Sunday, December 22, 2024

చీరాల-పేరాల ఉద్యమానికి వందేళ్లు

  • దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చారిత్రక పోరాటం
  • కాంగ్రెస్ సహకరించని వైనం

ఆ రాత్రంతా ఎడ్లబళ్ల మీద కొందరు, నడచి కొందరు వారి వారి సంసారాలతో బయలుదేరారు. నాటి గుంటూరు జిల్లాలో చీరాల, పేరాల అనే రెండు గ్రామాల వారు, దాదాపు పదమూడు వేల మంది అలా తరలిపోయారు. పదకొండు మాసాల పాటు అనేక కష్టాలు అనుభవిస్తూ చీరాల శివార్లలో రామ్‌నగర్‌ పేరుతో నిర్మించుకున్న గ్రామానికి చేరుకున్నారు. ఎంత మొత్తుకున్నాపెడచెవిన పెట్టి చీరాల, పేరాల గ్రామాలను కలివి మునిసిపాలిటీగా ఏర్పాటు చేసినందుకు ఆరెండు గ్రామాల ప్రజలు చూపించిన చరిత్రాత్మక నిరసన అది.

“చీరాల-పేరాల ఉదంతం ఆ ప్రాంతానికే చెందిన సమస్య అయినా, దాని చండ ప్రభావం వల్ల అది ముఖ్యమైన రాష్ట్ర సమస్యగానూ, తర్వాత సాటిలేని మేటి ఉదంతంగానూ రూపొందటంచేత అది యావత్తు భారతావని దృష్టినీ ఆకర్షించింది” అన్నారు టంగుటూరి ప్రకాశం (నా జీవితయాత్ర).

చీరాల-పేరాల ఉద్యమం గమనమంతా భారత జాతీయ కాంగ్రెస్‌ నీడలో సాగించాలని ఆ ఉద్యమనేత “రామదాసు’’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మనసావాచా ఆశించారు. నిజానికి జాతీయ కాంగ్రెస్‌లో అప్పటికి గుణాత్మకమైన మార్పు రావడానికి చాలా కారణాలు తోసుకువచ్చాయి. మితవాదులకీ, అప్పుడే జాతీయోద్యమ నాయకత్వం చేపట్టిన గాంధీకీ బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం పటాపంచలయ్యే పరిణామాలు రెండు జరిగాయి. అందులో మొదటిది జలియన్‌వాలా బాగ్‌ దురంతం. మాంటేగ్‌-ఛెమ్స్‌ఫర్ట్‌ సంస్కరణలతో మొత్తం కేంద్రీకృత విధానాలతో మద్రాస్‌ రెసిడెన్సీ పెట్రేగిపోవడం మరొకటి. మొదటి ప్రపంచయుద్ధం తరువాత వలస దేశాల పట్ల ఇంగ్లండ్‌ వైఖరి మరీ కటువుగా తయారైంది. భారత్‌ను వదులుకుంటే మనుగడే అసాధ్యం అన్నరీతిలో దాని వైఖరి రూపొందింది. దాని సామ్రాజ్యవాదపు గోళ్లు భారత్‌ శరీరంలోకి మరీ లోతుగా దిగడం మొదలైంది. అలాగే భారతీయుల వైఖరి కూడా మారక తప్పలేదు. 1920 నాటి కలకత్తా కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశాలలో భారతీయుల అంతరంగం ఆవిష్కృతమైంది.

సహాయనిరాకరణ ఉద్యమం

నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశాలలోనే గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం గురించి ప్రతిపాదించారు. దీనితో ఒక్క సంవత్సరంతోనే స్వాతంత్ర్యం వస్తుందని కూడా చెప్పారు. దేశంలో ఒక కొత్త రాజకీయ వాతావరణం నెలకొంది. ఆ సమావేశాలకు గుంటూరు ప్రాంతం నుంచి కొండ వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి (స్వామీ సీతారాం) హాజరయ్యారు. నిజానికి సహాయ నిరాకరణ గురించి నాటి జాతీయ కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేదు. మోతీలాల్, బిపిన్‌చంద్రపాల్‌, లాలా లజపతిరాయ్‌, చిత్తరంజన్‌ దాస్‌ వంటివారంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. కానీ భారతీయులు మాత్రం గాంధీజీ నాయకత్వాన్ని ప్రగాఢంగా నమ్మారు. గాంధీ చేసిన సహాయ నిరాకరణ ప్రతిపాదననే ఆ సంవత్సరం డిసెంబర్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ వార్షిక సమావేశాలు ఆమోదించాయి. కలకత్తా సమావేశంలో వెల్లువెత్తిన నిరసనగళం చల్లారిపోయింది. సహాయ నిరాకరణ పిలుపుతో దేశంలో చాలాచోట్ల ప్రజలు అహింసాయుత పంథాలో ఉద్యమంలోకి వచ్చారు. ఆ క్రమంలోనే పన్నుల నిరాకరణకు ఖ్యాతి గాంచిన ఉద్యమమే చీరాల-పేరాల.

విభజించి పాలించే నైజం

విభజించి పాలించడం ఆంగ్లజాతి నైజం. భారతదేశం మీద తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేయడానికి ఆ జాతి వన్నిన వ్యూహం కూడా అదే. కానీ హిందూ ముస్లిం విభజనకు ఆంగ్రేయులే కారణమని చెప్పడం చరిత్రాత్మకం కాదు. ముస్లిం పాలన మీద హిందువులు తిరుగుబాట చేయడం బానిసరాజుల నుంచి, మొగలుల వరకూ కనిపిస్తుంది. విషయం ఏమిటంటే బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వానికి బాగా ఉపయోగపడిన అంశాలు- మన సమాజంలోని విభజనలు, చీలికలు. ధనికులు, భూస్వాములతో నిండి ఉండే జస్టిస్‌ పార్టీ బ్రిటిష్‌ అడుగులకు మడుగులొత్తేది. జాతీయ కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా నాయకత్వం(వ్రధానంగా) వహించిన బ్రాహ్మణులను తీవ్రంగా వ్యతిరేకించడం జస్టిస్‌ పార్టీ సిద్ధాంతాలలో ఒకటి. కానీ ఇదేమీ పట్టించుకోని భారతీయులు జాతీయ కాంగ్రెస్‌ వెంటే నడిచారు. జమిందార్లూ, నంస్థానాధీశులూ, కులీనుల చేత బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం ముందునుంచీ సలాములు కొట్టించుకుంటూనే ఉంది. అలా హిందూ-ముస్లిం ఘర్షణలే కాదు, కులాల మధ్య కూడా బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం చీలికలు తెచ్చింది. నిజానికి జస్టిస్‌ పార్టీ-కాంగ్రెస్‌ మధ్య విఖేదాలు చీరాల-పేరాల ఉద్యమానికి నేపథ్యంగా కనిపిస్తాయి.

కాంగ్రెస్, జస్టిస్ పార్టీల మధ్య విభేదాలు

అప్పుడుకూడా చీరాల చేనేత, రంగుల అద్దకానికి ప్రసిద్ధి చెందింది. అక్కడి వారు ఎక్కువ మందికి ఇదే ప్రధాన జీవనోపాధి. ఇంకొందరు కాయకష్టంచేసుకునే వారు ఉండేవారు. సముద్ర తీరానికి మూడు కిలోమీటర్ల ఇవతల ఉన్న ఆ ఊరి చుట్టూ కొబ్బరి, తాడి తోపులు, ఇతర చెట్లు, పెద్దగా పండని భూములు ఉండేవి. ఒక ఆలయం, ఒక చర్చి, ఒకే ధాన్యం మిల్లుతో ఉన్న ప్రాంతం. నిజానికి చీరాల, జాంద్రపేట, పేరాల, వీరరాఘవపేట అనే నాలుగు గ్రామాలు పంచాయతీ యూనియన్‌. ఈ ఏర్పాటు 1880 ప్రాంతంలోనే జరిగింది. ఆ యూనియస్‌ వార్షికాదాయం రూ. 4,000. ప్రధానంగా చేనేత కార్మికులు, రోజు కూలీలే ఉండే ఆ గ్రామాలు ఆనందంగానే ఉండేవి. అప్పుడే గతంలో తీసుకున్న నిర్ణయాలన్నీ పక్కన పెట్టి హఠాత్తుగా మద్రాస్‌ ప్రెసిడెన్సీ 1919 నవంబర్‌లో అశనిపాతం వంటి ప్రకటన చేసింది. చీరాల-పేరాల కలిపి మునిసిపాలిటీగా ఏర్పాటు చేసింది. మిగిలిన రెండు గ్రామాలే యూనియన్‌లో ఉంటాయనీ, ఇందుకు అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చునని వెల్లడించింది. ఈ నిర్ణయంతో పెరిగే పన్నుల భారం అక్కడి ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. మునిసిపాలిటీ ఏర్పడితే అప్పటిదాకా రూ. 4,000/- ఉన్న పన్నులు పదిరెట్లు, అంటే రూ. 40,000కి  చేరతాయి.

గతంలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధం

పైగా ఈ హరఠాత్పరిణామం గతంలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధం కూడా. 1914లోనే చీరాలను విదదీసి మునిసిపాలిటీగా ఏర్పరచాలని మద్రాస్‌ ప్రెసిడెన్సీ ఆలోచించింది. ఆ ఏడాది చుట్టుముట్టిన ప్లేగ్‌ మరణాల ఆధారంగా శానిటరీ కమిషనర్‌ మునిసిపాలిటీ కోసం సిఫారసు చేశాడు. మునిసిపాలిటీగా మార్చడం వల్ల పన్నులు పెరుగుతాయనీ, వాటిని భరించే శక్తి ప్రజలకు లేదని నాటి జిల్లా కలెక్టర్‌ అభిప్రాయపడి, ఆ ప్రతిపాదనకు స్వస్తి చెప్పాడు. 1915 లో జిల్లా బోర్డుదీ అదే నిర్ణయం. అయినా మునిసిపాలిటీగా మారిస్తేనే, ఆ ప్రాంతం అంటువ్యాధులకు దూరంగా ఉండగలదా? మునిసిపాలిటీ నిర్ణయం జరగడానికి ముందే, ఫిబ్రవరి 20, 1920లో రేట్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ పేరుతో స్థానికులు నిరసనలకు దిగారు. అందుకే చీరాల వాసులలో చైతన్యం వచ్చింది. వెంటనే అర్జీలు పెట్టారు. ప్రతినిధి బృందాలు మద్రాస్‌ వెళ్లాయి. కానీ ఫలితం శూన్యం.

మునిసిపాలిటీగా చీరాల

రెండు నెలలకల్లా చీరాలను మునిసిపాలిటీగా మార్చినట్టు ప్రకటన వచ్చింది. ఆర్‌డీఓ చైర్మన్‌గా, పదకొండు మంది కౌన్సిలర్లతో ప్రెసిడెన్సీయే కౌన్సిల్‌ను నియమించింది. మునిసిపాలిటీగా మార్పు, పన్నులు కట్టవలసిన సమయం ఒకేసారి వచ్చాయి. పదిరెట్లు పెరిగిన పన్నులు కట్టడం తమకు శక్తికి మించిన పని అని ప్రజలు విన్నవించుకున్నారు. ముందు పన్నులు కట్టండి, తరువాత అప్పీలు సంగతి చూద్దాం అన్నాడు ఆర్‌డీఓ. ఈ మాట నమ్మి ఆరుమాసాలకు గాను పన్నులు చెల్లించారు. కానీ రెసిడెన్సీ నిర్ణయం మారలేదు. ఇది జస్టిస్‌ పార్టీ ప్రభుత్వానికి కంగారు పుట్టించింది. పన్నులు కట్టలేమని ప్రజలు మొండికేయడమేకాదు, తమ ప్రభుత్వం నియమించిన పదకొండు మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రజల కోరికలో న్యాయం ఉ౦దని ప్రకటించారు. వెంటనే కలెక్టర్‌ వచ్చి విచారించాడు. గ్రామస్తులు మునిసిపాలిటీ ఆలోచన వద్దు, మళ్లీ నాలుగు గ్రామాలతో యూనియన్‌ను పునరుద్ధరించాలనే కోరారు. ఆఖరికి మద్రాస్‌ ప్రెసిడెన్సీ స్థానిక స్వయం పాలన వ్యవహారాల మంత్రి రాజా రామరాయణింగార్‌ (పానగల్‌ రాజు) చీరాల రావలసి వచ్చింది. చీరాల-పేరాల ప్రజలు, రాజీనామాలు చేసిన కౌన్సిలర్లు కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలనే కోరారు. రామరాయణింగార్‌ ఈ సమస్యలోని ప్రజాగ్రహాన్ని గుర్తించడానికి నిరాకరించినట్టు కనిపిస్తుంది.

సైన్యాన్ని దించుతామని హెచ్చరిక

పోలీను బలగాలు దించి, సామూహిక సుంకం వసూలు చేస్తామని హెచ్చరించారు. రైల్వేస్టేషన్‌, పోస్టాఫీస్‌, ఆఖరికి ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఎత్తేస్తామని బెదిరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించకుంటే సైన్యాన్ని దించుతామని తుది హెచ్చరిక కూడా చేశారు. లోపాయికారీగా జస్టిస్‌ పార్టీ వక్రబుద్ధిని కూడా ప్రదర్శించారు. చీరాలకు సమీపంలోనే ఉన్న నిడుబ్రోలు మునసబు ద్వారా కొందరు ‘బ్రాహ్మణేతరులకు ఎర వేశారు. కులాన్ని రెచ్చగొడుతూ నామిటేడెడ్‌ పదవులు ఇస్తానని చెప్పాడు. (‘ట్రాజెడీ ఆఫ్‌ చీరాల-పేరాల’: జీవీ కృష్ణారావు). ఈ వ్యూహం పారలేదు. చీరాల నుంచి మద్రాస్‌ వెళ్లిన తరువాత రామరాయణింగార్‌ మరొక కొత్త పాచిక వేశారు. ప్రజలు ఎన్నుకునే చైర్మన్‌ కాకుండా ప్రభుత్వమే జీతమిచ్చి ఏర్పాటు చేసే చైర్మన్‌ అయితే ఎలా ఉంటుందో యోచించమని మిషనరీలు, ఇతర సభ్యులు ఉన్న కొత్త కౌన్సిల్‌ సభ్యులకు సలహా ఇచ్చారు. చిత్రంగా చీరాలను మునిసిపాలిటీగా మార్చవలసిన అవసరమే లేదని ఆ కౌన్సిల్‌లో సభ్యునిగా ఉన్న అమెరికన్‌ మిషనరీ థామస్‌ జవాబిచ్చారు. మునిసిపాలిటీగా స్థాయి పెంచితే ప్రజలు పన్నులు చెల్లించలేరని ఆ కౌన్సిల్‌ తేల్చి చెప్పింది.

జీతంతో చైర్మన్ నియామకం

అయినా రామరాయణింగార్‌ ఏప్రిల్‌ 1, 1921న కౌన్సిల్‌ అభిప్రాయాన్ని చెత్తబుట్టలోవేసి నెలకు రూ. 390 ల వేతనంతో ఒక చైర్మన్‌ నియమించారు. విన్నపాలు, వినతులు ఈ ప్రభుత్వం దగ్గర సాగవని అప్పటికే ప్రజలు మానసికంగా ఒక అభిప్రాయానికి వచ్చారన్న మాట నిజం. ప్రభుత్వ నిర్ణయం ప్రజలను రెచ్చగొట్టింది. ప్రజలు టోల్‌గేట్‌ను ధ్వంసం చేసి, రైలు పట్టాల మీద వేసి నిప్పు పెట్టారు. అణచివేత మొదలయింది. వందమంది రిజర్వు పోలీసులు దిగారు. వేతనం పుచ్చుకుని పనిచేస్తున్న చైర్మన్‌ పోలీసుల సాయంతో ప్రజల మీద పడి హింసించడం మొదలుపెట్టాడు. పన్నులు కట్టని వారి ఆస్తులను జప్త చేయడం ఆరంభించాడు. కానీ వాటిని వేలం వేస్తే కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇంత ప్రజాగ్రహం ఎందుకో నాటి ‘ది హిందూ” వత్రిక విలేకరి డీఎస్‌ఆర్‌ రావు విశ్లేషించారు.

జైలుకెళ్ళిన తొలి మహిళ అలివేలు మంగమ్మ

ఆ  వివరాల ప్రకారం- అక్కడ చేనేత, దాని అనుబంధ పరిశమలలో పనిచేసే వారి రోజువారీ నంపాదన కేవలం నాలుగు నుంచి ఐదు అణాలు (అణా-ఆరు పైసలు). వీరు పదిరెట్లు పెరిగిన పన్నులు ఎలా కడతారు? అంటే, ప్రజలు పన్నులు కట్టే స్థితిలో లేరు. 1921 మార్చిలో పన్నులు కట్టలేదన్న నేరంతో కోర్టు పన్నెండు మందిని జైలుకు పంపింది. అందులో ఒకరు రావూరి అలిమేలుమంగమ్మ, నిరుపేద మహిళ. గాంధీయుగం ఆరంభమైన తరువాత రాజకీయనేరారోపణతో దేశం మొత్తం మీద జైలుకు వెళ్లిన తొలి మహిళ అలిమేలుమంగమ్మ (హిస్టరీ ఆఫ్‌ ఫ్రీడం మూవ్‌మెంట్‌ ఇన్‌ గుంటూర్‌ డిస్ట్రిక్ట్‌-1921-1947)  డా. బి. శేషగిరిరావు) అని చెబుతారు.

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రంగప్రవేశం

ఇలాంటి స్థితిలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఉద్యమంలో దిగారు. ఒక్క ఏడాదిలో స్వాతంత్ర్యం అన్న గాంధీ నినాదం ఆయనను ఉత్సాహపరిచింది. ఎడింబర్గ్‌లో ఎంఎ అర్ధశాస్త్రం చదివి, రాజమండ్రి, మచిలీపట్నాలలో ప్రాఫెసర్‌ ఉద్యోగం చేశారు. అక్కడి ఇంగ్లిష్‌ ప్రిన్సిపాల్స్‌ను భరించలేకపోయారు. నిజానికి ఆయనలో స్వతంత్ర భావాలు చాలా ఎక్కువ. అందుకే ఆ కళాశాలల్లో ఇమడలేక జాతీయోద్యమంలోకి వచ్చారాయన. చీరాల-పేరాల పన్నుల నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించడం కూడా ఒక ఘటన అనిపిస్తుంది. 1920 ప్రాంతంలో చీరాల దగ్గర “శ్రీమదాంధ్ర విద్యా పీఠ గోష్టి’ అనే విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. “రామదండు” అనే స్వచ్చంద దళంతో ఆయన బెజవాడ జాతీయ కాంగ్రెస్‌ సభలను (మార్చి 31 – ఏప్రిల్‌ 1, 1921) విజయవంతం చేసి ఖ్యాతిగాంచారు. చిత్తరంజన్‌దాస్‌, మహమ్మదలీ (అలీ సోదరులలో ఒకరు), గాంధీ వంటి జాతీయ కాంగ్రెస్‌ పెద్దల మెప్పు పొందారు.

జైలుకు వెళ్ళినవారికి గాంధీ సత్కారం

బెజవాడ నుంచి ఏప్రిల్‌ 6న గాంధీ చీరాల వచ్చారు. పన్నులు కట్టడానికి నిరాకరించి జైలుకు వెళ్లిన అలిమేలుమంగమ్మ సహా అందరినీ గాంధీ సత్కరించారు. మునిసిపాలిటీ వద్దని ఏకగీవంగా ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా పెద్ద తప్పుచేసిందని వ్యాఖ్యానించారు. అప్పుడే భవిష్యత్‌ కార్యక్రమం గురించి గాంధీని గోపాలకృష్ణయ్య సలహా కోరారు. రెండు మార్గాలు సూచించారు గాంధీ. ఒకటి, సహాయ నిరాకరణతో పన్నులు చెల్లించకపోవడం. రెండు, ఖిలాఫత్‌ నేపథ్యంలో ముస్లింలు చేపట్టిన హిజత్‌ (ముస్లిం సంప్రదాయాలు గౌరవించేచోటుకి తరలిపోవడం. ఇది భారతదేశంలోనే సింధ్‌ ప్రాంతంలో జరిగింది, తులసీదాస్‌ చెప్పిన దేశత్యాగం).

గాంధీ ధోరణి నిరాశాజనకం

కానీ చీరాల-పేరాల ఉద్యమం విషయంలో గాంధీ ధోరణి నిరాశాజనకంగానే కనిపిస్తుంది. “మీరు చేసే కార్యం విజయవంతమైతే కాంగ్రెస్‌ మిమ్మల్ని అభినందిస్తుంది. అపజయం పొందితే ఆ బాధ్యత కాంగ్రెస్‌ తనపై పెట్టుకోదు” (ఆంధ్రవ్రదేశ్‌లో గాంధీజీ, తెలుగు అకాడమి) అన్నారు. ఇది భోగరాజు పట్టాభిసీతారామయ్య కూడా తన కాంగైస్‌ చరిత్ర పుస్తకంలో నమోదు చేశారు. అయినా దుగ్గిరాల గాంధీజీ ప్రతిపాదించిన అహింసాయుత పంథాలోనే ఉద్యమాన్ని ముందుకు నడిపారు.

గాంధీజీ చెప్పిన రెండు సూచనలలో దుగ్గిరాల “దేశత్యాగం” వైపు మొగ్గడానికి కారణం ఉంది. సహాయ నిరాకరణ, పన్నుల నిరాకరణలో ఏదో ఒక దశలో సహనం నశిస్తుంది. అహింసావ్రతం చెడుతుంది. చీరాల శివార్లలోని భూములలో రామ్‌నగర్‌ పేరిట ఒక  గ్రామాన్ని నిర్మించారు గోపాలకృష్ణయ్య. ఇందులో రామదండు పాత్ర విశిష్టమైనది. అప్పటికే భారతీయులంతా సాక్షాత్తు దైవంలా భావిస్తున్న గాంధీ చెప్పిన స్వరాజ్యం మీద ఆయనకు గురి కుదిరింది.

ఆదర్శంగా రామ్ నగర్ నిర్మాణం

 స్వరాజ్యం ఎలా ఉండాలో రామ్‌నగర్‌లో ప్రతిబింబింప చేయాలని స్వప్నిచారు. అక్కడ ఒక కొత్త సామాజిక వాతావరణం కల్పించడం ఆయన ఉద్దేశం. హిందూ, ముస్లిం విభేదాలు లేకుండా, బీదాబిక్కీ, పెద్దకులం చిన్నకులం తారతమ్యం లేకుండా ఉండాలని కోరుకున్నారు. అదే ఆ రామభక్తుడు కలగన్న రామరాజ్యం. స్వరాజ్యం అంటే రామరాజ్యమనే ఆయన ఉద్దేశం. రామ్‌నగర్‌ను తాళనగరం అని కూడా ఆయన పిలుచుకున్నారు. ఏప్రిల్‌ 25, 1921. ఆ వేసవి రాత్రి మహాత్మా గాంధీకీ జై అన్న నినాదంతో చీరాల-పేరాల గ్రామాల ప్రజలు తాత్కాలికంగా నిర్మించిన రామ్‌నగర్‌కు ప్రయాణమయ్యారు. పేద, ధనిక; ఉన్నత, చిన్న కులాల తేడా లేకుండా అంతా తమ సామగ్రితో బయలుదేరారు. “ఆ దృశ్యాన్ని చూని నేను కన్నీళ్లను ఆపుకోలేకపోయాను” అని రాశారు ప్రముఖ భావకవి బసవరాజు అప్పారావు. ఈ వార్తను మరునాటి సంచికలో (ఏప్రిల్‌ 26) హిందూ ప్రచురించింది, ‘ఎడ్లబళ్ల వరసలు, తమ తమ వస్తువులతో వ్యాపారులు రాత్రంతా కదిలారు.” దాదాపు పదిహేనువేల మంది. కేవలం గాంధీ సూచన మీద గౌరవంతో కదిలారు. చీరాల నుంచి 75 శాతం, పేరాల నుంచి 50 శాతం రామ్‌నగర్‌ చేరుకున్నారు. అన్నీ పర్ణశాలలే. చిన్నా పెద్దా, 20 నుంచి 40 రూపాయల వ్యయంతో నిర్మించారు. అక్కడే పంచాయతీ, న్యాయ వ్యవస్థలను గోపాలకృష్ణయ్య ఏర్పాటు చేశారు.

గోపాలకృష్ణయ్య మాట వేదవాక్కు

ఆయన మాటే అక్కడ వేదవాక్కు.  నిజానికి ఆ సంవత్సరం మార్చి 31న విజయవాడలో చిత్తరంజన్‌దాస్‌ చేసిన వ్యాఖ్య కూడా దీనికి అద్దం పదుతుంది. అప్పటికే, అక్కడ గవర్నర్‌ పాలన లేదనీ, ఉన్నదల్లా గోపాలకృష్ణయ్య పాలనే అనీ దాస్‌ వ్యాఖ్యానించారు. కానీ పరిన్టితులన్నీ రామ్‌నగర్‌కు అనుకూలంగా లేవు. ఆ సంవత్సరం ఉష్టోగ్రతలు దారుణంగా ఉన్నాయి. వర్షాలూ ఎక్కువే. వదిలివచ్చిన ఇళ్లలో పాములు, నక్కలు సంచరించడం ఆరంభమైంది. దారులన్నీ పచ్చగడ్డితో నిండిపోయాయి. రామ్‌నగర్‌ చేరినవారిలో చాలామంది నిరుపేదలు. కొన్ని విరాళాలు వచ్చాయి. మే3వ తేదీన టంగుటూరి ప్రకాశం రామ్‌నగర్‌ వెళ్లారు. ఆయన ఒక్మరే రూ. 8000 విరాళం ఇచ్చారు. ‘‘ఆ పోరాటం ముమ్మరంగా సాగుతున్న రోజులలో నేను చీరాల ప్రాంతానికి వెళ్లాను. అచ్చట ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఆ గ్రామాలకు చెందిన యావత్తు జనమూ బీదాసాదా ముసలీ ముక్కీ బ్రాహ్మణ, అబ్రాహ్మణాది విభేదాలు ఈషణ్మాత్రం లేకుండా ఏకగ్రీవంగా ఆ గ్రామాన్ని వదిలి ఇతర ప్రాంతాలలో స్థావరాల ఏర్పాటు చేసుకోవడానికి ఆనందంగా బయలుదేరారు. ఇంతకంటే ఆశ్చర్యకరమైన సంఘటన ఉంటుందా’’ అని రాశారు (నా జీవితయాత్ర).

ప్రభుత్వాధికారుల దమనకాండ

ప్రభుత్వ అధికారులు కొందరిని పురమాయించి చీరాలలో ఖాళీగా ఉన్న ఇళ్లలో కొన్నింటిని తగులబెట్టించారు. రామ్‌నగర్‌ నిర్మించిన చోటు ప్రభుత్వానిది కాబట్టి, అక్కడ గుడిసెలు వేసినందుకు రూ.1,026 వంతున జరిమానా విధించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రామ్‌నగర్‌ను ఆర్థికంగా ఆదుకోవడం గోపాలకృష్ణయ్యకు శక్తికి మించిన పనే అయింది. చిన్న చిన్న విరాళాలు తాళనగరం ఖజానాను పటిష్టం చేయలేకపోతున్నాయి. సెప్టెంబర్‌ 28, 1921న బరంపురంలో జరిగిన ఆంధ్ర మహాసభలకు దుగ్గిరాల హాజరయ్యారు. అక్కడ కొంత నిధి వసూలు చేయడం ఆయన ఉద్దేశం. ఆ రోజునే వేదిక మీద స్థానిక స్వపరిపాలనా శాఖ మంత్రి రామరాయణింగార్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ రోజు సాయంత్రం గురజాడ కృష్ణమూర్తిపంతులు అనే ఆయన ఇంటి నుంచి బయటకు వస్తుంటే పోలీసులు వచ్చి వారెంట్‌ చూపించారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ టీజీ రూథర్‌ఫర్డ్‌సంతకంతో ఆ వారెంట్‌ ఉంది. దాని ప్రకారం రెండు నెలల పాటు ఎక్కడా గోపాలకృష్ణయ్య ప్రసంగించరాదు. కానీ ఆ ఆదేశాన్ని తాను ఉల్లంఘిస్తున్నట్టు ప్రకటించారాయన. అక్టోబర్‌ 1న మరొక వారెంట్‌ జారీ చేసి అరెస్టు చేశారు.

సహకరించని కాంగ్రెస్ పార్టీ

అక్కడ నుంచి తిరుచ్చి జైలుకు తరలించారు. 1922 అక్టోబర్‌లో విడుదలయ్యారు. గోపాలకృష్ణయ్య జైలుకు వెళ్లిన తరువాత చీరాల-పేరాల నెమ్మదిగా ఖాళీ అయిపోయింది. మాట ప్రకారం జాతీయ కాంగ్రెస్‌ చీరాల-పేరాల వంటి పూర్తి ప్రజా పోరాటాన్ని సమర్ధించడానికి ముందుకు రాలేదు. రామ్‌నగర్‌ ఉద్యమ వేదిక చరిత్ర పుటలలో భాగమైంది. కానీ ఎన్నో ప్రశ్నలు మిగిల్చింది. ఖిలాఫత్‌ ఉద్యమాన్నీ, చంపారాన్‌ రైతాంగ పోరాటాన్నీ సమర్థించడానికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చిన జాతీయ కాంగ్రెస్‌ చీరాల-పేరాల ఉద్యమం అలా కునారిల్లిపోతుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయింది? పదకొండుమాసాల సహాయ నిరాకరణలో ప్రజల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఇవేవీ కాంగ్రెస్‌ పెద్దలకు కనపడలేదు. జాతీయోద్యమంలోని ప్రతి ఘట్టానికి కాంగ్రెస్‌తో సంబంధం లేదు. కానీ గాంధీజీ అహింసాయుత పంథాలో ఆయన ప్రోత్సాహంతో మొదలైన ఉద్యమం చీరాల-పేరాల. ఆ ఉద్యమానికి నాటి కాంగ్రెస్‌ నాయకత్వమే మద్దతు నిరాకరించడం శోచనీయం.

(ఏప్రిల్ 25 నాటికి చీరాల-పేరాల ఉద్యమానికి వందేళ్ళు నిండినాయి. నాటి ఉద్యమం 25 ఏప్రిల్ 1921న ఆరంభమైంది)

Dr. Goparaju Narayanarao
Dr. Goparaju Narayanarao
Previously worked for Udayam, Varta, Andhra Jyothi, and Sakshi. Now working as Editor, Jagriti (Telugu weekly)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles