Thursday, November 21, 2024

వెలిగొండ ప్రాజెక్టుపై సత్వరమే 2 వేల కోట్లు వెచ్చించాలి: తులసీ రెడ్డి

పశ్చిమ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సాగునీరు, త్రాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్టుకు సత్వరమే రెండువేల కోట్లు నిధులు వెచ్చించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా విభాగం అధ్యక్షుడు డాక్టర్ యన్.తులసీ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన ఒంగోలులోని సిపిఐ కార్యాలయంలో గల మల్లయ్య లింగం హల్ లో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి – వెలిగొండ ప్రాజెక్టుపై జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా తులసీ రెడ్డి  ప్రసంగించారు.ఈ సదస్సుకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక ప్రధాన కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.

 నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు 15 లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులకు త్రాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు నేడు నత్తనడకన నడుస్తున్నదని ఆక్షేపించారు. 2019 నాటికీ 90 శాతం వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా గత నాలుగు సంవత్సరాలుగా కేవలం 900 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం, 2023 -24 రాష్ట్ర బడ్జెట్లో కేవలం 101 కోట్లు కేటాయించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డు కృష్ణానది పరివాహక ప్రాంతమైన కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు.

గండికోటలో 26 టీఎంసీల నీరు నిలువ ఉన్నప్పటికీ సరైన కాలువలు లేకపోవడం వలన పొలాలకు నీరందడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. ముఖ్యమంత్రి గత నాలుగు సంవత్సరాలుగా నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వాలు నీటిపారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం కేటాయించి సంపూర్ణంగా వినియోగిస్తే నేటి ప్రభుత్వం ఐదు శాతం లోపే కేటాయిస్తున్నదనీ, మూడు శాతం మాత్రమే నిధులు వినియోగిస్తుందనీ అన్నారు. నీటి ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు కేటాయించలేకపోవడం వలన అన్నమయ్య, గుండ్లకమ్మ, పులిచింతల లాంటి ప్రాజెక్టులు మరమ్మతులకు లోనైనాయన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలలో సాగునీటి పారుదల ప్రాజెక్టులపై సదస్సులను నిర్వహించి ప్రజలను జాగృతలను చేస్తామని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. గ్రావిటీ ద్వారా నీరందించే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వలన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా రూపాంతరం చెందుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును పెంచరాదని, ఎగువ భద్ర ప్రాజెక్టు నిలుపుదల, పాలమూరు-రంగారెడ్డి, డిండీ ఎత్తిపోతల పథకాల నిర్మాణ నిలుపుదలపైన, గోదావరి- కావేరి నదుల అనుసందానం ఇచ్చంపల్లి నుండి కాకుండా పోలవరం కుడి కాలువ ద్వారా చేయాలని కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం తేవాలని శాసనమండలి సభ్యులు కె.ఎస్ లక్ష్మణరావు అన్నారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర నేత కేశవరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్, సిపిఐ జిల్లా కార్యదర్శి యం.ఎల్ నారాయణ, జనసేన పార్టీ నేతలు ఈదర హరిబాబు, షేక్.రియాజ్, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, సిపిఐ యం.యల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎన్జీ రంగా కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య, ఒంగోలు సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లా మధు, సుపరిపాలన వేదిక అధ్యక్షులు మాగులూరి నాగేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి డివిఎన్ స్వామి, లోక్ సత్తా జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రఫీ అహ్మద్, తెలుగు రైతు నేత కామినేని శ్రీనివాసరావు లతో పాటు వివిధ ప్రజా సంఘాల నేతలు, మేధావులు పాల్గొని ప్రసంగించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles