Tuesday, November 5, 2024

భారత ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం

జస్టిస్ ఎన్ వి రమణగా ప్రసిద్ధులైన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ భారత సర్వోన్నత న్యాయస్థానానికి (సుప్రీం కోర్టు)  ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏప్రిల్ 24 నుంచి పీఠాన్ని అధిరోహిస్తున్నారు. ఇది తెలుగువానికి దక్కిన గొప్ప గౌరవం, తెలుగుజాతికి లభించిన గొప్ప ఖ్యాతి. గొప్ప చారిత్రక సందర్భం. 55 ఏళ్ళ తర్వాత ఈ గొప్ప సందర్భం పునరావృతమైంది.

యాభై ఐదేళ్ళ విరామం తర్వాత…

తెలుగువారైన జస్టిస్ కోకా సుబ్బారావు 1966 జూన్ 30వ తేదీన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికై పీఠాన్ని అధిరోహించారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, మరో తెలుగువ్యక్తి అత్యున్నత పీఠంపై కూర్చున్నారు. రాష్ట్ర న్యాయస్థానాలకు ప్రధాన న్యాయమూర్తులుగా, సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా తెలుగువారెందరో పనిచేశారు. ఇంకా ఎందరో పనిచేస్తూ వున్నారు. కీర్తిని విస్తరిస్తూ వున్నారు. జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత మళ్ళీ జస్టిస్ ఎన్ వి రమణకు ఈ మహోన్నతమైన గౌరవం దక్కడం ప్రశంసాపాత్రం. ఈ సందర్భంగా, జస్టిస్ కోకా సుబ్బారావుతో పాటు జస్టిస్ పివి రాజమన్నార్ వంటి మహోన్నత తెలుగు న్యాయమూర్తులను తలచుకుందాం.

రాజమన్నార్, సుబ్బారావు బంధువులు

కోకా సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి కూడా. ఆ తర్వాత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1966లో ఎంపికయ్యారు. కోకావారిది న్యాయవాదుల కుటుంబం. వారి తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర నాయుడు రాజమండ్రిలో న్యాయవాదిగా ప్రసిద్ధులు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన పీవీ రాజమన్నార్  వీరికి సమీప బంధువు. కోకా సుబ్బారావు తొలుత, వారి మామయ్య పి. వెంకటరమణారావు నాయుడు దగ్గర జూనియర్ గా పనిచేశారు. వెంకటరమణారావు ‘ఆంధ్రకేసరి’ టంగుటూరు ప్రకాశంపంతులు దగ్గర జూనియర్ గా పనిచేశారు. వెంకట రమణారావు కుమారుడే పివి రాజమన్నార్.   రాజమన్నార్ తో (బావ, బావమరుదులు)  కలిసి కోకా సుబ్బారావు కొంతకాలం ప్రాక్టీస్ చేశారు.తర్వాత కాలంలో, రాజమన్నార్ అడ్వకేట్ జనరల్ గా, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు.

ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్  హైకోర్టులకు తొలి ప్రధాన న్యాయమూర్తి

తదనంతర కాలంలో, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, గుంటూరులో హైకోర్టు ఏర్పడింది. అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశంపంతులు పట్టుబట్టి, కోకా సుబ్బారావును ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యేట్లు చూసుకున్నారు. గోవింద్ మీనన్ ను ఎంపిక చెయ్యాలని రాజాజీ ఎంత ప్రయత్నించినా, ప్రకాశం పట్టుదలే చెల్లింది.1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా కోకా సుబ్బారావు రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.తర్వాత, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, 1966లో  ప్రధాన న్యాయమూర్తిగా సర్వోన్నత స్థానాన్ని అధిరోహించారు.

ప్రసిద్ధమైన తీర్పులు అనేకం

వీరు ఇచ్చిన కొన్ని తీర్పులు ఎంతో ప్రసిద్ధమైనవి. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సవరించే అధికారం చట్టసభలకు లేదని తీర్పు ఇచ్చారు. చట్ట సభలకు కూడా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే అధికారంలేదని చారిత్రాత్మకమైన తీర్పులో వివరించారు. గోలక్ నాథ్ – పంజాబ్ రాష్ట్రం కేసు చాలా ప్రముఖమైంది. తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి తొలి ఛాన్సలర్ గానూ విశిష్ట గౌరవం పొందారు. న్యాయ సంబంధమైన విషయాలకు సంబంధించి వీరు ఎన్నో పుస్తకాలు రాశారు. నాల్గవ రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల తరపున ఏకగ్రీవ అభ్యర్థిగా నిలబడ్డారు. సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైన తొలి తెలుగువాడిగా, న్యాయ,ధర్మ రక్షకుడిగా కోకా సుబ్బారావు స్థానం చిరస్మరణీయం.

బహుముఖ ప్రజ్ఞాశాలి రాజమన్నార్

మద్రాస్ రాష్ట్రంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన పీవీ రాజమన్నార్ కూడా తెలుగువారు గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప న్యాయమూర్తి. వీరు కేవలం న్యాయశాస్త్ర పారంగతుడే కాదు, బహు భాషలలో గొప్ప పండితుడు. తెలుగు, తమిళం, సంస్కృతం, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషా సాహిత్యాలను బాగా అధ్యయనం చేసిన నిత్య సాహిత్యజీవి. ముఖ్యంగా నాటక రచనలో సిద్ధహస్తుడు. ప్రపంచ నాటక రంగాన్ని అద్భుతంగా అధ్యయనం చేసిన గొప్ప విమర్శకుడు. లలితకళల పట్ల ఎంతో అభినివేశం ఉన్నవారు. తమిళ మాస పత్రిక ‘కళ’కు సంపాదకత్వం కూడా వహించారు. వీరు రాసిన కొన్ని నాటకాలు అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి. తెలుగులో చలం, ముద్దుకృష్ణతో పాటు ఏకాంకికలు రాసినవారిలో రాజమన్నార్ స్థానం గణనీయమైంది. నవలలు కూడా రాశారు.

సమాఖ్య వ్యవస్థపైన అధ్యయనం

“నీడలేని ఆడది” సినిమా కథ వీరిదే. భారతీయ సంగీత నాటక అకాడెమి అధ్యక్షుడుగా పనిచేసి, ఆ పదవికి వన్నె తెచ్చారు. కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన కమిటీకి వీరే అధ్యక్షుడుగా ఉన్నారు. అది ‘రాజ్ మన్నార్ కమిటీ’ గా ప్రసిద్ధి.ఫెడరల్ వ్యవస్థలో, కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై ఎన్నో విలువైన సూచనలు అందించారు. ‘అంతరాష్ట్ర మండలి’ ఏర్పాటు వీరి సూచనల మేరకే జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయకపోయినప్పటికీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కోకా సుబ్బారావుకు సహవాసిగా, సారస్వతమూర్తిగా జస్టిస్ రాజమన్నార్ గొప్ప తెలుగు న్యాయకోవిదుడు.

తాజా తెలుగు తేజం జస్టిస్ రమణ

తెలుగుతేజంగా జస్టిస్ కోకా సుబ్బారావు అందించిన గొప్ప ఖ్యాతిని నేడు పునఃలిఖిస్తున్న జస్టిస్ ఎన్ వి రమణ కూడా చరితాత్ముడు. పాత్రికేయుడుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి, న్యాయవిద్యను అభ్యసించి, న్యాయవాదిగా అనుభవాన్ని గడించారు. తర్వాత ప్రయాణంలో, హైకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతులు పొందారు.సర్వోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఎదిగి, నేడు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికై, అత్యున్నత స్థానానికి చేరడం శిఖర సదృశమైన వృత్తిగత విజయం . గొప్ప ప్రయాణం. ఈ గెలుపు, మలుపులలో కూడా తెలుగు భాష, సాహిత్య, సంస్కృతులపై మనసు నిలుపుకొని సాగడం అభినందనీయం.అవసరమైతే తప్ప ఇంగ్లీష్ లో మాట్లాడరు.

తెలుగుపై మక్కువ ఎక్కువ

తెలుగులో మాట్లాడుతూ, తెలుగులో జీవించడానికే ఎక్కువ ఇష్టపడతారు. న్యాయస్థానాల వ్యవహారాల్లోనూ తెలుగులో మాట్లాడి, కేసులు వాదించడాన్ని ప్రోత్సహిస్తారు. ఏదైనా సాహిత్య సమావేశాలకు వచ్చినప్పుడు, ఉత్తమ విద్యార్థిలా సిద్ధమై, ఉన్నతమైన ప్రసంగాలు చేస్తారు. అలా ప్రసంగించడం, దానికి కావాల్సిన క్రమశిక్షణ కలిగి ఉండడం జస్టిస్ ఎన్ వి రమణ ప్రత్యేకత. తెలుగుభాషయే కాదు, యాసలు కూడా చాలా ఇష్టం. యాసలను ఎవరైనా గేలిచేసినా ఆయన సహించరు. యాసలో కూడా గొప్ప సొగసు ఉంటుందని వారి భావన. దిల్లీలో తన నివాసానికి తెలుగులో ‘నామ ఫలకం’ (నేంప్లేట్ ) రాయించుకోవడం ఆయన భాషాభిమానానికి మంచి తార్కాణం. రావిశాస్త్రి సాహిత్యమంటే వారికి వల్లమాలిన అభిమానం. వారి కథలన్నీ కంఠోపాఠం. జస్టిస్ ఎన్ వి రమణ ఇచ్చిన కొన్ని తీర్పులు ఎంతో విశేషమైనవి.

మౌలికమైన తీర్పులు

జమ్మూకశ్మీర్లో 370ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ప్రభుత్వం హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది. దాన్ని పునరుద్ధరించమని ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. ప్రజల ప్రాథమిక హక్కులకు ఆ తీర్పు రక్షణకవచంగా నిలిచింది. రిజర్వేషన్లపైన కూడా వారిది చాలా స్పష్టమైన వైఖరి. ఆర్ధిక అసమానతల ఆధారంగా రిజర్వేషన్లు ఉండడం సమాజానికి శ్రేయస్కరం అనే భావన వారిది. చెరువులు, కుంటల పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టరాదని, అడవుల విస్తీర్ణాలను పెంచాలని ఆయన ఇచ్చిన తీర్పు కూడా విశేషమైంది. కృష్ణాజిల్లాలోని మారుమూల పల్లెలో పుట్టి నేడు జాతీయ స్థాయిలో ఖ్యాతిని సాధించారు. ‘తెలుగులో న్యాయపాలన’ పై వారికుండే ఆలోచనలన్నీ ఆచరణకు నోచుకోవాలని ఆశిద్దాం. 2022 ఆగస్టు 26 వరకూ వారు దేశ ప్రధానన్యాయమూర్తిగా  ఆ పదవిలో ఉంటారు. జస్టిస్ ఎన్ వి రమణ తెలుగువారి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేస్తారని ఆకాంక్షిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles