అనారోగ్యంతో బాధపడేవారికి తప్ప ఇతర అర్హులైన ఓటర్లకు తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు. అయితే పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండడం, రోజువారీ వేతన కార్మికులు, సంచార జాతులు, దివ్యాంగులు, గర్భణీల ఇబ్బందుల దృష్ట్యా అది సాధ్యం కాదంటూ కొందరు సభ్యులు వాదించడంతో అది ఆమోదానికి నోచుకోలేదు.
Also Read : కేటీఆర్ పట్టాభిషేకమా? కేసీఆర్ అస్త్ర సన్యాసమా?
కొన్ని దేశాలలో తప్పనిసరి ఓటింగ్
మరోవంక ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు అక్కడి పౌరులు ఓటు వేయడాన్ని తప్పనిసరి చేశాయి. ఉదాహరణకు, ఆస్ట్రేలియా తగిన కారణంగా లేకుండా ఓటింగ్ కు గైర్హాజరైతే వివరణ కోరడంతో పాటు జరిమానా ఉంటుంది. అక్కడ 1924 నుంచి సాధారన పోలింగ్ శాతం 90 శాతానికి మించి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. బ్రెజిల్, అర్జెంటీనా, బొలీవియా సహా దక్షిణాఫ్రికాలోని అనేక దేశాలలో నిర్బంధ ఓటు విధానం ఉంది.
Also Read : నిఖార్సైన కలంయోధుడు ‘ఖాసా’
ఓటర్ల దినోత్సవం
ఈ నేపథ్యంలో కొత్త ఓటర్లను ప్రోత్సహించడం, అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేయించడం, ఈ ప్రక్రియను సులభతరం చేయడం ఈ ఏడాది ఓటర్ల దినోత్సవ సందర్భంగా లక్ష్యంగా పెట్టుకున్నారు.ఓటర్లకు వివిధ అంశాలపై అవగాహన, చైతన్యం కల్పించేందుకు 2011 నుంచి ఏటా జనవరి 25వ తేదీన ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. `ఓటు నా జన్మహక్కు`అని భావించిన నాడే ఆ ఆయుధం పదును తేలుతుంది, దేశ పురోగతికి ఉపకరిస్తుంది.
(జనవరి 25… ఓటర్ల దినోత్సవం)