Sunday, December 22, 2024

ఈ విలయం స్వయంకృతం

  • పెద్ద వాన కురిస్తే అంతా అస్తవ్యస్తం
  • ఇప్పటికైనా ప్రభుత్వాలూ, ప్రజలూ కళ్లు తెరవాలి
  • ప్రణాళికాబద్ధంగా ఆవాసాలు నిర్మించుకోవాలి
  • మిషన్ కాకతీయ వంటి పథకాలు కొనసాగాలి
మాశర్మ

ప్రకృతి వైపరీత్యాలు ఈ సృష్టి ప్రారంభం నుండీ ఉన్నాయి. ఈ వైపరీత్యాలకు ఎంతో జీవరాశి మనుగడ కోల్పోయింది. లక్షల సంవత్సరాల ఈ పరిణామంలో భౌగోళిక స్వరూపాలు కూడా ఎన్నోసార్లు మార్పులకు గురయ్యాయి. మానవాళి మనుగడ ప్రారంభమైన నాటి  నుండీ, బతుకు పయనంలో భాగంగా వలసలు జరుగుతూనే ఉన్నాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలు అలా ఏర్పడినవే. మనిషికి నీటికి ఉన్న సంబంధం విడదీయలేనిది. ఆధునిక  నాగరికత, సంస్కృతి వేళ్లూనుకుంది నదీ పరీవాహక ప్రాంతాలలోనే. వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, బావులు, తోటలు, అడవులు, నదులు, సముద్రాలు, కొండలు, కోనలు, గుట్టల దగ్గర జనావాసాలు ఏర్పడ్డాయి.

నాగరికతతో పెరిగిన పట్టణాలూ, నగరాలూ

నాగరికత అభివృద్ధి చెందే కొద్దీ పట్టణ, నగర నిర్మాణాలు ఊపందుకున్నాయి. చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం పల్లెసీమల నుండి పట్నవాసాలు పెరిగాయి. ఈ ప్రగతిలో భాగంగా పల్లెలు పట్టణాలుగా, పట్టణాలు, నగరాలుగా, నగరాలు, మహానగరాలుగా రూపాంతరం చెందాయి. జనాభా, జనసాంద్రత, వాహనాలు, పరిశ్రమలు, వ్యాపారాలు, విందు వినోద కేంద్రాలు, విద్యాలయాలు, కార్యాలయాలు అసంఖ్యాకంగా పెరిగాయి. సాంకేతికత పెరిగింది, అక్షరాస్యత పెరిగింది. మనిషి అవసరాలు పెరిగాయి. అవసరాల నుండి ఆశ,అత్యాశ, దురాశలు కూడా గణనీయంగా పెరిగాయి. వీటికి తగ్గట్టుగా పట్టణ నిర్మాణ ప్రణాళికలు పెరగలేదు. ఆ రోజు సుఖం తప్ప, రేపటి ఆలోచన లేదు. ఈ కారణాల వల్లనే, ఇలా వర్షాలు, తుపాన్లు, వరదలు వచ్చినప్పుడల్లా పాట్లు పెరుగుతున్నాయి తప్ప,  తరగడం లేదు. అది హైదరాబాద్ మహానగరమైనా… ఆంధ్రప్రదేశ్ లోని ఊర్లయినా తీరు ఒకటే. అవే కష్టాలు, అవే కన్నీళ్లు. ముంబయి, చెన్నై, హైదరాబాద్, విజయవాడ అన్ని చోట్ల ఇవే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీళ్ల ప్రవాహంలో ఇళ్ళు, పొలాలు, పంటలు కొట్టుకుపోతున్నాయి. వాతావరణ శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, రవాణా, కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ప్రాణ నష్టం కొంత తగ్గింది కానీ, కష్ట నష్టాలు ఇసుమంత కూడా తగ్గక పోగా,  పెరుగుతున్నాయి.

మానవ తప్పిదాలే కారణం

దీనికి కారణాలు మానవ తప్పిదాలుగానే భావించాలి. కుంటలు, చెరువులు,బావులు, తోటలు, లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టడం,  ఇబ్బడిముబ్బడిగా ఆవాసాలు పెరగడం వల్ల ఈ కష్టాలు ఎదురవుతున్నాయి.  వీటన్నింటినీ ఆక్రమించి, దురాక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. 10మంది నివసించాల్సిన చోట 100మంది ఉంటున్నారు. మారుతున్న పట్టణస్వరూపం,పెరుగుతున్న  జనాభాకు తగ్గట్టుగా డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చెయ్యడం లేదు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. గృహ అవసరాల పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడం మొదలైన కారణాల వల్ల జలవిలయంలో మనిషి చిక్కుకుంటున్నాడు. విద్యుత్ ఘాతాలకు గురవుతున్నాడు. కరెంట్ పోయి కటికి చీకట్లో మగ్గుతున్నాడు. తప్పెవరిది అంటే? వ్యక్తులదీ ,వ్యవస్థలదేనని  చెప్పాలి. ఆ మధ్య తెలంగాణలో మిషన్ కాకతీయ అనే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. చెరువుల పునరుద్ధరణ ఈ పథకంలోని ముఖ్యఉద్దేశ్యం. కొంతకాలం బాగానే నడిచింది. ఎందుకో మళ్ళీ ఆగిపోయింది. ఈ పథకం నిరంతరాయంగా సాగితే,  ఒకప్పటి మంచి వాతావరణం మళ్ళీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. దాని మూల్యం ఇలా వరదలు వచ్చినప్పుడల్లా అనుభవిస్తున్నారు.

ప్రభుత్వాలకు స్పష్టత ఉండాలి

ఏ ప్రాంతంలో నిర్మాణాలు ఎలా ఉండాలి అన్న విషయంలో ప్రభుత్వాలకు స్పష్టత పెరగాలి. ఎంత స్థలంలో ఇండిపెండెంట్ ఇళ్ళు ఉండాలి, ఎక్కడ అపార్ట్మెంట్లు నిర్మాణం చేపట్టాలి  అనే అంశాల్లో  ప్రామాణికత ఇంకా పాటించాల్సిన అవసరం ఉంది. అడ్డగోలుగా అనుమతులు ఇవ్వకుండా ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఆదాయం అవసరమే. అదే సమయంలో,  భవిష్యత్తు ప్రణాళిక అంతకంటే ముఖ్యం. ప్రణాళికా  విధానాల్లో సమూలమైన మార్పులు రావాలి. డ్రైనేజి వ్యవస్థ పెరగాలి. కుంటలు, చెరువులు, బావులు, తోటలు, లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వకూడదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్రమనిర్మాణాలు చాలా వున్నాయి.వాటిపై దృష్టి సారించి కఠినమైన  చర్యలు చేపట్టాలి. అకాల ప్రకృతి వైపరీత్యాలకు భూతాపం పెరుగుతూ ఉండడం ఒక కారణం. పర్యావరణ సమతుల్యతలు పాటిస్తే తప్ప ఈ విపత్తులు తగ్గుముఖం పట్టవు. ప్రపంచంలో భారీ  విపత్తులకు గురవుతున్న దేశాలలో చైనా, అమెరికా తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయి.ప్రకృతి వైపరీత్యాల్లో వరదలది  44శాతంగా గణాంకాలు సూచిస్తున్నాయి.

ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ

భీభత్సమైన వరదల ప్రభావంలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుపానుల నుండి రక్షించే శక్తి మడ అడవులకు ఉంది. అవి అంతరించి పోతున్నాయి. భారతదేశంలో మడ అడవులు విశాఖపట్నం, కాకినాడ  ప్రాంతాల్లో  ఎక్కువగా ఉండేవి. ఎర్రమట్టి దిబ్బలు కూడా ప్రకృతి వైపరీత్యాలకు రక్షణ కవచాలుగా నిలుస్తాయి. సునామీ వంటి భీభత్సాల  నుండి ముప్పు తగ్గించడంలో మడఅడవుల పాత్ర చాలా విశిష్టమైంది. మానవ వనరులు ఒక్కటే పెరిగితే సరిపోదు. సహజ వనరులు పెరగాలి. ముందుగా వీటిని కాపాడుకోవాలి. ఏ గ్రామం, పట్టణం,నగరం, మహానగరం అభివృద్ధి పరచినా ప్రణాళికా  బద్ధంగా సాగాలి. ఎప్పుడో! సింధూ నాగరికత దశలోనే డ్రైనేజీ, నగర నిర్మాణం ఎంతో ప్రణాళికాబద్ధంగా జరిగాయని చరిత్ర పుస్తకాల్లో చదువుతున్నాం. నిన్న మొన్నటి నిజాం కూడా శాస్త్రీయమైన పద్ధతిలోనే నిర్మాణాలు చేపట్టారు. ప్రపంచంలో న్యూయార్క్, వాషింగ్ టన్ గొప్ప ప్రణాళికా నగరాలుగా చెబుతారు. భారతదేశంలో ఈ మధ్యనే ఏర్పడిన చండీగఢ్ కూడా నిర్మాణంలో ప్రామాణికతలు పాటించిన ప్రణాళికా బద్ధమైన నగరంగా అభివర్ణిస్తారు. నేటి అవసరాలు, భవిష్యత్ కష్టాలు బేరీజువేసుకుంటూ,  శాస్త్రీయమార్గంలో జాగ్రత్తలు తీసుకుంటూ,  అభివృద్ధి జరిగినప్పుడు, కనీసం భావితరాలవారికైనా ఈ కష్టనష్టాలు  రాకుండా ఉంటాయి. ప్రపంచంలో  ఉత్తమమైన పథకాలు, పద్ధతులను  అనుసరించిన నగరాలు , రాష్ట్రాలు, దేశాలను సందర్శించి, పరిశీలించి వాటిని ఆదర్శంగా తీసుకొని మన ప్రభుత్వాలు ముందుకు సాగాలి.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles