Thursday, January 9, 2025

వీకెండ్ నజరానా

శ్రీరమణ

కుక్కకి జాతి వైరం, అతిమూత్ర సమస్య లేకపోతే రోజూ కనీసం ఒక సారి కాశీదాకా వెళ్ళిరాగలదని పెద్దలు అంటారు. కుక్కలకి కరెంటు స్తంభాలు పెద్ద వీక్ నెస్. వాటిని చూడగానే మూత్రవిసర్జన గుర్తొస్తుంది. దాంతో అక్కడ ఆగిపోతుంది. అలాగ కాశీయాత్ర ముందుకు సాగదు. ఎదురైన ప్రతి కుక్కతో కాసేపు నిలబడి పోట్లాడాల్సిందే.

ప్రఖ్యాత హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య తను నమ్మిన అనుభవిస్తున్న వేదాంతాన్ని సదా తన మిత్రులకు గుర్తు చేస్తూ ఉండేవారు. అందేంటంటే –‘‘ రాళ్ళ రత్నాలు అలవోకగా అరిగించుకునే రోజుల్లో మరమరాలు (బురుగులు) కూడా దొరకవ్.

తీరా రాళ్లూ, రత్నాలూ పోగేసుకున్నాక మరమరాలు కూడా అరగవ్. దటీజ్ లైఫ్,’’ అనేవాడు. అంతే మరి, చిటపటలాడిద్దామంటే నిప్పుండగా ఉప్పుండదు. తీరా ఉప్పు దొరికాక నిప్పుకొడికడుతుంది. దిసీజ్ లైఫ్!

మహాత్మాగాంధీ ఎంత సాత్వికుడో అంత జగమొండి. భార్య కస్తూరిబాకి రక్తపోటు వచ్చింది. డాక్టర్లు ఉప్పుకి స్వస్తి పలకాలని సూచించారు. ఆవిడ పట్టించుకోలేదు.

గాంధీజీ కూడా చెప్పి చూశారు. ఉప్పు లేకుండానా అని ఆమె చప్పరించేసింది. ఆ మర్నాడు గాంధీజీ నిశ్శబ్దంగా తన తిండిలో ఉప్పుకి స్వస్తి పలికారు. కస్తూర్బాకి ఏం చెయ్యాలో బోధపడక భర్త ఇబ్బంది చూడలేక ఉప్పు మానేశారు. సత్యాగ్రహం శక్తిసామర్థ్యాలు అలాంటివి.

రోజురోజుకీ మనిషి జిరాఫీ లాగా తయారవుతున్నాడు. హృదయానికి మెదడుకి మధ్య దూరం పెరిగి పోతోంది. తస్మాత్ జాగ్రత్త!

…..                                                      ….                                                        ….

మన పాటల నయాగారా బాలు గురించి ఎన్ని చెప్పుకున్నా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఎందుకంటే బాలు విశ్వమానవుడు. ఏమి గొంతండీ బాబూ, ఏమి ప్రతిభండీ బాలూ. ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ మహా సృష్టిలో యస్పీ అంతుదొరకని విశేషం. బాలుని ఏళ్ల తరబడి చూశాక పరిశీలనగా గమనించాక, ‘‘అంతకు ముందు లేని నమ్మకం దేవుడు మీద నాకు కలిగింది’’ అని ఓ పెద్దాయన గుండెమీద చెయ్యివేసుకు చెప్పాడు. ఆస్తికత్వానికీ యస్సీ బ్రాండ్ అంబాసిడర్!

గొప్పవారి మధ్య కొన్ని సారూప్యాలు కలుస్తాయి. బాలు మొట్టమొదటి పాట పాడింది కోదండపాణి సంగీత సారథ్యంలో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్నలో, ‘…ఏమీ యీ వింత మోహం’ పల్లవి. తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు, మైకు సరిచూసుకున్నదీ లేదు. ఈ తొలిపాట రికార్డింగ్ జరిగింది 1966 డిసెంబర్ 15. అయితే సారూప్యత ఏమంటే ప్రఖ్యాత చిత్రకారులు, తెలుగువారు విపరీతంగా అభిమానించే దర్శకులు బాపు పుట్టిన రోజు కూడా అదే డిసెంబర్ 15. బాపుని విపరీతంగా అభిమానించే బాలు, తప్పని సరిగా డిసెంబర్ 12 గంటలకు ఫోన్ చేసి అభినందించి, ఆశీస్సులు కోరేవారు. ఇది ఏళ్ల తరబడి సాగింది. ‘‘బాలు తగని మొహమాటస్థుడు. అదృష్టవంతుడు అబ్బాయిగా పుట్టి బతికిపోయాడు. ఆడపిల్లగా పుడితే చాలా అవస్తపడేవాడు’’ అంటూ పాతసామెతని గుర్తు చేసి బాపురమణ తెగనవ్వేవారు.

అవి బాపు రమణ పెళ్ళిపుస్తకం సినిమా తీస్తున్న రోజులు. ఆరుద్ర ‘‘శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం’’ పల్లవి అందించారు. అప్పటి దాకా సినిమాకి పేరేంపెడదామని ఆలోచిస్తున్నబాపురమణలు ‘పెళ్ళిపుస్తకం’ పేరు బాగుందని అదే ఖాయం చేశారు.

ఆ రోజు ఆ పాట రికార్డింగు సుశీల, యస్పీ కలిసి పాడాలి. ఏవియమ్-జి లో రికార్డింగ్ కార్యక్రమం. సుశీల వచ్చారు  గాని బాలు రాలేదు. కె.వి. మహదేవన్, పుహళేంది, ఆర్కెస్ట్రా బాలుకోసం ఎదురు చూస్తున్నారు. కొంచెం ఆలస్యంగా తళతళలాడే కొత్తకారు దిగారు బాలు. వస్తూనే సారీ…సారీ అంటూ థియేటర్ లో అడుగుపెట్టారు. ఆ రోజే, అప్పుడే బాలు యీ కొత్తకారు మారుతి థౌంజెండ్ (ఎస్టీమ్) షోరూమ్ నించి డెలివరి తీసుకు వచ్చారు. మామకి, అప్పకి కూడా సారీలు చెప్పారు. అయిపోయింది. సుశీల, బాలు ‘శ్రీకారంచట్టుకుంది’ పాట అద్భుతంగా పాడారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం పాట సిద్ధమైంది.

పాట పూర్తి కాగానే సుశీల ఒక్కసారి ఆపుకోలేక భళ్లున ఏడ్చేశారు. యూనిట్ మొత్తం ఖంగారుపడింది. బాలు అవాక్కయారు. ఆమె కాసేపటికి తేరుకున్నారు. అంతకు ముందే  భర్త డాక్టర్ మోహనరావ్ గుండె ఆపరేషన్ కోసం ఆమె యూఎస్ వెళ్ళొచ్చారు.

దురదృష్టవశాత్తు ఆయన అక్కడే పోయారు. ఆమె ఒంటరిగా మద్రాసు వచ్చారు. ఈ సంఘటన తరువాత సుశీల పాడిన మొదటిపాట యిది. ఆమెలో దు:ఖం కట్టలు తెంచుకుంది. అంతా ఓదార్చి ధైర్యం చెప్పారు. చివరకు సుఖాంతమైంది సన్నివేశం.

యస్పీ అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్నో వైభవాలు పేరిట అత్యాధునిక సౌకర్యాలతో రికార్రడింగ్ థియేటర్ మద్రాసులో నిర్మించారు. బాలు ఎవరి మేలు మర్చిపోయే మనిషి కాదు. బాలు జీవితాశయం బెంజ్ కారు. స్వార్జితంగా తన కోరిక మేర కొన్నారు. చూడడానికి వారింటికి వెళితే గుమ్మంలోనే కొత్త బెంజ్ కనిపించింది. చూసి లోపలకు వెళ్ళాను. యస్పీ ప్రశాంతంగా పడుకొని ఉన్నారు. పొట్టమీద యిద్దరు చిన్న పిల్లలు. మనుమరాళ్ళు! పల్లవి కూతుళ్ళు. కవల పిల్లలు! ఎంత ఆనందమో?!

(వచ్చే వీకెండ్ లో మరో జ్ఞాపకంతో కలుద్దాం)

కొంటెబొమ్మల బాపు

కార్టూన్ ఉంది.

గిరీశం ది గ్రేట్!

గిరీశం లాండి మేధావులు నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేదు. అదే జరిగి వుంటే అది వేరే కథ. చూద్దాం దాని సంగతి –

Gireesham Carricature

మైడియర్ వెంకటేశమ్! నీకో సొంత సిమ్ము దాన్ని బదలాయించడానికి  ఐఫోను తప్పనిసరి అని నేను భావిస్తున్నా. ఎటొచ్చీ కాపర్స్ కావాలి. అలో అంటే హలో అనుకోడానికి ఓ ఆడదిక్కో హీనపక్షం మగదిక్కో వుండితీరాలి. అసలు బొంగులదిబ్బమీద ఒక టవర్ వుడితీరాలి. ఇదెవడో పత్రిక వాడన్నట్టు యిదొక చారిత్రక అవసరం. అందులో డౌట్ లేదు. నిజం, బుచ్చెమ్మ వదినకు నాకూ మధ్య ఎన్ని గంటల మాటలు గాలిలో కల్సిపోయాయో? పోయిన ఐడియా పోడమే. నీలో కల్సి, కలవక ఓ వందన్నర సెల్ఫీలైనా దిగేవాళ్ళం  కాదా? మనసులు తెలుసుకునే వాళ్ళం కాదా? నాలాంటి మేధావికి టెక్నాలజీ జేబులోకి, చేతుల్లోకి వస్తే యింకా ఏమైనా వుందీ! కొంపలంటుకోవూ !

(గిరీశం లాంటి జీనియస్ లకి తాజా సాంకేతిక పరిజ్ఞానం అందకపోవడం ఓ పెద్ద మైనస్ పాయింట్. వారి చేతిలో తాజా చిప్ లన్నీ ఉంటేనా… అని వూహిస్తే బోలెడు కొత్తకొత్త లెక్చర్లు వస్తాయ్. చూద్దాం!)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles