నగరమింతే
ఏకాంతాన్ని ఉరి తీస్తుంది
నిశ్శబ్ధాన్ని నిషేధిస్తుంది !
స్వార్ధానికి తోరణాలు కడుతుంది !
విపణి లో విలువలకు పణం పెడుతుంది !
పాపాలకు పహారా కాస్తుంది
జీవులందరూ సుషుప్తి లోకి జారాక
ఏకాంతం రాజ్యమేలడం
ప్రారంభిస్తుంది
పుడమి పుత్రుడు,పసిడి మిత్రుడు ఒక్కటవుతారు.
పట్టు పరుపుల రాణికి,పడుపు గత్తె కి
ఒకే సుఖమవుతుంది
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఉన్నవాడు
ఇండియా గేట్ దగ్గర ఉన్న వాడు ఒక్కటే
గుడిసె లో కుర్రాడు,
సౌధాలలో పాల బుగ్గల పసివాడు ఒకటే !
సుషుప్తి ఒక్కటే సోషలిజాన్ని సాధిస్తుంది !