దుబ్బ రంజిత్
చరిత్రకు ప్రస్తుత ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు. ఆ కాలంలో విరుద్ధ శక్తుల మధ్య జరిగిన ఘర్షణ, ఐక్యతతో రికార్డ్ చేయబడి ఉంటుంది. భవిష్యత్తు ఉన్నత లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో వర్తమానం గతంలోకి తొంగి చూస్తుంది. మట్టి కప్పబడిన చరిత్ర పుటలల్లోనూ దాగిన తమ పూర్వకుల వీరగాధలను వీధివాడ ఉటంకిస్తుంది. ఆ క్రమంలో ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డిని నేటి వర్తమానం చారిత్రక అనివార్యతగా ప్రకటిస్తుంది.
1940 వ దశకంలో కేరళ ప్రాంతానికి చెందిన లీలావర్గీస్, తెలుగు ప్రాంతవాసి చల్లా రఘునాధరెడ్డిలకు ఆదర్శ ప్రేమ వివాహం జరిగింది. వారికి తృతీయ సంతానంగా జార్జి 1947 జనవరి15 న జన్మించాడు. విధ్యాదికురాలైన తల్లి సంరక్షణలోని జార్జి చాలా చురకైన విద్యార్థిగా, లోతైన అవగాహనతో ముందు ఉండేవాడు. అన్యాయాన్ని సహించలేని తత్వంతో అందరి మన్ననలు పొందాడు. ఉస్మానియా యూనివర్సిటీలో 1960వ దశకం నాటికి తీవ్రరూపం దాల్చిన మతోన్మాదం, అగ్రకుల ఆధిపత్య భావజాలం, ప్రగతి వ్యతిరేక గుండాగిరి విలయతాండవం చేసేది. ఆ సమయంలోనే ఉన్నత విద్యార్జన కోసం జార్జి యూనివర్సిటీకి వచ్చాడు. ఈ విధానాలని చూసి చలించిపోయాడు. దాన్ని పారదోల సంకల్పించాడు. వారి ఆధిపత్య ధౌర్జన్యంపై రాజీలేని పోరాటం చేసి తోటి విద్యార్థులకు చైతన్యం నూరి పోశాడు. తొలివేకువ కిరణమై ప్రసరిస్తున్న జార్జి వెనుక విద్యార్థులందరూ అడుగేశారు. అకాడమిక్ విద్యలోనూ ముందంజలో ఉండే జార్జ్, అణు భౌతిక శాస్త్రంలో గోల్డ్ మేడల్ పొందాడు. ఓయూలోని ఉన్మాదం పైన ఉద్యమిస్తూనే, సమానత్వ సమాజ స్థాపన కోసం విద్యార్ధులల్లో సైద్ధాంతిక కార్యాచరణ ఉండాలని ఆశించాడు. ఆ క్రమంలో ప్రగతిశీల బృందంగా ఏర్పడి PDS (progressive democratic student) ను స్థాపించాడు. నిత్యం శ్రమచేసే కార్మికుల, కర్షకుల బ్రతుకుల్లో తిండిలేని స్థితికి కారణాలు అన్వేషించి, సమసమాజం ఏర్పాటుకై ఆచరణాత్మక కార్యాచరణ కోసం శ్రమించాడు.
నాడు అంతర్జాతీయంగా పెల్లుబికిన వియత్నాం, కంబోడియా, లావోస్ ప్రజల తిరుగుబాటును, సామ్రాజ్యవాదంపై క్యూబా ప్రజల విప్లవపోరాటూన్ని, నక్సల్బరీ – శ్రీకాకుళ రైతాంగ పోరాటలతో ప్రేరేపితుడైన జార్జి సమాజ మార్పుపై ఒక స్పష్టతకు వచ్చాడు. చేగువేరా సాహసగాధలను స్పూర్తిగా తీసుకొని, సహచర విద్యార్థులను భవిష్యత్తు పోరాటలకు సమాయత్తం చేశాడు. సాయుధ పోరాటం మాత్రమే పీడిత ప్రజల విముక్తి మార్గం అనే శీర్షికన సెమినార్లు నిర్వహిస్తూనే, మరోవైపు అరాచకుల దాడులను తిప్పికొట్టాడు. నూతనంగా యూనివర్సిటీలోకి వస్తున్న పీడిత, తాడిత ప్రజల పిల్లల కోసం శ్రమిస్తున్న జార్జిబృందాన్ని క్యాంపస్ ఎన్నికలలో విద్యార్థులందరూ గెలిపించారు. జార్జిబృందం వరుస విజయాలను జీర్ణంచుకోలేని బ్రాహ్మణీయ భావజాల అనునాయి శక్తులు తమ దుర్బుద్దికి పని చెప్పారు. తమ ఆగడాలకు ఆశ్రమమైన యూనివర్సిటీ, తమ చేతుల నుండి జారిపోవడం తట్టుకోలేని దుర్మార్గులు జార్జిహత్యకు నిసిగ్గుగా పథకం వేశారు.
1972 ఏప్రిల్ 14న, ఇంజినీరింగ్ కళాశాల ఎన్నికలల్లో తమ అభ్యర్థిని గెలిపించాలని కిన్నెర హాస్టల్ లో జార్జి ప్యానల్ వారు మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ ముంగించుకొని ఒంటరిగా వస్తున్న జార్జిపై ఒక్కసారిగా 30 మంది గుండాలు కత్తులతో దాడి చేశారు. వారిని తీవ్రంగా ఎదుర్కొంటునే జార్జి ప్రాణాల్పించాడు. జార్జి మరణించి నేటికి 49 సంవత్సరాలు అవుతున్న ఈ సందర్భంలో, జార్జి మిత్రులతో ఉస్మానియా యూనివర్సిటీలో ‘జార్జి స్మృతిలో మార్నింగ్ వాక్’ని నిర్వహిస్తున్నాం. నాటి జార్జి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, జార్జి కనపర్చిన సాహసగాధలను, పోరాటలను తెలుసుకొని స్పూర్తిపొందుదాం.
బుధవారంనాడు, 2021 ఏప్రిల్ 14, ఉదయం 6 గంటలకు, ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజ్ నుండి ఇంజనీరింగ్ కిన్నెర హాస్టల్ వరకు కొనసాగే మార్నింగ్ వాక్ లో అందరూ పాల్గొనవల్సిందిగా పిలుపునిస్తున్నాం.
(రచయిత పీడీఎస్ యూ ఉస్మానియా అధ్యక్షుడు, మొబైల్ నంబర్ 9912067322)
(జార్జిరెడ్డి 49వ జయంతి ఏప్రిల్ 14)