Sunday, December 22, 2024

మరో శ్రీనాథుడు మహాకవి దాసుశ్రీరాములు

‘మహాకవి’ దాసు శ్రీరాములు// ఆధునిక కాలంలో ‘మహాకవి’ గా పేరుకెక్కిన అతి తక్కువమంది మనీషామూర్తులలో దాసు శ్రీరాములు తొలి తరం వారు. వారు కేవలం మహాకవి  మాత్రమే కాదు, వాగ్గేయకారుడు, బహురంగాలలో ప్రవీణుడు. బహుముఖ ప్రముఖుడు. ఆ కాలంలో వీరినెరగని తెలుగు ప్రముఖులు లేనే లేరు. ప్రతిభ, ప్రాభవం కలిగిన దాసు శ్రీరాములు 1846లో ఏప్రిల్ 8వ తేదీన కృష్ణాజిల్లా కూరాడ గ్రామంలో జన్మించారు. 1908లో తన 62వ ఏట మరణించారు. న్యాయవాదిగా  మచిలీపట్నంలో ప్రాక్టీస్ ప్రారంభించి, తర్వాత ఏలూరులో సుదీర్ఘకాలం ఆ వృత్తిలో ప్రప్రముఖుడిగా రాణించారు.

బాలమేధావి, బహుమేధావి

బాలమేధావి, బహుమేధావి అనే మాటలు వీరికి అక్షరాలా సరిపోతాయి. చిన్న వయస్సులో గురుముఖతా విద్యాభ్యాసం సాగినా, ఎక్కువ జ్ఞానం స్వయంకృషితో సాధించినదే. బాల్యంలోనే సంస్కృతాంధ్ర భాషలు నేర్చుకొని 12వ ఏటనే నూజివీడు సంస్థానంలో అష్టావధానం చేశారు. అదే ఈడులో, ‘సోమ లింగేశ్వర శతకం’ రాశారు. కేవలం 14 ఏళ్ళ ప్రాయంలోనే  ‘సాత్రాజితి విలాసం’ అనే యక్షగానం రచించి అందరినీ అమితాశ్చర్యంలో ముంచెత్తారు. ఇరవై ఏళ్ళ ప్రాయంలోనే తర్క, వ్యాకరణ, సంగీత, సాహిత్య, వేదాంతాలలో పాండిత్యం గడించారు. ఇంగ్లిష్ భాషలోనూ పరిణతి పొంది, న్యాయశాస్త్ర పట్టా కూడా పొందారు.

ఆంగ్లభాషాబోధకుడు

కొంతకాలం గుడివాడలో ఇంగ్లిష్ టీచర్ గా ఎందరికో భాషాసాహిత్యాలు బోధించారు. చిన్న వయస్సులోనే గొప్ప అధ్యాపకుడిగా పేరు తెచ్చుకున్నారు.న్యాయవాద వృత్తిలో ఉన్నంతకాలం న్యాయం, ధర్మంవైపే నిలుచున్నారు. మహిళలు, పేదలు, సామాన్యుల పక్షాన నిలబడి, న్యాయాన్ని నిలబెట్టిన పరమ ఆదర్శ న్యాయవాది. స్త్రీపక్షపాతిగా జీవితాంతం మహిళామణుల అభ్యున్నతికి అంకితమయ్యారు. సంగీత, సాహిత్యాలు ఒక వంక, న్యాయవాద వృత్తి మరొక వంక, సంఘసంస్కరణ  ఇంకొక వంకగా త్రినేత్రుడై విజృంభించారు. స్వయంగా కవి, కళాకారుడే కాక, కళాపోషకుడు.

మహామహులకు ఆతిథ్యం

ఆదిభట్ల నారాయణదాసు, తిరుపతి వేంకటకవులు, కొప్పరపు కవులు మొదలైన నాటి మహామహులందరూ దాసు శ్రీరాములుగారి అద్భుతమైన ఆతిధ్యాన్ని పొందినవారే. ఒకరకంగా చెప్పాలంటే, నాటి కవి పండిత ప్రముఖులందరికీ ఆయనంటే ఎంత గౌరవమో, అంత భయం కూడా ఉండేది. ఆయన ముట్టని విద్య లేదు. ఆ ప్రతిభకు అందరూ దాసులే. వారి ఇల్లు లక్ష్మీ సరస్వతీ నివాసం. వారు ఆగర్భ శ్రీమంతులు, ఆగర్భ కవితావతంసులు. న్యాయవాదులందరూ న్యాయవిద్యా కోవిదుడుగా చెప్పుకునేవారు. సంగీతమూర్తులెల్లరూ సంగీతసరస్వతిగా భావించేవారు. కవులంతా మహాకవి అని పూజించేవారు. మిగిలినవారంతా సంఘసంస్కర్తగా నీరాజనాలు పలికేవారు. పాత్రికేయులు విశేష పాత్రికేయునిగా భావించి విశిష్టస్థానాన్ని ఇచ్చేవారు.

శ్రీదేవీభాగవత రచయిత

దాసు శ్రీరాములు అనగానే  శ్రీదేవీభాగవతం, తెలుగునాడు అనే రచనలు సాహిత్యలోకంలో చాలా ప్రసిద్ధం. ‘తెలుగునాడు’ పద్యకావ్యంలో బ్రాహ్మణులలోని వివిధ శాఖల, ఉపశాఖల గురించి చేసిన వర్ణనలు తెలుగు సాహిత్య చరిత్రలోనే తలమానికం. ఒక్కొకరు ఏ విధంగా ప్రవర్తించేవారు, వారి వృత్తులు,మానసిక ప్రవృత్తులు కళ్లకు కట్టినట్లు అభివర్ణించారు. దాన్ని గొప్ప సామాజిక శాస్త్ర గ్రంథంగా చెప్పవచ్చు. వాడిన భాష, ఆ పదబంధాలు పరమ చమత్కార శోభితాలు.దేవీభాగవతం దీనికి పూర్తి విరుద్ధమైన శిల్పంతో నడిచిన గ్రంథరాజం. ప్రౌఢ రచనతో పాటు, తెలుగుపలుకుబళ్ళు సెలయేరులై పారేవి.

సంగీతంలో విలక్షణమైన స్థానం

సంగీతలోకంలో వీరి స్థానం విలక్షణమైంది. ఎన్నో జావళీలు, కృతులు, పదములు, స్వర జతులు, తిల్లానాలు  రచించి సంగీతలోకాన్ని ఆనంద సంద్రంలో మునకలు వేయించారు.తన సంగీత రచనలను తోట్లవల్లూరు శ్రీ వేణుగోపాలస్వామికి అంకితం చేశారు. నాట్యశాస్త్రాన్ని కూడా అభ్యసించారు. “అభినయ దర్పణం” అనే అపురూపమైన గ్రంథాన్ని రచించారు.ఆయుర్వేద శాస్త్రాన్ని కూడా మధించి ‘భృంగరాజ మహిమము’ అనే పరిశోధనా గ్రంథరాజాన్ని నిర్మించారు. కందుకూరి వీరేశలింగం – గురజాడ అప్పారావు – దాసు శ్రీరాములు సమకాలీకులు. వీరిలో గురజాడ కాస్త చిన్నవారు. మొదట్లో కందుకూరివారి విధానాలను కొన్నింటిని వ్యతిరేకించినా, తర్వాత ఆమోదించారు.

సంఘసంస్కరణలకు ప్రాచుర్యం

దాసు శ్రీరాములు “అనల్ప జల్పితా కల్పవల్లి” అనే పత్రికను కూడా నడిపారు. దీని ద్వారా ఎన్నో సంఘసంస్కరణలకు బహుళ ప్రాచుర్యం కల్పించారు. ముఖ్యంగా స్త్రీజనోద్ధరణ. స్త్రీవిద్యను ప్రోత్సహించడం, భర్తలను కోల్పోయినవారికి తిరిగి పెళ్లిళ్లు చేయడం,బాల్యవివాహాలను వ్యతిరేకించడం మొదలైనవి దాసుగారి సంఘ సంస్కరణలో ముఖ్యమైన అంశాలు. స్త్రీల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు కూడా స్థాపించారు.వారి సమస్యలకు న్యాయం జరిగేవరకూ న్యాయ పోరాటం చేసేవారు. న్యాయశాస్త్రంతో పాటు ధర్మశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రంలోనూ అపారమైన జ్ఞానాన్ని సంపాయించారు.

తెలుగుజాతికి కానుకగా సారస్వద సంపద

నన్నయ్యను ‘రెండవ వాల్మీకి’గా విశ్వనాథ సత్యనారాయణ అభివర్ణించారు. దాసు శ్రీరాములును ‘ రెండవ శ్రీనాథుడు’ గా చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి అభివర్ణించారు. అదీ, మహాకవిగా దాసు శ్రీరాములు గొప్పతనం. ఎన్నో శతకాలు, ప్రబంధాలు, పురాణాలు, నాటకాలు, కృతులు, జావళీలు, తిల్లానాలు రాసి తెలుగుజాతికి గొప్ప సారస్వత సంపదను కానుకగా ఇచ్చిన మహనీయుడు. ఏలూరులో తను నివసించిన ఇల్లు తర్వాత ” గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం”గా మారింది. నూటికో కోటికో జన్మించే అరుదైన ప్రజ్ఞామూర్తి దాసు శ్రీరాములు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ఘనుడు మన తెలుగువాడు కావడం మన సౌభాగ్యం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles