Tuesday, January 21, 2025

మళ్ళీ కమ్ముకొస్తున్న కరోనా మహమ్మారి

ముంబయ్ లో జనతా కర్ఫ్యూ…నిర్మానుష్యంగా రోడ్లు

అనుకున్నదంతా అయ్యింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, మహారాష్ట్రలో 15రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఈ బుధవారం రాత్రి 8 గంటల నుంచి అమలులోకి వచ్చేసింది. వలస కార్మికుల వ్యధలు కూడా ప్రారంభమయ్యాయి. పేరుకు ‘జనతా కర్ఫ్యూ’ అంటున్నా, దీన్ని లాక్ డౌన్ గానే భావించాలి. జనతా కర్ఫ్యూలో భాగంగా, రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయట తిరగడానికి వీల్లేదు.

దుకాణాల మూసివేత

దుకాణాలు, బహిరంగ ప్రదేశాలన్నీ మూసే ఉండాలి. ఇళ్లల్లో పనిచేసేవారు, డ్రైవర్లు, సహాయకులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పనిచేసుకోవాలి. వీటన్నిటిని స్థానిక అధికారులు పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తారు. అత్యవసర సేవలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రజారవాణా యధాతధంగా ఉంటుంది. లాక్ డౌన్ ఉండదని గతంలో ప్రధానమంత్రి తెలిపారు. ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని బట్టి ఎక్కడికక్కడ స్థానికంగా కంటైన్ మెంట్ జోన్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. కానీ, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. సంపూర్ణమైన లాక్ డౌన్ ను ఎవ్వరూ కోరుకోవడం లేదు.

సంపూర్ణ లాక్ డౌన్ నష్టదాయకం

దాని ద్వారా, గత సంవత్సరం వ్యక్తిగతంగానూ, దేశ వ్యాప్తంగానూ జరిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది. అంకెల్లోనూ వివరించలేనిది. మళ్ళీ సంపూర్ణ లాక్ డౌన్ విధించే పరిస్థితి వస్తే, ఆ నష్టం ఊహాతీతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మేధావులతో పాటు రాష్ట్ర పాలకులు కూడా హెచ్చరిస్తున్నారు.వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, దేశ జనాభాకు సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేవన్నది వాస్తవం. వ్యాక్సినేషన్ ఉత్సవంలా జరపాలన్న ఉద్దేశ్యం మంచిదే కానీ, అది ఆచరణలో సంపూర్ణంగా సాధ్యమవ్వడం లేదు. మరో వ్యాక్సిన్ స్పుట్నిక్ కు కూడా అత్యవసర అనుమతులు ఇచ్చారు కానీ, దాని సామర్ధ్యం (ఎఫికసీ) అనుభవంలో కానీ తేలదు.

ఆక్సిజన్ అందుబాటులో ఉన్నదా?

ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా బాధితులకు సరిపడా ఆక్సిజన్ ఎంత వరకూ అందుబాటులో ఉన్నదన్నది ప్రశ్నార్ధకమే.  అవసరమైన మేరకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలని, వాయు సేనల ద్వారా సత్వరం ఆక్సిజన్ పంపించాలని అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ వుంది. వ్యాక్సిన్ల కొరత లేదని కేంద్రం అంటోంది, వ్యాక్సిన్ల సరఫరా సక్రమంగా జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి.అన్ని వయసుల వారికీ వ్యాక్సినేషన్ జరిపేట్లుగా కేంద్రం అనుమతి ఇవ్వాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పలువురు శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారు.

తొలి దశలో స్పందన లేదు

వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తొలిదశలో భారతీయ ప్రజల నుంచి సరియైన స్పందన రాకపోవడంతో, ఆయా సంస్థలు మిగిలిన దేశాలకు వ్యాక్సిన్లను అమ్ముకున్నాయనే ప్రచారం కూడా ఉంది. దాని వల్లనే ఈ కొరత ఏర్పడిందనే వాదన వుంది. వ్యాక్సినేషన్ వల్ల సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్మ్యూనిటీ)  పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ ప్రధానమైన మార్గమని అందరూ సూచిస్తున్నారు. సామర్ధ్యం ఎక్కువగా లేని వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదనీ కొందరు అంటున్నారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అన్ని వ్యాక్సిన్లు సమర్ధవంతమైనవని కేంద్ర ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. నిజమైన ఫలితాలు కాలంలోనే తెలుస్తాయి.

ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కేసులు

మహారాష్ట్రలోనే కాదు, తెలుగు రాష్ట్రాలలోనూ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో  ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బతకడం – బతుకుతెరువు మధ్య నలిగిపోతున్నారు. ఇదే అదనుగా, ప్రైవేట్ ఆస్పత్రులు జనాల నుంచి డబ్బులను దోచుకుంటున్నాయి. ఎగువ మధ్య తరగతి వర్గం తప్ప, మిగిలిన వాళ్ళు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితులే ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కేంద్రాలకు వెళ్ళడానికి ప్రజలకు విశ్వాసం, ధైర్యం చాలడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల దురాగతాలను కట్టడి చెయ్యండని ప్రభుత్వాలకు ప్రజలు పెట్టుకుంటున్న విన్నపాలు బుట్టదాఖలానే అవుతున్నాయి.

వలస కార్మికుల ఇంటిబాట

ఇవ్వనీ ఇలా ఉండగా, వలస కార్మికులు సొంతూళ్ల బాట పట్టారు. మహారాష్ట్ర రాజధాని ముంబయి నుంచి ప్రస్తుతం ఇది ప్రారంభమైంది. దీనితో అక్కడ రైల్వే స్టేషన్లు కిటకిటలాడిపోతున్నాయి. కరోనా నిబంధనల్లో ముఖ్యమైంది భౌతికదూరం పాటించడం. ప్రస్తుత పరిస్థితుల్లో  ఆ నిబంధన గాలికెగిరిపోయింది. ఈ పరిణామం ఎంతటి దుష్ప్రభావాలను చూపిస్తుందో త్వరలోనే తేలిపోతుంది.కేవలం మహారాష్ట్ర నుంచి కాక, బీహార్ మొదలైన మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా వలసలు మెల్లగా ఆరంభమయ్యాయి. గతకాలపు వెతలను దృష్టిలో పెట్టుకొని కార్మికులు సొంతూర్లకు పయనమయ్యారు. కరోనా నేపథ్యంలో, ఉన్నచోట ఉండలేరు, కన్నఊరుకు వెళ్లి బతకలేరు. రెంటికి చెడ్డ రేవడిలా త్రిశంకు నరకంలో వలస కార్మికులు అల్లాడుతున్నారు.

మధ్యప్రదేశ్ లో విజృంభించిన మహమ్మారి

మధ్యప్రదేశ్ లో కరోనా కల్లోలం ఇంకోరకంగా సాగుతోంది. ఆ రాష్ట్రంలో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని, స్మశానవాటికలు కూడా ఖాళీ లేవని వార్తా కథనాలు వెల్లువెత్తుతున్నాయి.1984లో భోపాల్ విష వాయు దుర్ఘటన తర్వాత, ఇటువంటి దుర్భర పరిస్థితులు రావడం ఇదేనని అక్కడ ప్రజలు రోదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికార గణాంకాలకు – అసలు మరణాలకు ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు భావించాలి. ఈ ఆరోపణలను ఆ రాష్ట్ర ప్రభుత్వం కొట్టి పారేస్తోంది. ఛత్తీస్ గడ్ లోనూ ఇంచుమించు అదే పరిస్థితి ఉన్నట్లు అర్ధమవుతోంది. కరోనా వైరస్ రెండవ దశ ప్రభావంతో మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో మరణమృదంగం మోగుతోంది. స్మశానాలు ఖాళీగా లేకపోవడం, కట్టెలు కూడా చాలినన్ని దొరక్కపోవడం, పనిభారంతో, అక్కడ పనివాళ్ళు భోజనం కూడా చేయలేని పరిస్థితులు నెలకొనడం హృదయవిదారక దృశ్యం. ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24గంటల్లోనే 4వేలకు పైగా కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం,రాష్ట్రంలో మొత్తంగా 28వేలకు పైగా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.కరోనా కష్టాలు మళ్ళీ ప్రబలుతున్న నేపథ్యంలో, అనేక సవాళ్లు అందరికీ స్వాగతం పలుకుతున్నాయి.సామాన్యుడినుంచి ప్రభుత్వాల వరకూ ఇది అగ్నిపరీక్షాకాలం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles