- ఎన్నికల్లో భారీస్థాయిలో పోగుబడిన మెడికల్ వ్యర్థాలు
- సేకరించిన ప్రత్యేక సిబ్బంది
పట్నా: కరోనా సమయంలో ప్రతిష్ఠాత్మకంగా బీహార్ ఎన్నికలు జరిగాయి. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. యంత్రాంగానికి కావాల్సిన మెడికల్ కిట్లు, శానిటైజర్లు, ఫేస్ మాస్క్ లు అందించింది.
టన్నుల కొద్దీ వ్యర్థాలు
ఎన్నికల అనంతరం సిబ్బంది, ఓటర్లు వినియోగించిన గ్లౌజులు, ఫేస్ మాస్క్ లను ఖాళీ శానిటైజర్ బాటిళ్ల వంటి బయోమెడికల్ వ్యర్థాలను అధికారులు సేకరించారు. ఈ వ్యర్థాలు దాదాపు 160 టన్నుల దాకా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సిబ్బంది అవసరాలకుగాను భారీ స్థాయిలో 18 లక్షల ఫేస్ షీల్డ్ లు, 70 లక్షల ఫేస్ మాస్క్ లు, 5.4 లక్షల గ్లౌజులు, 7.21 కోట్ల సింగిల్ యూజ్ పాలిథీన్ గ్లౌజులను కొనుగోలు చేసి ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బందికి అందుబాటులో ఉంచింది. అంతే కాకుండా 100 ఎంఎల్ నుంచి 500 ఎంఎల్ సామర్థ్యం కలిగిన 29 లక్షల హ్యాండ్ శానిటైజర్ బాటిళ్లను కొనుగోలు చేసింది. ఈ వ్యర్థాల నిర్వహణ కోసమై అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో స్థానికంగా ఉండే పారిశుధ్య సిబ్బంది చేత వ్యర్థాలను సేకరించే పనిలో పడింది ఎన్నికల సంఘం.
బయోవేస్ట్ ను సేకరించిన ఏజెన్సీలు
హానికరమైన బయో మెడికల్ వ్యర్థాలను సేకరించి బయో మెడికల్ వేస్టేజ్ ఏజెన్సీతో రిసైకిల్ చేయిస్తామని అధికారులు తెలిపారు. స్థానిక ఆరోగ్య కేంద్రాల నుంచి వ్యర్థాలను సేకరించే ఏజెన్సీలు వ్యర్థాలను సేకరించడానికి ఒక్కో బూత్ కు ఇద్దరు చొప్పున సిబ్బందిని నియమించారు.
వీటిని ప్రత్యేకంగా శుద్ధి చేసిన అనంతరం నిర్వీర్య కేంద్రాలకు పంపించామని అధికారులు తెలిపారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా ఎన్నికల ముందు రోజు రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ స్టేషన్ ను శానిటైజ్ చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.