చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఎల్ల భక్తులు హనుమత్ జయంతిని వేడుకగా జరుపుకోవడం ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ఆనవాయితీ. అలాగే ఊరూవాడా జరుపుకుంటూనే ఉన్నాం. హనుమంతుడికి అనేక పేర్లు ఉన్నాయి.జన్మస్థలాలు కూడా అనేకం ప్రసిద్ధంగా ఉన్నాయి. మారుతి మా దేవుడు అని అందరూ చెప్పుకుంటారు. పిల్లలకు హనుమంతుని కథలంటే చాలా ఇష్టం. వ్యాయామం చేసే వారు చాలామంది హనుమను పూజిస్తారు. చాలా వ్యాయామశాలలకు ఆయన పేరే పెట్టుకుంటారు. ఈ సంప్రదాయం దేశమంతా ఉంది. ఆయన గురించి కథలన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
ఆయనే భక్తుడు, దేవుడు
ఆయనే పెద్ద భక్తుడు, ఆయనే పెద్ద దేవుడు. ఎక్కడ రామకీర్తన, రామనామం వినబడితే….. అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతాడని పురాణ వాక్కులు ఉన్నాయి. హనుమంతుడు చిరంజీవి. ఆయనలో ఉన్న గుణాలన్నీ విశిష్టమైనవి, విశేషమైనవి. నవవ్యాకరణ పండితుడు. సంగీత విద్యకు ఉపాస్య దైవం. అంజనీపుత్రుడుగా, వాయునందనుడుగా చెప్పుకుంటారు. శివస్వరూపంగా భావిస్తారు. మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర ఎంత ముఖ్యమైందో, రామాయణంలో ఆంజనేయుని స్థానం అంత గొప్పది. శివుని తేజస్సుతో, వాయుదేవుని అనుగ్రహంతో, అంజనాదేవి, కేసరి దంపతులకు జన్మించిన మహావీరుడు మారుతి అని పౌరాణిక ప్రసిద్ధి. పుంజికస్థల అనే సౌందర్యరాసియైన అప్సరస… వానర కాంతగా జన్మించిందని ఐతిహ్యం. ఆమెయే, హనుమయ్యకు అమ్మగా ప్రసిద్ధమైన అంజనాదేవి.
సుందరం, సుమధురం
అందుకేనేమో! ఆయనకు ‘సుందర’ అనే పేరు కూడా వుంది. రామాయణంలో ఒక విభాగానికి “సుందరకాండ” అని పేరు పెట్టారు. ఆ కాండ పరమ సుందరం, సుమధురం. ఆంజనేయస్వామి విశేషాలన్నీ మహర్షి వాల్మీకి అద్భుతంగా వర్ణించాడు. దేహబల సంపన్నుడు, బుద్ధిబలవంతుడైన ఆంజనేయుడు సుగ్రీవునికి మంత్రిగా, రాజ్యాన్ని సుభిక్షంగా నిలిపాడు. కార్యదీక్ష, ప్రభుభక్తి, వినయం, వివేకం, విజ్ఞానం, సేవ వంటి పరమ ఉత్తమ గుణ సంపన్నుడు మారుతి స్వామి. అంతటి శక్తి సంపన్నుడైనా, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి, ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మౌనం పాటించాలి, ఎప్పుడు విజృంభించాలి అయనకే తెలుసు.
సందర్భశుద్ధి
ఈ గుణాలన్నీ ఎవరు అలవాటు చేసుకున్నా, వారిని విజయలక్ష్మి విశేషంగా వరిస్తుంది. సర్వ సంపదలు చేరువవుతాయి. వ్యక్తిత్వ వికాసానికి ‘భగవద్గీత’ ఎంత ఉపయోగపడుతుందో, ఆంజనేయస్వామి చరిత అంత ఉపకరిస్తుంది. నవవ్యాకరణ పండితుడు కాబట్టే, రామునితో, సీతతో సందర్భోచితంగా మాట్లాడి, వారి హృదయాన్ని గెలిచాడు. తనను నమ్మినవారికి ఏ రీతిన సాయం అందించాలని సదా ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా తలచగానే ఇష్టాలను సిద్ధించడంలో, కష్టాలను తొలగించడంలో ముందుంటాడని భక్తులందరూ విశ్వసిస్తారు. అడుగడుగున గుడి వుంది అన్న చందంగా అన్నిచోట్ల ఆయన ప్రతిమలు ఉంటాయి. విదేశాలలోనూ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.మస్కట్, ఒమన్, ట్రినిటాడ్, టొబాగో, శ్రీలంక, సువారా ఎలియా, ప్రిస్కో, యు ఎస్ ఏ మొదలు ప్రపంచంలో అనేక దేశాల్లో, ప్రాంతాల్లో హనుమాన్ దేవాలయాలు ఉన్నాయి. పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్న స్వయంభువు ఆలయం కూడా చాలా ప్రసిద్ధం.
అంజనాద్రిపై టీటీడీ ప్రకటన
పురాణాలు, ఉపనిషత్తులు, కావ్యాలలోనే గాక, జానపద గాథల్లోనూ ఆంజనేయుని గురించి ఎన్నో విశేషాలు నిక్షిప్తమై వున్నాయి. ఆంజనేయస్వామి జన్మస్థలం తిరుమలలో ఉందని, సప్తగిరులలోని “అంజనాద్రి” హనుమ జన్మస్థానం, అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. నేడు, ఆ వార్తలు బాగా ప్రచారంలో ఉన్నాయి. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తిరుమలయే హనుమ జన్మస్థానమైతే, మనకు అంతకంటే కావాల్సింది ఇంకేముంది? కాలానికి, కులానికి, ప్రాంతానికి, జాతికి, దేశానికి అతీతమైన మహాశక్తిస్వరూపుడు హనుమంతుడు. మహనీయులు, మహాపురుషుల జనన కాలాలు, జన్మస్థలాలు, జన్మ విశేషాలు ఎవ్వరికి ఎరుక? మన పూర్వులు చెప్పిన గాథలే మనకు శిరోధార్యం. ఆయనలోని సుగుణాలను గ్రహించి, ఆరాధించి, ఆచరిస్తే అందరూ అజేయులవుతారు. ఆదర్శప్రాయులవుతారు.అఖిల గుణవంతుడు హనుమంతుడు. అందరివాడు ఆంజనేయుడు.