Sunday, December 22, 2024

ఉక్కు పిడికిలి బిగించు తెలుగోడా!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరు సాగుతూనే వుంది. అయినప్పటికీ, కేంద్రం నిర్ణయంలో ఇంతవరకూ ఎటువంటి మార్పు రాలేదు. ప్రైవేట్ సంస్థల పరం కాకుండా, యధాతథ స్థితి కొనసాగాలని ఉక్కు పరిశ్రమ చెంత కార్మికుల ఆందోళన నిరాఘాటంగా జరుగుతోంది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విశ్రాంత ఐపిఎస్ అధికారి లక్ష్మీనారాయణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనికి స్పందిస్తూ న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

లక్ష్మీనారాయణ పిటిషన్

ప్రైవేటీకరణ సరియైన చర్య కాదని, పరిశ్రమను లాభాల బాటలో నడపడానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని, కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లక్ష్మీనారాయణ తన పిటీషన్ లో పేర్కొన్నారు. హైకోర్టు జారీచేసిన నోటీసులకు కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. లక్ష్మీనారాయణ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉద్యమంలో ఒక ముందడుగుగా అభివర్ణించవచ్చు. ఇటీవలే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన వార్షిక ఆర్ధిక నివేదిక ఎంతో ఆశాజనకంగా ఉంది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో విశాఖ ఉక్కు 18వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేసినట్లు సంస్థ సీఎండి పీకే రథ్ ప్రకటించారు. ఉక్కు సంస్థ స్థాపించినప్పటి నుంచీ చరిత్రలోనే ఇది రెండవ అత్యధికమని ఆయన తెలిపారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 18శాతం వృద్ధి నమోదయినట్లు వివరించారు.

లాభాలలో నడుస్తున్న ఫ్యాక్టరీ

గడచిన 4నెలల్లోనే 740కోట్ల రూపాయల నికర ఆదాయాన్ని ఆర్జించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ మార్చిలో 7,11,000 టన్నుల ఉక్కును 3,300 కోట్ల రూపాయలకు విక్రయించారు. మార్చి నెలలో వచ్చిన ఆదాయం స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే అత్యధికమని తెలుస్తోంది. ఈ నివేదికల ద్వారా ప్రస్తుతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంత ప్రగతిపథంలో నడుస్తుందో తేటతెల్లమవుతోంది. అసలు నిజాలు ఇలా ఉండగా, ప్రభుత్వరంగ సంస్థను ప్రైవేట్ పరం చేయడంలో కేంద్రం అసలు ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావడం లేదు. నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల బాట పట్టించడానికి, ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి, వృధాను అరికట్టడానికి, మానవ వనరులను సక్రమంగా సద్వినియోగం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

కేంద్రం అవాస్తవిక వాదన

మిగిలిన పరిశ్రమలు ఎలా ఉన్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయం పూర్తి భిన్నంగా ఉంది. ప్లాంట్ ఉత్పత్తిని పెంచడానికి, నిరంతరం లాభాల బాటలో నడపడానికి కేంద్రం కాస్త సహకారాన్ని అందిస్తే సరిపోతుంది.అందులో, గనులను కేటాయించడం ప్రధానమైన అంశం. దీనితోనే నష్టాలు ఆగిపోతాయి. ప్రగతి వేగం పెరుగుతుంది. ఈ పనిని కేంద్రం చిటికలో చేయవచ్చు.ప్రైవేటీకరణ  సంపూర్ణ పరిష్కారం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం వ్యాపారం చేయవచ్చా? లేదా? అన్నది కేస్ బై కేస్ చూడాలని బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల వ్యాఖ్యానించారు. ఎన్నో బలమైన కారణాలు ఉంటే తప్ప, ప్రైవేటీకరణ మంచిది కాదని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతూనే వున్నారు.

విశేష వనరులు కలిగిన విశాఖ ఉక్కు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు అనేక వనరులు కూడా ఉన్నాయి. సుమారు 20వేల ఎకరాల సొంత భూమి ఉంది. దీని విలువ లక్ష కోట్ల వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాల సమాచారం. ఇంత విలువైన సంపదను ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా కట్టపెట్టాలని ఢిల్లీ పెద్దలు చూస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ను నిలుపుకోడానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పలు ఉత్తరాలు రాశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసన సభలో తీర్మానం కూడా చేశారు. బిజెపి, జనసేన తప్ప మిగిలిన పార్టీలన్నీ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ పోరుబాట పట్టాయి.

కేటీఆర్, చిరంజీవి ప్రభృతుల మద్దతు

టీ ఆర్ ఎస్ ముఖ్య నేత,తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రముఖ నటుడు చిరంజీవి మొదలైనవారు తమ మద్దతును  ప్రకటించారు.ఎన్నికల వేడిలో, ప్రస్తుతం ఉద్యమంలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం కాస్త పలుచబడింది. ఆందోళనల తీవ్రత కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట వేదిక, కార్మిక సంఘాలు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నాయి. త్వరలో, మళ్ళీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ” విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ” అంటూ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంగా, దశాబ్దాల పోరాటాల,త్యాగాల ఫలంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పడింది.దాన్ని పోగొట్టుకుంటే, ఆత్మ గౌరవాన్ని హత్య చేసినట్లేనని భావించాలి. ప్రైవేటీకరణ ఒడిశా నేతల కుట్ర, అని మన నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అది వారి కుట్ర కాదు. మన అసమర్ధత అని, ఆ నేతలు తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందా? అన్నది ప్రధానమైన ప్రశ్న. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతు సంఘాలు కూడా ఉక్కు ఉద్యమానికి బాసటగా నిలిచాయి. తెలుగువారంతా ఏకమై ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే తప్ప, కేంద్రం దిగిరాదు.విశాఖ ఉక్కు దక్కదు.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles