Tuesday, January 21, 2025

మనదేశంలో గాంధీజీ ఆదర్శాలు వేళ్ళూనుకున్నాయా?

భారతదేశ స్వాతంత్రోద్యమం మహాత్మాగాంధీ నాయకత్వంలో జరిగింది. ఆ మహానాయకుడిని మనం అక్టోబర్ 2, జనవరి 30 తేదీల్లోనే కాక,  ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, నవంబర్ 26 భారత రాజ్యాంగ చట్టం రూపుదిద్దుకున్న రోజున కూడా స్మరించుకుంటూ ఉంటాం. ఆ ప్రత్యేక దినాల్లో రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు, మేధావి వర్గం, ప్రముఖ రచయితలు, టీవీ ఛానళ్ల వారు ఎంతో సందడిగా గాంధీజీకి నివాళులర్పిస్తూ  ఉద్వేగభరిత ఉపన్యాసాలు ఇవ్వడం చూస్తుంటాం. ఆయన చిత్రపటానికి, విగ్రహాలకు కార్యాలయాల్లో, చౌరస్తాలో  పూలమాలలు వేసి సందడి చేస్తారు. 

గాంధీజీపై పొగడ్తలు

పైగా రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలతో మాట్లాడినప్పుడు గాంధీజీ  నిర్భీతి, సత్యాహింసల పట్ల ఆయనకున్న నిబద్ధత గురించి ఎంతో చక్కగా వల్లె వేస్తారు. మరీ ముఖ్యంగా ఓట్లు అడగడానికి ప్రజలకు చేరువయ్యేందుకు, చేతులు జోడించి అసలైన గాంధేయవాదుల్లా నాలుగు రోజుల పాటు  వేషం, భాష, మాట తీరు మార్చుకునేవారు కోకొల్లలు. కానీ, ఈ దేశ ప్రజల జీవన విధానంలో, నాయకుల ప్రవర్తనలో, రాజకీయ పార్టీల కార్యకలాపాలలో, చివరకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాహిత కార్యక్రమాల్లో అసలు గాంధీజీ సిద్ధాంతాలు ఏ విధంగానైనా పాటిస్తున్నామా? ప్రస్తుత సభ్యసమాజం గాంధీజీని  ఏవిధంగా అనుసరిస్తున్నారనే విషయం పరిశీలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.

గాంధీ మార్గం

గాంధీజీ జీవితం, నడిచిన బాట గురించి జనబాహుళ్యంలోకి తీసుకు రావడానికి కారణమైనవి  చాలానే ఉన్నాయి. ఉదాహరణకు గాంధీజీ ఆత్మకథ, అమెరికన్ పాత్రికేయుడు లూయీస్ ఫిషర్ రచించిన మహాత్మాగాంధీ జీవిత చరిత్ర  బహుళ ప్రజాదరణ పొందాయి. నేటికీ ఎందరో దేశ విదేశ ప్రముఖులు గాంధీ ఆలోచనా స్రవంతిని గురించి, ఆయన చేపట్టిన కార్యక్రమాల ప్రగతిశీల ప్రభావం పై పుస్తకాలు, వ్యాసాలు, కవితలు వెలువరిస్తూనే ఉన్నారు. వాటిని ఎందరో చదివి ఆదరిస్తూనే ఉన్నారు. ఇక దృశ్య మాధ్యమ విషయానికి వస్తే  శ్రీ రమేష్ శర్మ ‘అహింస’ అనే పేరుతో నిర్మించిన డాక్యుమెంటరీ  మనదేశంతోపాటు మరో ఆరు దేశాల్లో విశేషమైన ఆదరణకు నోచుకుంది. ఈ చిత్రాన్ని ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా ప్రదర్శించాలని సిఫార్సు చేశారు. 1982లో రిచర్డ్ ఎటిన్ బరో నిర్మించిన గాంధీ చలనచిత్రం  ప్రపంచమంతటా బహుళ జనాదరణ పొందింది.

గాంధీని అధ్యయనం చేసిన విదేశీవిద్యార్థులు

1946లో అమెరికాలో ఫిలడెల్ఫియా రాష్ట్రం మాంచెస్టర్ శివార్లలో గల ‘అప్ ల్యాండ్ స్కూల్ ఆఫ్ సోషల్ చేంజ్’లో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు గాంధీజీ చరిత్రను ఎంతో నిబద్ధతతో అధ్యయనం చేస్తున్న విదేశీయులను కళ్ళారా చూశాను. వారు కేవలం చదవడమే కాదు, నిత్య జీవన విధానంలో  కూడా గాంధీజీ ఆశయాలను అనుసరిస్తున్నారని గ్రహించాను. దురదృష్టమేమిటంటే గాంధీ పుట్టిన మనదేశంలో ఇప్పటిదాకా అలాంటి ఒక కేంద్రం గానీ, అభ్యసించే విద్యార్థులు గానీ  లేకపోవడం!

గాంధీజీ ‘నా జీవితమే నా సందేశం’ అని ప్రకటించారు. ఆ ప్రభావం మన భారతీయులపై ఏ మేరకు ఉంది? ప్రజాజీవితంలో, వ్యక్తిగతంగా మహాత్ముని సందేశాలు ఎంత అవసరం అనేది ఇవాళ మనం పునరాలోచించుకోవాలి.  ప్రజాధన వినియోగం, రాజకీయ పార్టీల నిర్వహణలలో నిజాయితీ, పొదుపు ఎంత వెతికినా కనిపించడంలేదు. వ్యక్తిగత జీవనశైలిలో మార్పులు లేనిదే సంఘ సంస్కరణలు అసంభవమని గాంధీజీ అప్పుడే చెప్పారు.

గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తున్నామా?

మనం ప్రస్తుత పరిస్థితులలో ఏ కొంచెమైనా ఆచరిస్తున్నామా? అనే ప్రశ్న కీలకమైంది.  ఈమధ్య మరో కొత్త పోకడ ఏమిటంటే, గాంధీజీని హతమార్చిన గాడ్సే గొప్పవాడు అని ఒక వాదన!  దీనికి జవాబుగా  గాంధీజీ గురించి అనేక ప్రసంగాలు పెరిగాయి. కేవలం మాటల ద్వారా మనం గాంధేయవాదాన్ని బలపరచడం ఎంత మాత్రమూ సాధ్యం కాదు.    గాంధీజీ ఆశించిన మార్పులు దేశంలో జరగలేదనే చెప్పుకోవచ్చు. భారతదేశ ఆర్థిక ఆలోచనా సరళిలో, భారతీయుల దినచర్యలో గాంధీజీ ఆశించిన మార్పు సంభవించలేదు. దీనికి కారణం గాంధేయ వాదాన్ని బహుశా మనం చిలకపలుకుల్లా మాటలకే పరిమితం చేసి, ఆచరణలో శూన్యంగా మిగిలాం.

వ్యక్తి పూజలందుకుంటున్ననాయకులు

ఉదాహరణకు రాజకీయపార్టీల విషయం పరిశీలిస్తే ఎటుచూసినా ఆడంబరమే తప్ప ఏ శ్రేణిలోనూ అధికార వికేంద్రీకరణ ఉండదు సరి కదా, ఒక నాయకుడే విశేషమైన వ్యక్తిపూజ పొందుతూ ఉంటారు. నిరంతరం అతని నామాన్ని జపించడం సరిపోతోంది. గాంధీజీ పారిశుద్ధ్యం, పర్యావరణ సంతులనం,  సృష్టిలోని ప్రాణులన్నింటినీ గౌరవించి, వాటికి కూడా జీవించే హక్కు ఉందని గుర్తించడం వంటి విలువలను ప్రతిపాదించారు. అవన్నీ ఇవాళ విస్మరించబడ్డాయి. పారదర్శకత, ప్రశ్నించే హక్కు సమాధానం ఇవ్వవలసిన అవసరం  ప్రణాళికలో భాగమై  ఉండాలని, అపుడే గమ్యం చేరగలమని గాంధీజీ నమ్మారు. ఫలితం కన్నా పని చేసే పద్ధతికే ఆయన ప్రాముఖ్యత ఇచ్చేవారు.

పెరుగుతున్న పెడధోరణులు

ఈ రోజుల్లో తలపెట్టిన ప్రతి ప్రణాళిక గురించి చర్చకు బదులుగా వృధా విశ్లేషణ, పై పెచ్చు వ్యాఖ్యల వక్రీకరణ పెరిగాయి. దీనివల్ల ఏ కార్యక్రమం ఎందుకు మొదలు పెట్టబడిందో అనే మూల కారణం ఎవరికీ గుర్తుండటం లేదు. ఎన్నో మంచి ప్రణాళికలు విమర్శల పాలై, అభివృద్ధి కుంటుపడుతోంది. నిజానికి, గాంధీజీ ప్రజాప్రయోజనాల దృష్ట్యా కొన్ని విషయాలు ప్రమాదకరమని కూడా ప్రస్తావించారు. ఇవి మనకు ఎంత వరకు గుర్తున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

1. పని చేయకుండా సంపద కూడబెట్టడం :  ప్రతి వ్యక్తి శారీరకంగా, మేధోపరంగా పరిశ్రమించడం ద్వారా సంపద సేకరించాలని గాంధీజీ అంటారు. మానవుని ఆశకు హద్దుండదు. అతి తక్కువ సమయంలోనే దానవుడై పోతాడని గాంధీజీ చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సంపద పెరిగి ఏం ప్రయోజనం? ప్రజల్లో సంపద పట్ల అలసత్వమే  ఎక్కువగా ఉంది. గత పది సంవత్సరాలలో ఎన్ని చిట్ ఫండ్ కంపెనీలు, డొల్ల వ్యాపారాలు సామాన్య ప్రజలను మోసగించి, బోర్డు తిప్పలేదు? ఎంతమంది బడాబాబులు బ్యాంకులను మోసగించి వందల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించుకు పోలేదు? ఆహా!  ఏం జరుగుతోంది?

2. అంతఃకరణ శుద్ధి లేకుండా సుఖాలను పొందడం :  సుఖలాలసత్వం, భోగం పెరిగి, మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాల వాడకంలో యువత నిర్వీర్యమై  మాఫియా, హింస  వైపు మళ్లింది.

3. మానవత్వాన్ని విస్మరించిన విజ్ఞానం:  శాస్త్ర పరిశోధనలు పెరిగి అనేక రకాల పనిముట్లు, యంత్రాలు దినచర్యలో భాగమయ్యాక మనిషిలో బద్ధకం, అలసత్వం, స్వార్థం పెరిగాయి. అందుకే ఇతరులను మోసం చేయడం, అక్రమ సంపద కూడబెట్టడం పెరిగింది. ఇవన్నీ విజ్ఞానశాస్త్ర ఫలితాలను, మానవత్వాన్ని మంట కలపడానికే ఉపయోగపడి సంఘం తిరోగమన దిశలో ఉంది.

4 వివేకం లేని విజ్ఞానం :   మంచి చెడులను బేరీజు వేసుకుని నిర్ణయాలను విచక్షణతో తీసుకోవాలి. సంయమనం లేకపోతే దుష్ఫలితాలే ఎక్కువ. ఉదాహరణకు కాలుష్యం  ఎంత ఎక్కువగా ఉందంటే, ప్లాస్టిక్ వ్యర్ధాలు తిన్న  ఆకలిగొన్న పశువులు, రోగాల బారిన పడితే  పొట్టలోంచి కేజీల కొలది ప్లాస్టిక్ తొలగించారని పత్రికల్లో చదివినప్పుడు  విచారం కలుగుతుంది.

5. నిబద్ధత లేని రాజకీయాలు :  రాజకీయం దేశంలో విపరీత ధోరణి లో సాగుతున్నట్లుగా కనబడుతోంది. పార్టీ ప్రముఖులు, కార్యకర్తలు, ప్రజల వద్దకు ఓట్ల కోసం వచ్చి చేస్తున్న వాగ్దానాలు అంచనాలకు మించి పోతున్నాయి. రాయితీలు, ఉచితాలు వలన సామాన్య ప్రజలను బిచ్చగాళ్లు గా తయారు చేసే ప్రమాదం ఉంది. “పేద వారిగా  పుట్టడం తప్పు కాదు, పేదలు పేదలుగా మిగిలి పోకూడదు” అన్నది మంచి ఆలోచనే. కాని విదేశీ రుణాలు, అధికార దుర్వినియోగంతో ప్రజాధన వినియోగం  ప్రచార ఆర్భాటంతో పారదర్శకత లోపించి  ప్రజాహితం  కొరవడుతోంది.

6. నీతి లేని వ్యాపారం :  వ్యాపారం అంటేనే చెప్పేది ఒకటి, చేసేది మరొకటి . నాణ్యత లేకపోగా ప్రజలను మభ్యపెట్టి ఎంతసేపూ అమ్మకాలనెలా పెంచుకోవాలో అన్నదే లక్ష్యంగా వస్తు వినిమయ సంస్కృతి  మార్కెట్లో ప్రబలింది.

7. త్యాగం లేని ఆరాధన :  ప్రార్థనా ప్రదేశాల్లో, పండుగలు జరుపుకోవడంలో  దర్పం,ఆడంబరం,ఆర్భాటం పెరిగాయి. నిశ్శబ్దం, నివేదన, భక్తి, త్యాగం కనిపించడం లేదు. పైన వివరించిన నిషిద్ధ విషయాలు గాంధీజీ సూక్ష్మ పరిశీలన, భవిష్యద్దర్శనలకు అద్దం పడతాయి.

గాంధీజీ తన జీవిత కాలమంతా బోధించి, ఆచరించి చూపించిన సమయపాలన, ప్రకృతి పట్ల గౌరవ భావం, అవసరం- ఆశ మధ్య  హద్దులు తెలుసుకొని ఉండగలగడం, ఆలోచనకు ఆచరణకు అంతరం తగ్గించడం, స్వార్థం – సంఘం పట్ల వ్యక్తికి ఉండాల్సిన బాధ్యతకు నడుమనున్న సున్నితమైన వ్యత్యాసం తెలుసుకోవడం అనేవి గాంధీజీ దృష్టిలో కీలకమైన విషయాలు. భవనం ఎంత ఎత్తుకు ఎదిగినా, పునాది పటిష్టంగా ఉండాలి. కాబట్టి, గాంధీజీ ప్రతిపాదించిన ఈ వ్యక్తిగత సూత్రాలను భారతీయులు గుర్తెరిగి తమ అంతరాత్మను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పౌరులకు సామాజిక స్పృహను పెంచే కొన్ని విలువైన మార్గ నిర్దేశకాలు, గాంధేయ మార్గంలో  అవసరమని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. అవి సుస్థిరమైన దేశ ఆర్థికాభివృద్ధికి సోపానాలు అని నా అభిప్రాయం.

గ్రామ స్వరాజ్యం

ప్రతి గ్రామం స్వయంసమృద్ధి కలిగి ఉండాలి. “మన దేశం గ్రామాల్లోనే జీవిస్తుంద”ని గాంధీ చెప్పారు. శతాబ్దాల క్రితం తమిళనాట చోళులు గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేయగా అందులో వ్యవసాయాభివృద్ధి ముఖ్యమైన అంశం. క్రీస్తుశకం 5, 6 శతాబ్దాలలోనే  నీటి కాల్వలు తవ్వించి, వరద నివారణ చర్యలను చేపట్టి, ఏడాదికి రెండు పంటలు పండించిన వారు ఆ చోళులు. దురదృష్టవశాత్తు గత 70 సంవత్సరాలలో గాంధీజీకి ప్రీతిపాత్రమైన గ్రామ స్వరాజ్యమనే అంశం రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలలో మాత్రమే సురక్షితంగా వుంది! కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్నాయన్నది సత్యదూరం కాదు.

అధికార వికేంద్రీకరణ

స్థానికమైన సమస్యలు, అవసరాలను అక్కడి ప్రజలు తమకు తామే గుర్తించి, అందుకు అవసరమైన వనరులతో సత్వరమైన అభివృద్ధికి కృషి చేయడం అధికార వికేంద్రీకరణతోనే సాధ్యం. ఇలా జరిగినప్పుడే, పౌరులకు నాయకత్వ లక్షణాలలో శిక్షణ లభించి స్వయంసమృద్ధికి బాటలు పడి ఉపాధితోపాటు ఆర్థిక సంక్షేమం సాధ్యం. అప్పుడే పొరుగు ప్రాంతాలకు వలస వెళ్లవలసిన అవసరం రాకుండా ఉంటుంది. గ్రామాలు దేశ శ్రేయస్సుకు వెన్నెముకగా మారుతాయన్నది గాంధీజీ అభిప్రాయం కాగా, ఈనాడు అధికారమంతా  నగరాలలో కేంద్రీకృతమై గ్రామాలు నిర్వీర్యమౌతున్నాయి.

 “భారత దేశ పౌరులమైన మనం….”  అనే పదాలతో రాజ్యాంగ చట్టంలో పీఠిక ప్రారంభమౌతుంది. కానీ, ఈనాడు “రాజకీయ పార్టీలైన మనం…”  అనే స్థితి సర్వత్రా నెలకొంది. ఎన్నో పార్టీలు అవకాశవాదంతో పుట్టగొడుగుల్లా పెరిగి ఒక్కొక్కసారి మాయమైపోతున్నాయి కూడా.

ప్రజాస్వామ్యం వేళ్ళూనుకోవటానికి చురుకైన పౌరులు సంఘటితంగా ఉండటం అవసరం. మరి  ఇప్పుడో? దారీతెన్నూ తోచక ప్రజలు ప్రతిపనికీ, ప్రభుత్వం పైనే ఆధారపడుతున్నారు. అవినీతి పెరిగి, ఎంతో కొంత లంచం సమర్పించకపోతే పనులేవీ జరగకపోవడం చూస్తున్నాం.

ప్రజాస్వామ్య ప్రభుత్వం పౌరులు ఎన్నుకోబడిన ప్రతినిధులతో కూడిన చట్టసభల ద్వారా పని చేస్తుంది. కానీ ప్రతినిధులకు పౌరుల సంక్షేమం, శాంతి భద్రతలు, సర్వతోముఖాభివృద్ధిపట్ల సరైన అవగాహన లేదు. పార్టీ సిద్ధాంతాల చట్రంలో చిక్కుకుని, వారి దృక్కోణం ప్రజల అభీష్టాలకు, అవసరాలకూ దూరంగా ఉంటోంది.

ప్రజాస్వామ్యంలో, శాసనసభ- కార్యనిర్వాహక శాఖ- న్యాయవ్యవస్థ అనే మూడు విభాగాలు పరిపాలనను హద్దుల్లో ఉంచేలా రూపొందించారు. కానీ ఒకటో, రెండో బలమైన రాజకీయ పార్టీల కనుసన్నలలో ఈ మూడింటి కార్యాచరణ పరిమితమైపోయింది. ఇది సంక్షోభానికి దారి తీస్తుంది.

ప్రాథమికవిద్య : ప్రాథమిక విద్య  విషయంలో దిశానిర్దేశం కొరవడింది. రాష్ట్రాల నడుమ  అసమానతలు ఉన్నాయి.

అధికార దుర్వినియోగం లేని సమర్థవంతమైన ప్రజాసేవ గాంధీజీ ఆశయం. మన వ్యవస్థలో పైసా లేనిదే  బ్రతుకు దుర్లభంగా మారింది.

ఇక్కడ చెప్పిన అంశాలన్నింటినీ సింహావలోకనం చేయగా గాంధీజీ పుట్టిన దేశంలో గాంధీజీ ఆశయాలు వేళ్ళూనుకున్నాయా అనే ప్రశ్నకు సమాధానం “లేదు” అనే చెప్పుకోవాల్సి వస్తోంది.

 గాంధీ పేరున రోడ్లు, కాలనీలు, విగ్రహాలు నెలకొల్పి,  కరెన్సీ నోట్లపై ఆయన ముఖచిత్రం ముద్రించి, ముఖ్యమైన కొన్ని రోజుల్లో ఆయనను తల్చుకుని, ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు. ఈ తరంలో పిల్లలకు గాంధీజీ నిరాడంబర సేవా దృక్పథం  గురించి ఏమీ తెలియదు. చివరికి వారు చదువుకునే పాఠ్యపుస్తకాల్లో సైతం గాంధీజీ వ్యక్తిగత  విలువల గురించి  బోధించడం లేదు. విలాసవంతమైన జీవితం, పర్యావరణ నిర్లక్ష్యం పెరిగాక, పొదుపు, వనరుల సద్వినియోగం అనేవి ఈ తరం పిల్లల ఊహకు అందని విషయమైంది.         

ఈ మధ్యే ‘యోగా’ ప్రక్రియకు ప్రాముఖ్యత పెరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాజకీయనాయకులు సహకరించారు. ప్రజలు కూడా ఆరోగ్యవంతమైన  జీవితం పై శ్రద్ధ పెడుతున్నారు. అదేవిధంగా గాంధీతత్వాన్ని అమలు చేసినప్పుడే శుభ పరిణామాలు ప్రారంభమౌతాయి. అదే గనుక జరిగితే భారత దేశం ప్రపంచానికి మార్గదర్శకమై ఆదర్శంగా నిలబడుతుంది. ఆ మంచిరోజు రావాలని ఎదురు చూస్తున్నాను. 

(11 ఫిబ్రవరి  2021 నాడు ప్రైమ్ పోస్ట్ లో ఆంగ్ల వ్యాసానికి శ్రీమతి కాళ్ళకూరి శేషమ్మ స్వేచ్ఛానువాదం. డాక్టర్ భాస్కరరావుగారి మొబైల్: 9811159588)

Dr. N. Bhaskara Rao
Dr. N. Bhaskara Rao
డాక్టర్ ఎన్. భాస్కరరావు దిల్లీలోని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్. అయిదు దశాబ్దాలకు పైగా ప్రజాసంబంధమైన విషయాలపైన అధ్యయనం చేస్తూ, సర్వేలు జరిపిస్తూ, నివేదికలు వెల్లడిస్తూ, పుస్తకాలు రచిస్తూ, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తూ ప్రజామేధావిగా సమాజానికి శక్తివంచనలేకుండా సేవచేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles