‘మహాకవి’ గా కాళ్ళకూరి నారాయణరావు తెలుగు సాహిత్యంలో, నాటక రంగంలో సుప్రసిద్ధుడు. ఆయన కేవలం కవి కాదు. బహుకళాప్రపూర్ణుడు. అంతకు మించి మానవత్వం నిండిన మనిషిగా పరిపూర్ణుడు. తన కవిత్వంలో, రచనలో, వాక్కులో ఏది చెప్పాడో, దాన్ని ఆచరించిన ఆదర్శపురుషుడు. ఆయన జన్మించి 150 ఏళ్ళు సంపూర్ణమైంది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం దగ్గరలోని మత్యపురి వీరి స్వగ్రామం. 28 ఏప్రిల్ 1871న జన్మించి,బ1927, జూన్ 27వ తేదీన మరణించారు. ఆరు పదులు నిండకముందే భౌతికంగా లోకాన్ని వీడినా, అనంతమైన కవితా సంపదను కానుకగా తెలుగుజాతికి బహూకరించి వెళ్ళిపోయారు.
బహుముఖీనుడు
కవి, నాటకకర్త, సంఘసంస్కర్త, హరికథకుడు, నటుడు, బహు వాద్య దురంధరుడు,పత్రికా సంపాదకుడు, ప్రచురణకర్త, ఛాయాగ్రాహకుడు, న్యాయవాది, ఒకటేమిటి? బహురంగాలలో నిష్ణాతుడు, బహుముఖ ప్రముఖుడు. కాళ్ళకూరి రచించిన చింతామణి (1921), వర విక్రయం (1923), మధుసేవ(1926) నాటకాలు చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. చింతామణి నాటకం ఇప్పటికీ సంచలనమే. వారు స్పృశించిన వరవిక్రయం(కట్నాలు), అనే ఆచారం ఇప్పటికీ సమాజంలో చెక్కుచెదరకుండా ఉంది. మధుసేవ (మద్యపానం) అనంతంగా సాగుతూనే వుంది. వ్యభిచారం అంశంగా రాసిన నాటకం ‘చింతామణి’. ఆ దుర్వ్యసనం కూడా అప్రతిహతంగా నడుస్తూనే వుంది. సమాజంలోని రుగ్మతలు, మనుషుల జీవితాలను పాడు చేసి, మానవ సంబంధాలను ఛిద్రం చేసిన వ్యసనాలపై కలాన్ని కత్తిగ చేసి, కాళ్ళకూరి ఝళిపించాడు.ఆ నాటకాలు రాసి దశాబ్దాలు దాటినా, ఆ ప్రభ, ప్రాభవం గోరంత కూడా తగ్గలేదు.
చింతామణికి వందేళ్ళు
సుప్రసిద్ధమైన ‘చింతామణి’ నాటకం వెలుగు చూసి ఇప్పటికి 100ఏళ్ళు పూర్తయింది. నేడు, ఊరూవాడా ఉత్సవం చేయాల్సిన సందర్భం. కరోనా కారణంగా ప్రస్తుతం అసాధ్యమైనా, ఈ ఉధృతి తగ్గిన తర్వాత సంబరాలు జరపడం మరువరాదు. వందేళ్ల క్రితం, వేశ్యావృత్తికి వ్యతిరేకంగా మహోద్యమం జరిగింది.ఈ ఉద్యమానికి ఊపిరిలూదడానికి కాళ్ళకూరివారు కంకణం కట్టుకున్నారు. నాటకం రాసి, నలుచెరుగులా ప్రదర్శించి, ప్రజల్లో చైతన్యం నింపడానికి శత విధాలా ప్రయత్నం చేశారు.తదనంతరం ఈ నాటక ప్రదర్శన వెర్రితలలు వేసింది. కాళ్ళకూరి రాసిన సంభాషణలకు భిన్నంగా అశ్లీలమైన పదాలతో కొత్త సంభాషణలు సృష్టించి, జుగుప్సాకరంగా ప్రదర్శనలు చేసి, ఆ నాటకాన్ని కొందరు భ్రష్టు పట్టించారు. దానిపై ప్రభుత్వం నిషేధాన్ని కూడా విధించింది. మొదట్లో చాలాకాలం, ఇటువంటి అంశాలు ఏమీ లేకుండానే, ఈ నాటకం ఎంతో విజయవంతమైంది. కాళ్ళకూరి రాసినట్లుగా యధాతధంగా ఇప్పుడు ప్రదర్శించినా, అదే ఆదరణ లభిస్తుంది. ఈ నాటకం గతంలో సినిమాగా కూడా వచ్చింది.
సాంఘిక దురాచాలపై విమర్శనాస్త్రం
వరవిక్రయం కూడా సినిమాగా నిర్మించారు. సంఘంలోని దురాచారాలపై రాసిన చింతామణి, వరవిక్రయం, మధుసేవ నాటకాలు ఎంత ప్రదర్శనకు నోచుకుంటే, సమాజానికి అంత మంచిది. సునిశితమైన హాస్య సంభాషణలతో, సుశ్లోకాల వంటి పద్యాలతో నిర్మితమైన ఈ మూడు నాటకాలు ముచ్చటైన మణిపూసలు. సంప్రదాయమైన పద్య సాహిత్య ప్రక్రియలో, వాడుకభాషలో ఇటువంటి సాంఘిక నాటకాలు రాసి, వ్యావహారిక భాషా ఉద్యమానికి బలమైన పునాదులు వేసిన మహనీయుడు కాళ్ళకూరి.ఇవి కాకుండా, ఇంకా ఎన్నో రచనలు చేశారు.రాజరాజ నరేంద్రుని కుమారుడు సారంగధరుడు,చిత్రాంగి వృత్తాంతాన్ని “చిత్రాభ్యుదయం” గా రచించారు. అభిమన్యుడుకి సంబంధించిన ప్రసిద్ధమైన భారత కథను “పద్మవ్యూహం”గా నిర్మించారు. వీరి రచనలన్నీ పండిత పామర రంజితంగా ఉంటాయి. కథాంశాన్ని బట్టి, ఆయన రచనా శిల్పం ఉంటుంది. ఎన్నో ప్రహసనాలు కూడా రాశారు. సమాజంలో తాను పరిశీలించిన మనుషులనే పాత్రలుగా మలచి, జీవంపొసే గొప్ప రచనా శిల్పం కాళ్ళకూరి సొత్తు. ప్రసిద్ధమైన సింగరాజు లింగరాజు పాత్ర అటువంటిదే. సింగరాజువారు కాళ్ళకూరికి దగ్గర బంధువులు.లింగరాజు పరమలోభి. ఆ పిసినిగొట్టుతనాన్ని అచ్చుగుద్దినట్లు,కాళ్ళకూరి అక్షరబద్ధం చేశాడు.
బుద్ధబలంతోపాటు బాహుబలం
నారాయణరావు ఎంతటి బుద్ధిబల సంపన్నుడో, అంతటి బాహుబల సంపన్నుడు. తాను కఠోరంగా వ్యాయామం చేయడమే కాక, వ్యాయామశాల కూడా నడిపారు. ఆయన సంపాదకత్వంలో నడిచిన “మనోరంజని” గొప్ప పత్రిక.నాటి సాంఘిక, సాహిత్య అంశాలన్నింటికీ అది వేదికగా నిలిచేది. పుష్పగిరి పీఠాధిపతి వీరిని ఘనంగా సత్కరించి, గండపెండెరం తొడిగి “మహాకవి” బిరుదును ప్రదానం చేశారు. నాటి కవిపండిత పామరులంతా కాళ్ళకూరిని వేనోళ్ల ప్రశంసించారు.ఆయన కావ్యాలను కొప్పరపు సోదర కవులు అద్భుతంగా పద్యరూపాత్మకంగా సమీక్షించారు. అలాగే, కొప్పరపువారి కవిత్వాన్ని కాళ్ళకూరి కొంత భద్రపరచి, ప్రచురించారు.సమాజహితం కోసం కవిత్వాన్ని సృష్టించి, జీవితాన్ని అంకితం చేసిన పుణ్యకవి, ధన్యజీవి కాళ్ళకూరి. ఇటువంటి మహనీయుల చరిత్రలు పాఠ్యాంశాల్లో తప్పక పొందుపరచాలి. తరాలను శాసించిన కాళ్ళకూరి చరిత, ఘనత తరతరాలకు నిలవాలి.
Very good write up .