- ప్రచారంలో దూసుకెళుతున్న ప్రధాన పార్టీలు
- నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యం-హరీష్
దుబ్బాక శాసన సభ నియోజక వర్గానికి జరుగుతున్న ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలతో పాటు మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు 46 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 17 న నామినేషన్ల పరిశీలనలో 12 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మరో 11 మంది అభ్యర్ధులు తమంతట తామే నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. టీఆర్ఎస్ నుంచి దింగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత బీజేపీ నుంచి మాధవనేని రఘనందన్ రావు, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక బరిలో నిలిచారు. మరో నలుగురు అభ్యర్థులు చిన్న పార్టీల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక మిగిలిన 15 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉప ఎన్నికకు నవంబరు 3 వ తేదీన పోలింగ్ జరగనుండగా… నవంబరు 10 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
ప్రధాన పార్టీల ప్రచార హోరు
దుబ్బాక ఉప ఎన్నికలో పోరులో తలపడే అభర్థులెవరో తేలింది. ఓటర్ల మనసును గెలుచుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పడని పాట్లు అన్నీ ఇన్నీ కావు. వీరితో పాటు ఆయా పార్టీల ముఖ్య నేతలు కూడా ఓటర్ల మనసును గెలుచుకునేందుకు శ్రమిస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల ప్రచారం తారాస్థాయికి చేరుతోంది. సవాళ్లు ప్రతిసవాళ్లతో నేతలు రాజకీయ వేడిని పెంచుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు క్షేత్ర స్థాయిలో ప్రచారం జోరును మరింత పెంచారు. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ తాము చేసిన అభివృద్ధితోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేయకుండా కేంద్రం ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంబిస్తోందని విమర్శలు కురిపిస్తున్నారు. టీఆర్ఎస్ తరపున మంత్రి హరీష్ రావు అంతా తానై శ్రేణులను ముందుకు నడిపిస్తున్నారు. ఆ పార్టీ తరపున సోలిపేట సుజాత ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఈ నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టిస్తారని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అవినీతిలో అంటకాగుతున్న టీఆర్ఎస్: ఉత్తమ్
మరోవైపు టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు స్థానికంగానే మకాం వేసి శ్రీనివాస్ రెడ్డికి పట్టం కట్టాలని ఓట్లర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని దుబ్బాకలో కాంగ్రెస్ ను ఆదరించి టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మణిక్కం ఠాగూర్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా
బీజేపీ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తోంది. గతంలో ఇదే స్థానం నుంచి బీజేపీ తరపున రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలైన మాధవనేని రఘనందన్ రావు మూడోసారి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ రఘునందన్ రావు ప్రజల్లోకి వెళుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ఓటర్ల మనసును ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎష్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దుబ్బాక ఓటమితోనే టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుందని …. ప్రజలు అవకాశమిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని రఘనందన్ రావు హామీ ఇస్తున్నారు.