- ఎవ్వరికీ, దేనికీ వెరవని తెలుగు వీరుడు
- ప్రమాదపు టంచులలో జీవించిన సాహసి
- గాంధీతో విభేదించినా ఆయన ఆదర్శాలకు అంకితమైన నేత
కొదమసింహంలా స్వాతంత్య్రం కోసం సమరం చేసిన మన కేసరి టంగుటూరి ప్రకాశంపంతులు పుట్టి నేటితో 150ఏళ్ళు పూర్తవుతున్నాయు. ఆయన మన మొదటి ముఖ్యమంత్రి. తుది వరకూ దేశం కోసం, జనం కోసం పరితపించిన తపస్వి. “ప్రమాదాలున్న చోటే ప్రకాశంగారు ఉంటారు” అని భోగరాజు పట్టాభిసీతారామయ్య వంటి ఉద్దండ నాయకులతో అనిపించుకున్న ధీరుడు. దేనికీ, ఎవ్వరికీ, ఎప్పుడూ వెరవని వీరుడు. గాలితోనైనా పోట్లాడే స్వభావం కలవాడు మా ప్రకాశం అని అయ్యదేవర కాళేశ్వరరావు అన్న మాటలు అక్షరసత్యాలు. మద్రాసులో సైమన్ కమీషన్ ను ఎదిరించిన సందర్భంలో తుపాకీకి రొమ్ము చూపించిన ఘనుడు. ఈయన దెబ్బకు తట్టుకోలేక వారే వెన్నుచూపించి వెళ్లిపోయారు. ఇలాంటి ధీర వీర విన్యాసాలు ఎన్నోచేశాడు. అందుకే ప్రకాశంను ‘ఆంధ్రకేసరి’ అని ప్రజలంతా గొంతెత్తి పిలుచుకున్నారు. ప్రజల గుండెల్లో దీపంగా ప్రకాశిస్తున్నాడు. తను చీకటిలోకి వెళ్లినా, లోకానికి వెలుగులే పంచాడు.
Also read: తెలుగు పిడుగు గిడుగు
ప్రాతఃస్మరణీయుడు
ప్రకాశం జీవితం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, స్వాతంత్ర్య ఉద్యమం వేరువేరు కావు. ఆ మాటకొస్తే పత్రికా చరిత్రలోనూ ఆయన స్థానం నిత్య స్మరణీయం. ఆంధ్రజాతి కోసం, స్వేచ్చా భారతం కోసం తన యావత్తు ధర్మార్జితాన్ని ధారపోశాడు. స్వరాజ్యం కోసం ‘స్వరాజ్’ పత్రికల కోసం సర్వం కోల్పోయాడు. కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం ఎన్నో వదులుకున్నాడు. చివరకు దానినే ఆయన వదులుకోవాల్సి వచ్చింది. ఆయన కోల్పోనివి రెండే రెండు – ఒకటి ధైర్యం, రెండోది సుకీర్తి. స్వాతంత్ర్య సమర యోధుడుగా ఎంతటి విజయాన్ని సాధించాడో, న్యాయవాదిగానూ వృత్తిలో అంతటి గెలుపు తీరాలు చేరాడు. ఆ కాలంలోనే లక్షలాది రూపాయలు సంపాయించాడు. ప్రకాశం పంతులు కేసు వాదిస్తున్నాడంటే గెలుపు ఆయనదేనని ముందుగానే చెప్పుకునేవారు. ఎటువంటి కేసును చేపట్టినా వాగ్ధాటి, న్యాయశాస్త్ర పాండితి, అంతకు మించిన సమయస్ఫూర్తితో కేసులను గెలుచుకునేవాడు. చాలా పెద్ద పెద్ద కేసులనే కాక, పేదవాళ్ళ వైపు కూడా అంతకు మించిన శ్రద్ధతో బరిలోకి దిగేవాడు. ప్రధానంగా పేదల పక్షపాతి, ప్రజలమనిషి. ‘స్వరాజ్’ పత్రికలతో పాటు జాతీయ పాఠశాల, ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపారు. ఏది చేసినా చేతులు కాల్చుకోవడమే. ఐనప్పటికీ వాటన్నింటినీ ఎంతో ఇష్టపడే చేశారు. రాజాజీ మంత్రి వర్గంలో రెవిన్యూ మంత్రిగా పనిచేశారు. మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాను అధికార పీఠాన్ని అధిరోహించారు. ముక్కుసూటి మనిషి. నిజాయితీపరుడు. రాజకీయాల్లో మనుగడ సాగించడం ఆ కాలంలోనూ ఎంతో కష్టమని ఆయన రాజకీయ జీవితం చెబుతోంది.
Also read: చిరంజీవి పీ వీ ఆర్ కె ప్రసాద్!
ప్రజాపార్టీ స్థాపన
సొంత పార్టీలోని అంతర్గత కుట్రలు నచ్చక బయటకు వచ్చి సొంతంగా ‘ప్రజాపార్టీ’ స్థాపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులందరినీ ఓడేట్టు చేశారు. కాకపోతే, ప్రజాపార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచే బలం లేకపోవడం వల్ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చింది. బలనిరూపణ కాకముందే ఆ సంకీర్ణం కూలిపోయింది. ముఖ్యంగా రాజాజీ చూపంతా ప్రకాశంపైనే ఉండేది. ప్రకాశం ఎవ్వరినీ లెక్కచేసేవారు కాదు. ఏది సామాన్య ప్రజాహితమో దాని వైపే నిల్చొనేవారు. జమీందారీ వ్యవస్థలో రైతులకు జరుగుతున్న అన్యాయం, వ్యవసాయానికి కలుగుతున్న నష్టాన్ని సహించలేక, ఆ అవకతవకలన్నింటినీ విచారించి నిగ్గు తేల్చడానికి ఒక ప్రత్యేక కమిటీని వేశారు. ఇటువంటి విధానాలు కొందరికి నచ్చేవి కాదు. అయినా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. 1953లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశంనే ఎంచుకున్నారు. ఆయన పాలనా కాలం స్వల్పమే అయినప్పటికీ, సంక్షేమాలకు, సంస్కరణలకు పెద్దపీట వేశారు. వేంకటేశ్వర విద్యాలయం స్థాపన, నీటి ప్రాజెక్టుల నిర్మాణం మొదలైనవి ఎన్నో ఉన్నాయి.2000మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టిన మానవతామూర్తి. విజయవాడలో కృష్ణా నదిపై బ్యారేజీ నిర్మాణం ఆయన ఘనతే. అందుకే దానికి ప్రకాశం బ్యారేజి అని పేరు పెట్టారు. తర్వాత కొన్నాళ్లకు రాజకీయాల నుంచి తప్పుకున్నా, ప్రజాజీవితంలో కీలకంగానే ఉన్నారు. తన జీవనగాథను ‘నా జీవిత యాత్ర’ పేరుతో రచించారు. చివరి భాగం తన ప్రియశిష్యుడైన తెన్నేటి విశ్వనాథం రాశారు. ప్రకాశం పంతులు జీవితం గురించి చదివితే, తెలుసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది, కళ్ళు తడిసిపోతాయి, గుండె బరువెక్కుతుంది. ఇలాంటి మహనీయులను కన్న ఈ భూమి గొప్పది. ఈ భూమికి వారు చేసిన సేవ గొప్పది. ప్రకాశం మన గుండెల్లో ఎప్పుడూ వెలుగుతూనే ఉంటారు.
Also read: సినిమాల బాయ్ కాట్ అవివేకం, అనర్థదాయకం