Monday, January 27, 2025

ఐపీఎల్ క్రికెట్ క్రీడామహోత్సవం ప్రారంభం

  • జడేజా, మయాంకా అగర్వాల్, ఫాఫ్, హార్థిక్ పాండ్యాలకు నాయకత్వ బాధ్యతలు
  • గుజరాత్, యూపీ జట్లు కొత్తగా చేరిక
  • మొత్తం పది జట్లు రంగంలో విన్యాసాలు

క్రికెట్ క్రీడపైన ప్రజలలో పెరుగుతున్న మోజును డబ్బు చేసుకునే ఉద్దేశంతోనూ, జనానికి వినోదం పంచిపెట్టే లక్ష్యంతోనూ ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒకటిన్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్నది. కోవిద్ మహమ్మారి మరణమృదంగం మోగించినా, సార్వత్రిక ఎన్నికలు ప్రజల దృష్టిని ఆకర్షించినా ఐపీఎల్ నిరాఘాటంగా సాగుతూనే వచ్చింది. ఎన్ని సవాళ్ళు ఎదురైనా వెరవక ఐపీఎల్ సీరీస్ ను నిర్వాహకులు అడ్డంకులను అధిగమిస్తూ ఆటను ఆపకుండా కొనసాగిస్తూనే వచ్చారు. ఈ క్రీడోత్సవం ప్రధానంగా భారత దేశంలోని పట్టణాలలోనే జరుగుతున్నప్పటికీ యునైట్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా సైతం ఆతిథ్యం ఇచ్చాయి. క్రికెట్ అడుతున్న దేశాలకు చెందిన వారందరికీ ప్రవేశం కల్పించే సీరీస్ ఇది. ప్రతిభకు పట్టం కట్టే సందర్భం. మెరుపులు మెరిపించే మొనగాళ్ళను అందలం ఎక్కించే అవకాశం. ఈ సారి ముంబయ్ వాన్ఖడే, బ్రబోర్న్,డీవై పాటిల్ స్టేడయంలలోనూ, పుణెలోని ఎంసీఏ స్టేడియంలోనూ ఈ క్రీడోత్సవం జరుగుతుంది. చివరి మ్యాచ్ లు ఎక్కడ జరిగేది తర్వాత ప్రకటిస్తారు. నిరుడు కోవిడ్ కారణంగా జరిగిన గందరగోళం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.  చెన్నై, బెంగళూరు, కోల్ కతాకు అవకాశాలు ఉండవచ్చు. అంతా కోవిద్ మహమ్మారి  మే నెలలో ఏ స్థితిలో ఉన్నదనే అంశంపైన ఆధారపడి ఉంటుంది.

ఉరకలు వేస్తున్న ఉత్సాహం

బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియంలో 2008 వేసవిలో ఐపీల్ ప్రప్రథమ మ్యాచ్ ఆడినప్పుడు క్రికెట్ క్రీడోత్సవాన్ని స్పాన్సర్ చేయడానికి వ్యాపార సంస్థలు అంతగా ముందుకు రాలేదు. క్రికెట్ హీరోలూ, నిర్వాహకులు వ్యాపార సంస్థలను బతిమిలాడవలసి వచ్చింది. ఈ క్రీడోత్సవం విలువ ఏడాదికేడాదికీ పెరుగుతూ వచ్చింది. ప్రేక్షకాదరణ అవధులు మీరింది. అందుకు ఈ సంవత్సరం టైటిల్ స్పాన్సర్ షిప్ కు టాటా వంటి దిగ్గజం ముందుకు వచ్చింది. నిరుటి వరకూ ఎనిమిది జట్లు మాత్రమే ఆడగా ఈ సంవత్సరం రెండు కొత్త జట్లు ముందుకు వచ్చి పోటీలో చేరాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జయింట్స్ రంగంలో దిగడం సముచితంగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్, ఆయన పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ప్రధాన నగరంగా కలిగిన, అత్యంత అధిక జనాభా కలిగిన, అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక జట్టు ఈ క్రీడోత్సవంలో పాల్గొనడంతో  వేడుకకు పరిపూర్ణత సిద్ధిస్తుంది. యావత్ భారతం బరిలో  దిగడంతో దేశమంతటా ఉత్సాహం ఉరకలు వేస్తుంది.   

ఇది 15వ సీరీస్

ఈ పదిహేనవ సీరీస్ ప్రథమ క్రికెట్ మ్యాచ్ ముంబయ్ లోని వాంఖెడే స్టేడియంలో ఈ రోజు (మార్చి 26) రాత్రి జరుగుతుంది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తలపడనున్నది. చైన్నై సూపర్ కింగ్స్ కి పన్నెండు సీరీస్ లో నాయకత్వం వహించి నాలుగుసార్లు టైటిల్ సాధించిన ప్రఖ్యాత వికెట్ కీపర్-బ్యాటర్ – కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వ స్థానం నుంచి తప్పుకొని తన అంతేవాసి రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించిన తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్ ఇది. జడేజాకు నాయకత్వం అప్పగించిన ధోనీ రంగం నుంచి పూర్తిగా తప్పుకోవడం లేదు. 40 పడిలో ప్రవేశించిన దోనీ బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా చెన్నై సూపర్ కింగ్స్ కి సేవలు కొనసాగిస్తాడు.  నిరుడు జరిగిన పద్నాలుగో సీరీస్ లో ఫైనల్ వరకూ వచ్చి ఓడిపోయిన కోల్ కత్తా రైడర్స్ మంచి ఊపులో ఉంది. రెండు మాసాల పాటు జరిగే ఈ క్రిక్రెట్ క్రీడోత్సవం భారతీయులనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ క్రీడాభిమానులనూ ఉర్రూతలూగించబోతోంది. ఫైనల్ మ్యాచ్ మే 29న ఎక్కడ జరిగేదీ క్రికెట్ ప్రేమికులకు అమితాసక్తికరమైన అంశం. కొంతకాలం ఉత్సుకతను భరించి ఉండాల్సిందే.

రోహిత్ శర్మపై ప్రధానంగా దృష్టి

భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మ ముంబయ్ ఇండియన్స్ కు నాయకత్వం కొనసాగిస్తారు. అంబానీలు ముచ్చటపడి ప్రోత్సహిస్తున్న ఈ జట్టుకు ప్రేక్షకాదరణ అధికం. కీరన్ పోలార్డ్ కూడా ఈ జట్టులో సభ్యుడుగా ఉండడం విశేషం. ధోనీ లాగానే భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మామూలు బ్యాటర్ గా రంగంలో ఉన్నాడు. కేన్ విలియంసన్ హైదరాబాద్ జట్టుకు నాయకుడుగా కొనసాగుతూ తన నాయకత్వ పటిమనూ, బ్యాటర్ గా ప్రతిభను ప్రదర్శించబోతున్నాడు.

కొత్తవారికి నాయకత్వ బాధ్యతలు

ముంబయ్ ఇండియన్స్ ఇంతవరకూ అయిదు విడతల టైటిల్ సాధించి అగ్రగామిగా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ తొమిది సార్లు ఫైనల్ లో ప్రవేశించి రికార్డు సృష్టించింది. నాలుగు టైటిల్స్ గెలుచుకున్నది. విరాట్ కోహ్లీ 199 ఇన్నింగ్స్ ఆడి 6483 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అత్యధిక పరుగులు చేసిన ఐపీఎల్ బ్యాటర్ గా క్రిస్ గెయిల్ (2013లో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు) రికార్డు ఇప్పటికీ భద్రంగా ఉంది. 170 వికెట్లు పడగొట్టి శ్రీలంక స్పిన్నర్ లసిత్ మలింగ క్రీడాగ్రంలో నిలిచి ఉన్నాడు. 2019లో కేవలం 12 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టిన అల్జర్రీజోసెఫ్ రికార్డు పదిలం. ప్రవీణ్ కుమార్ అత్యధిక మెయిడెన్ ఓవర్లు బౌల్ చేసి (14) రికార్డు సృష్టించాడు. వరుసగా రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు చేసిన ఘనత శిఖర్ ధవన్ (2020) సొంతం చేసుకున్నాడు. ఒకే మ్యాచ్ లో రెండు మెయిడెన్ ఓవర్లు విసిరిన ఏకైక బౌలర్ హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్. రోహిత్ శర్మ ముంబయ్ ఇండియన్స్ కూ, సంజూ శాంప్సన్ రాజస్థాన్ రాయల్స్ కూ, రిషభ్ పంత్ దిల్లీ కేపిటల్స్ కూ, కేన్ విలియమ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూ నాయకత్వం వహిస్తున్నారు. రాయల్ చాలెంజ్ బెంగళూరుజట్టుకు ఫాఫ్ డే ప్లెసీస్ విరాట్ కోహ్లీ  స్థానంలో  నాయకత్వం వహిస్తున్నాడు. విరాట్ కొహ్లీ తొమ్మిది సీజన్లు రాయల్ చాలెంజ్ కు నాయకత్వం వహించినప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలుచుకోలేదు. కనుక ఫాఫ్ పైన ఎటువంటి ఒత్తిడీ ఉండదు. మయాంక్ అగర్వాల్ పంజాబ్ జట్టునూ, హార్థిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ నూ ఎట్లా నడిపిస్తారో అనే విషయంలో ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది.

మహిళా క్రికెట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఐపీఎల్)

వచ్చే సంవత్సరం నుంచి మహిళా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఐపీఎల్)ను ప్రారంభించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా-బీసీసీఐ) సన్నాహాలు చేస్తున్నది. మహిళల ఐపీఎల్ ప్రారంభించేందుకు చర్చలు ప్రారంభించామని బీసీసీఐ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అన్నారు. శుక్రవారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్  సమావేశం జరిగిన తర్వాత పటేల్ ఈ వ్యాఖ్య చేశారు. ఈ సంవత్సరం మే నెలాఖరులో మహిళల టీ20 చాలెంజ్ పోటీలు నిర్వహిస్తున్నాం. బీసీసీఐ కార్యదర్శి జే షా చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు గవర్నింగ్ కౌన్సిల్ చెప్పింది.  పూర్తి స్థాయి ప్రతిపాదన సిద్ధం చేసే బాద్యతను ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఆ ప్రతిపాదనను బీసీసీఐకి సమర్పిస్తారు. ఐపీఎల్ కు ఆటంకం కలగకుండా డబ్ల్యూఐపీఎల్ ను నిర్వహించడం ఎలాగో చర్చిస్తున్నారు.   

Also read: చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles