Tuesday, January 21, 2025

ఆధునిక తెలుగు కవిత్వ పోకడలు

సుమారు1850 నుండి నేటి వరకు ఉన్న కవిత్వాన్ని ఆధునిక కవిత్వంగా భావిస్తాము. కందుకూరి విరేశలింగం, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావులతో  తెలుగులో ఆధునిక కవిత్వం ప్రారంభమైంది. ఆధునిక కవిత్వంలో మూడు ముఖ్య ధోరణులు కనిపిస్తాయి. మొదటిది భావకవిత్వం. రెండవది అభ్యుదయ కవిత్వం. మూడవది సాంప్రదాయ కవితా పునరుజ్జీవనo (Neo-classical Poetry).

అంతకు ముందు తరాల వారు రాసిన రాజుల ప్రణయ లీలలు, విజయ గాధల కంటే భిన్నంగా ఆలోచించ వలసిన సామాజిక పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రపంచ వ్యాప్తoగా. 18వ శతాబ్దపు పారిశ్రామిక విప్లవం కారణంగా అనేక యంత్ర పరికారాలు ఉపయోగంలోకి వచ్చాయి. ఆ కారణంగా శారీరక శ్రమ తగ్గడమే కాకుండా చాలా తీరిక దొరికింది జనానికి. తీరిక సమయాన్ని గడపడానికి పుస్తకాలు చదవడం మంచి వ్యాపకంగా మారింది. పండితులు, విద్యాధికులే కాకుండా సామాన్య జనం చడవడానికి వీలుగా భాషలో మార్పు రావలసిన పరిస్థితి ఏర్పడింది.

శిష్టవ్యవహారికం

ఛందస్సు, అలంకారాలు, కఠిన పద ప్రయోగాలు వదలి సామన్యుడి భాషలో వచనంలో రాయవలసి వచ్చింది. పద్యనాటకాలు గద్య నాటకాలుగా మారాయి. ఇక్కడ తెలుగు వారికే ప్రత్యేకమైన మరో సమస్య ఎదురైంది. పండితులు గ్రాంధిక భాషలో రాసేవారు. అది అందరికి అర్థం కాదు.  వ్యవహారిక భాషలో రాస్తే సంస్కృతాన్ని గౌరవించే  మనః స్థితిలొ ఉన్న మన  విద్యాధికులకు నచ్చదు. కాబట్టి మధ్యే మార్గంగా శిష్టవ్యవహారికమనే తెలుగు రూపాంతరాన్ని తయారు చేసుకున్నాం, పండితులు, గ్రామీణులు కాకుండా కాస్త చదువుకున్నవారు వాడే భాషను ప్రామాణికంగా చేసుకున్నాo అందరికీ ఆమోద యోగ్యంగా ఉండడానికి. ఆంధ్ర, తెలంగాణా మాండలికాలే కాకుండా జిల్లాకొక తీరుగా ఉన్న తెలుగుకు ఓ ప్రామాణికత ఏర్పడింది. ఈ వ్యవహారిక భాషా వాదాన్ని ముందుకు తెచ్చి తెలుగులో మార్పుకు ముఖ్య కారకులు గిడుగు రామమూర్తి పంతులు, గురజాడ అప్పారావు, రాళ్ళపల్లి అంత కృష్ణ శర్మ. గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు ఈ సులభ తెలుగును తమ కవిత్వంలో ఉపయోగించారు. పత్రికలు, సినిమాలు ఈ తెలుగును వాడడంద్వారా దీనికి ప్రచారం లభించింది.

భావకవిత్వం అంటే?

భావ కవిత్వం అంటే లాక్షణికులు నిర్దేశించిన నియమాలను పక్కనపెట్టి మదిలో మెదిలే మధుర  భావనలను మనసుకు హాయి కలిగేటట్టు వ్యక్తీకరించండం. మొదట్లో దీనికి అంత గౌరవం ఉండేది కాదు. ఓ పాత సినిమా పాటలో “భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్” అనేది ఒక చరణం. తొలినాళ్ళలో పరిహాసానికి గురైనా పోనుపోను కావ్య గౌరవాన్ని సంతరించుకుంది భావ కవిత్వం. భావాల్లోని మాధుర్యంతొపాటు వీరు వాడిన వాడుక భాష వీరికి జనం మనసుల్లో స్థానం కల్పించింది. హృదయానుగత భావ వ్యక్తీకరణ, ప్రకృతి అందాలను వర్ణించడం, మాన్యులనే కాకుండా సామాన్యులను కవితా వస్తువుగా వాడుకోవడం భావ కవిత్వపు ప్రధాన లక్షణాలు. దువ్వూరి రామిరెడ్డి “కృషీవలుడు” ప్రబంధ కాలంలో ఊహించలేని విషయం. దేవులపల్లి “ఊర్వశి” ఊహాలోకంలోని ఓ అద్భుత సృష్టి. వాస్తవ జీవితానికి సంబంధం లేకపోయినా అందమయిన ఊహాలోకాల్లో, మబ్బుల్లో, కొండల్లో, సెలయేళ్లలొ, పడవ ప్రయాణాల్లో అందాలను ఆనందాలను వెతుక్కుని తృప్తిపడ్డవాళ్ళు భావకవులు. ఆంగ్ల సాహిత్యంలో 1798 నుండి 1930 దాక సాగిన భావ కవిత్వాన్ని  తెలుగులో చాలా కాలం కొనసాగించారు రాయప్రోలు సుబ్బారావు.

అమలిన శృంగారం

‘అమలిన శృంగారం’ (Platonic Love) అనే భావనను తెలుగులో ప్రవేశ పెట్టారు. భావకవిత్వానికి హిమాలయoలా నిలిచారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి. “ఆమె కన్నులలో ననంతాంబరoపు నీలి నీడలు కలవు” అంటూ మనల్ని తన ఊహాలోకాల్లోకి తీసుకెళ్ళి పోతారు. ఆమె కళ్ళు ఆయనకు “భావ గీతాలు”. “సాము సడలిన పతి పరిష్వంగమందు సుఖము దుఖములేని సుషుప్తిలోన” తన్ను తాను మరచి పోతారు. నండూరి సుబ్బారావు ఎంకి పాటలు జానపదుల మనసులనే కాక రసజ్ఞుల హృదయాలను ఊయలలూగించాయి. “ఎంకివంటి పిల్ల లేదోయ్ లేదోయ్” అంటూ ఆమె “కళ్ళెత్తితే కనకాభిషేకాలు” జరిగినంత సంబర పడిపోతాడు నాయుడు బావ. జంద్యాల పాపయ్య శాస్త్రి “పుష్పవిలాపం” ఎలాంటి మనిషినైనా పూలు కోయడానికి సందేహించేటట్లు చేస్తుంది. పూలు కోయబోతే “మా ప్రాణములు దీతువా అంటూ బావురు మన్న”వట పూలు. నoడూరి, జంధ్యాల కవిత్వం భావుకతకు మైలురాళ్ళు.

సామాజిక దృక్పథం జోడింపు

భావుకత్వానికి సామాజిక దృక్పధం జోడించారు గురజాడలాంటి వారు. బ్రిటీషువారి ఏలుబడిలో భారత దేశంలో స్వాతంత్ర్య భావాలు పెల్లుబుకుతున్న వేళ, బెంగాలీ భాషలో రవీoద్రునిలాంటి కవుల ప్రభావం దేశమంతా వ్యాపిస్తున్న వేళ, గాంధి నాయకత్వంలో దేశమంతా ఒక్కటై స్వాతంత్ర్య గీతిక పాడే వేళ తెలుగులోనూ ఆ భావ వీచికలు బలంగా నిలిచాయి. “యే దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అన్నారు రాయప్రోలు. “దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్” అoటూ తెలుగు జాతిని జాగృతం చేసారు  గురజాడ. జానపదులు వాడే మాత్రా ఛందస్సు ఉపయోగించి రాసారు  “ముత్యాల సరాలు”. కులాలు, మతాలకి అతీతంగా “ఎంచి చూడ రెండే కులములు, మంచి అన్నది మాల అయిన మాలనే నౌదున్” అన్న మహోన్నత మానవతా వాది. రోమాంచం కలిగించే కృష్ణ శాస్త్రి  “జయ జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి” శంకరంబాడి రాసిన “మా తెలుగు తల్లికి మల్లెపూదండ“ కలకాలం నిలిచి ఉండే కవనాలు.

దైవభక్తి కూడా కాల్పనికోద్యమంలో భాగంగా కొనసాగించారు తిరుపతి వెంకట కవులు. వీరి “పాండవోద్యోగ విజయాలు” అత్యంత ప్రజాదరణ పొందినవి. “చెల్లియొ చెల్లకొ తమకు జేసినయెగ్గులు సైచిరందరున్” విని ఆనందించని వారుండరు. పౌరాణిక రచనలోనూ శిష్టవ్యవహారిక భాషను వాడడం కన్పిస్తుందిక్కడ.

ఆలోచనలో మార్పు తెచ్చిన పరిణామాలు

భావ కవుల నేల విడచిన సామును, దేశభక్తిని , దైవభక్తిని ఇష్ట పడని కొందరు కవిత్వానికి సామాజిక లక్ష్యం ఉండాలంటూ ఒక కొత్త ఉద్యమాన్ని లేవదీశారు. భావ, భక్తి కవిత్వాలను ఈసడించారు. ప్రయోజనం లేని సాహిత్యంగా భావించారు. 1931 నుండి 1945 వరకు జరిగిన రెండో ప్రపంచ యుద్ధం, 1931 లొ లక్షలాది మందిని బలిగొన్న బెంగాల్లో కరవు, 1946 లో తెలంగాణా పోరాటం జనాన్ని సమాజం గురించి, రాజకీయాల గురించి అలోచించేటట్లుగా చేశాయి. ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన బృందానికి నాయకత్వం వహించిన వాడు శ్రీరంగం శ్రీనివాస రావు (శ్రీశ్రీ). ఈయనను ఒక యుగకర్తగా భావిస్తారు కమ్యూనిజంతో ప్రభావితమయిన వాళ్ళు. ఆంగ్ల సాహిత్యంలో టీఎస్ ఇలియట్ వాడిన అధివాస్తవికతను ఆలంబన చేసుకొని తెలుగు సాహిత్యంలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు.

పదాలను బాణాలుగా ప్రయోగించిన శ్రీశ్రీ

పేదప్రజల కస్టాలు చూసిన భావావేశంతో వాడి వేడి పదాలను బాణాలుగా మార్చి ప్రయోగించిన దిట్ట. “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను” అంటూ మార్గదర్శనం చేస్తారు తన అనుయాయులకు. “నరజాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం” అనిపిస్తుంది ఈయనకు. లయబద్దంగా పరుగెత్తే పదాలు చదువరిలో రక్తం మరిగించేoత శక్తిమంతాలు. “పతితులార, భ్రష్టులార, బాధా సర్ప దష్టులార, దగా పడిన తమ్ములార ఏడవకం డేడవకండి” అని పదాలను పునరుచ్చరించే ప్రక్రియతో మనలో ఆవేశాన్ని పెంచేస్తారు. చదివినప్పటికంటే విన్నప్పుడు వీటి ప్రభావం రెండితలవుతుంది. “పదండి ముందుకు, పదండి త్రోసుకు పోదాం పైపైకి” అంటూ మనల్ని తమ భావజాలం వైపు నెట్టేస్తాయి ఆ పదాలు.

అభ్యుదయం శ్రుతి మించితే విప్లవ కవిత్వం

స్వాతత్ర్యోద్యమాన్ని పట్టించుకోని కొంతమంది, కమ్మూనిస్ట్ సిద్ధాంతంతో ప్రభావితులై తాడిత పీడిత ప్రజలకోసం అంటూ శ్రీశ్రీ బాట పట్టారు. కవిత్వమంటే ఇలాగే రాయాలనిపించేoత ప్రభావo కలిగించింది యువతరంలో ఈ తరహా కవిత్వం, దీన్ని అభ్యుదయ కవిత్వ మన్నారు.  కొంచెం  శ్రుతి మించినపుడు ఇది విప్లవ కవిత్వంగా పేరు సంపాదించుకుంది. ఆవేశం కట్టలు దాటినపుడు దిగంబర కవిత్వం అనిపించుకుంది. దిగంబర కవులు సామాజిక మర్యాదలు పాటించని భాషను వాడి సమాజానికి షాక్ ఇచ్చే ప్రయత్నం చేసారు. పరిధులు దాటి జుగుప్సాకరమయిన భావాలను కవిత్వంలో నింపడం కొంతమందికి వీరిపై అయిష్టత కలిగించింది.

దిగంబర కవులు క్రమేణా విప్లవ కవుల్లో కలిసి పోయారు. అలా కలిసిన మరో వర్గం దళిత కవులు. గుర్రం జాషువా లాంటి కొంతమంది కవులు సమాజంలో దళితులకు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని, అంటరాని తనాన్ని వ్యతిరేకిస్తూ కవిత్వం రాశారు. కాళిదాసు రాసిన “మేఘదూతా”న్ని అనుసరిస్తూ ఈయన గబ్బిలంతో తన గోడు చెప్పుకుంటారు. మహాత్ముడు చనిపోయిన సందర్భంలో బాధపడుతూ ఈయన రాసిన “బాపూజీ” కనువిప్పు కలిగించే కవిత.  

కొంతమంది ముస్లింలు తమకూ ప్రత్యెక సమస్యలున్నాయంటూ ఒక వర్గంగా ఏర్పడి రచనలు సాగించారు. వీరిలో “చెట్టు కవి” గా  ప్రసిద్ధుడైన ఇస్మాయిల్ హైకూలనే కొత్త రకం పద్యాలతొ రంజింప జేశారు.

చలంను అరుణాచలం పంపిన ఆంధ్రులు

కృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ, విశ్వనాధ సత్యనారాయణల సరసన సమున్నత స్థానానికి సరితూగేవాడు గుడిపాటి వెంకట చలం. తెలుగులో కందుకూరి, గురజాడలాంటివారు సాంఘీక దురాచారాలైన సతీసహగమనం, కన్యా శుల్కం, బాల్య వివాహాలు, విధవా వివాహాలు వాటి విషయాలపై సమాజాన్ని జాగృతం చేస్తుంటే చలం స్త్రీ స్వాతంత్ర్యోద్యమానికి ఆద్యుడై బాట వేశాడు. ఈయనకూడా అధివాస్తవికతను అస్త్రంలా ప్రయోగించారు. కాని ఆనాటి సమాజం దాన్ని అర్దం చేసుకోక దాన్ని బూతు సాహిత్యంకింద జమ కట్టేసింది. అధివాస్తవికతను వాడిన శ్రీశ్రీని యుగ కర్తగా గౌరవించిన సమాజం చలాన్ని ఆంధ్ర దేశం వదలి అరుణాచలం చేరేలా చేసింది, ఆయన వేసిన బాటలో అనేకమంది రచయిత్రులు బయలుదేరారు. వారిలో ‘వోల్గా’ గుర్తింపు తెచ్చుకున్న రచయిత్రి.

తిరుగుబాటు ధోరణిలో సమాజాన్ని విమర్సిస్తూ రాసినవారి రచనలపై తమ అయిష్టం వ్యక్తపరుస్తూ వీరి పంధాను వ్యతిరేకిస్తూ ప్రాచీన పద్దతులను, సంస్కారాలను, జీవితపు విలువలను పునరుజ్జీవింప జేశారు దేవరకొండ బాల గంగాధర తిలక్ లాంటి వాళ్ళు. అనుభూతి ప్రధానంగా వీరు చేసిన రచనలు “అనుభూతి కవిత్వం” గా పేరు పొందాయి. “నా కవిత్వం కాదొక తత్వం” అంటూ “నా అక్షరాలూ వెన్నెలలో ఆడుకునే ఆడపిల్లలు” అని విప్లవ కవిత్వానికి సుదూరంగా తీసుకెళ్ళారు కవిత్వాన్ని. విశ్వనాధ సత్యనారాయణ చందోబద్ధ కవితత్వంతో పాటు వచన కవిత్వంకూడా రాసి తన కత్తికి రెండు వైపులా పదునుందని చూపించారు. ఇటీవలి కాలంలో అత్యంత గౌరవ ప్రతిష్టలు పొందిన కవి విశ్వనాధ. రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు, కిన్నెరసాని పాటలు ఆయనను ‘కవి సామ్రాట్’గా చేశాయి.

ఆధునిక కవుల అంతర్మథనం

ఇరవయ శతాబ్దంలో చాలా మార్పు వచ్చింది కవిత్వంలో. ఇదివరకటి కవులు బాహ్య దృష్టితో ప్రకృతి అందాన్ని, ప్రేమను, సంఘటనలను వర్ణించేవారు. కాని ఆధునిక కవులు అంతర్ముఖులు. కనుపించేదాని వెనుక ఉండేదాన్ని గురించి ఆలోచిస్తారు. వారి కవిత్వంలో అoతర్మధనం ప్రధాన లక్షణంగా కనుపిస్తుంది. పరిసరాలను మనసారా ఆనందించడం కాకుండా ఆలోచన, మానసిక విశ్లేషణ ఎక్కువగా ఉంటాయి.  కొంత అసంతృప్తి, అన్నిటిమీద అపనమ్మకం, నిరాశావాదం, అభద్రతా భావం, ప్రపంచీకరణ ప్రభావంతో ప్రాంతీయ తత్వాన్ని తగ్గించుకోవడం, ఆదర్శ ప్రాయంగా, నైతికంగా ఉండాలనే కోరిక పెద్దగా లేకపోవడం, పురాణేతిహాసాలను, చరిత్రను తమ సిద్ధాంతాల కనుగుణంగా మార్చి రాయడం (రామాయణ విష వృక్షం లాంటివి) ఆధునిక కవిత్వంలో ముఖ్య విషయాలు.  

ఆంగ్ల సాహిత్యంతో సామీప్యాన్ని పెంచుకొన్న గుంటూరు శేషేంద్ర శర్మ అత్యంత ఆధునికుడని చప్పాల్సి ఉంటుoది.  తెలుగు కవిత్వాన్ని ప్రపంచపటంపై నిలిపిన గొప్ప కవి, విమర్శకులు శేషేంద్ర శర్మ. “నా దేశం నా ప్రజలు” ఆయన ప్రముఖ రచన. ఆధునిక మానవ జీవితంలోని క్లిష్టతను వివరించే  ఈయన కవిత్వం చాల నర్మగర్భంగా ఉంటుంది. ఏదీ పైకి కనుపించినట్లుగా ఉండదు. లోతయిన గంభీర భావనలు, నేరుగా కాకుండా సంకేతాలు, ప్రతీకలు ఉపయోగించి వ్యక్తీకరిస్తారు. పోలికలు కూడా సాంప్రదాయ రీతిలో కాకుండా అపూర్వంగా ఉంటాయి. ఆత్మగత కవిత్వం అర్థం చేసుకోవడం కొంత కష్టమయినా కష్టానికి తగిన రసాస్వాదన చేస్తాడు పాఠకుడు.

విప్లవ కవిత్వాన్ని పక్కకు నెట్టి పూర్వపు కవితా ధోరణిని పునరుజ్జీవింప జేసిన తిలక్, విశ్వనాధ, శేషేంద్రలాంటి వారిని నియోక్లాసికల్ కవులన్నారు.

మరొకరి రచన ఆధారంగా వ్యంగాన్ని, హాస్యాన్ని జోడించి రాసేది పేరడీ. ఇదీ ఒక కవితా ధోరణి.

వెంకటగిరి రాజకుటుంబానికి  చెందిన సాయిక్రిష్ణ యాచేంద్ర “గేయధార” ఒక సాటిలేని వినూత్న ప్రక్రియ. ఆశు కవిత్వం, అవధానం, గేయ రచన, సంగీతం కూర్చడం, రాగ తాళాలతో పాడడం అన్ని కలగలిపిన ఈ గేయధార ఒక అపూర్వ సమ్మేళనం.

కలకాలం నిలిచే ధోరణులు

ఒకసారి వెనక్కితిరిగి చూసుకుంటే ఛందోబద్ధ కవిత్వం, చిత్ర కవిత్వం, అవధానాలనుండి వచన కవిత్వం వైపుకు, సంస్కృత మయమైన గ్రాoధిక భాషనుండి జనం మెచ్చే శిష్టవ్యవహారిక భాష వైపుకు, లాక్షణికుల నిర్దేశాలనుండి అనుభూతి కవిత్వం వైపుకు, అలంకారాలు వదలి ప్రతీకలు, సంకేతాల వైపుకు, బాహ్య విషయాలనుంచి అంతరంగ భావనలవైపుకు కవిత్వ ప్రయాణం స్పష్టంగా కనుపిస్తుంది. కాల్పనిక, అభ్యుదయ కవిత్వాల ప్రభావం ప్రస్తుతానికి తగ్గినా అన్ని ధోరణులు కలకాలం నిలిచే కవితా పటిమ కలిగినవే. మరపురానివే. కాకపోతే దేశ కాల పరిస్థితులను బట్టి ఆలోచనలు పంధాలు మారిపోతున్నా ఎప్పటికి మారని మానవతా విలువలు కవిత్వానికి ప్రేరణగా ఉంటూనే ఉంటాయి.

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

4 COMMENTS

  1. తెలుగు సాహిత్య ప్రియులకి నచ్చే మెచ్చే విధంగా రాసిన మీకు నా అభినందనలు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్ష లో తెలుగు సాహిత్యం ఒక ఆప్షనల్ గా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తే మరింత మంది సాహితీ ప్రియులకి, విద్యార్థులకు ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.
    ధన్యవాదములు

  2. వ్యాసం బాగుంది.అభినందనలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles