- ఎగ్జిట్ పోల్స్ సగటు సూచన
హైదరాబాద్ : వివిధ న్యూస్ చానళ్ళూ, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలూ గురువారం రాత్రి వెల్లడించిన ఫలితాల ప్రకారం మూడు రాష్ట్రాలలో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారంలో ఉన్న పార్టీలూ లేక ఫ్రంట్ లే ఈ ఎన్నికలలో కూడా విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతాయని తెలుస్తోంది. ఒక్క తమిళనాడులో మాత్రం పదేళ్ళుగా అధికారంలో ఉన్న ఏఐఏడిఎంకె స్థానంలో డిఎంకె నాయకత్వంలోని కూటమి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పుదుచ్ఛేరిలో కూ కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి.
పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. త్రిణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి మొత్తం 294 స్థానాలలోనూ 156 స్థానాలు లభిస్తాయనీ, బీజేపీకి 121 స్థానాలు వస్తాయనీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఫలితాల సగటు సూచిస్తున్నది.
అదే విధంగా అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి ఆశాభంగం తప్పేట్టు లేదు. మొత్తం 126స్థానాలలో అధికారంలో ఉన్న బీజేపీ 72 స్థానాలు గెలుచుకుంటుందనీ, ప్రతిపక్ష కాంగ్రెస్ 53 స్థానాలు గెలుచుకొని ప్రతిపక్షంలోనే కొనసాగుతుందనీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి.
కేరళలో సైతం లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఎల్ డీఎఫ్) అధికారంలో కొనసాగుతుందనీ, ఆ ఫ్రంట్ కు మొత్తం 140 స్థానాలలో 88 స్థానాలు దక్కుతాయనీ, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కి 50 స్థానాలకు మించి రాకపోవచ్చుననీ ఎగ్జిట్ ఫలితాల అంచనా.
తమిళనాడులో డిఎంకె నాయకత్వంలోని కూటమికి అధికారం దక్కనుంది. ఈ కూటమి గత పదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉంది. 2011లోనూ, 2016లోనూ జయలలిత నాయకత్వంలోని ఏఐఏడిఎంకె వరుసగా రెండు విడతల విజయం సాధించి అధికారంలో పదేళ్ళు కొనసాగింది. తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలలోనూ డిఎంకె నాయకత్వంలోని ఫ్రంట్ కు 174 స్థానాలూ, అధికారంలో ఉన్న ఏఐఏడిఎంకెకి 57 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా. శిఖరాయమానమైన నేతల కరుణానిధి, జయలలితలు లేకుండా ఇటీవలి దశాబ్దాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం.
పుదుచ్ఛేరిలోని మొత్తం 30 స్థానాలలో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికి 16 స్థానాలు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయన్న భరోసా లేదు. ఇది ఒక అంచనా మాత్రమే. ఎగ్జిట్ పోల్స్ తప్పిన సందర్భాలు భారత దేశ ఎన్నికల చరిత్రలో చాలా ఉన్నాయి. ఈ ఎన్నికలలోనే హైదరాబాద్ కు చెందిన పీపుల్స్ పల్స్ అనే సంస్థ జెఎన్ యూ ప్రొఫెసర్ సజ్జన్ కుమార్ నాయకత్వంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందనీ, అస్సాంలో బీజేపీకి మెజారిటీ రాదు కానీ అది అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నాయనీ ఘంటాపథంగా చెబుతోంది.
పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్ఛేరిలలో మొత్తం ఎనిమిది దశలలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరగబోతోంది.