Thursday, November 21, 2024

రఘురామకృష్ణంరాజు అరెస్టు, రాద్ధాంతం అవసరమా?

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజును అరెస్టు చేయడం అనవసరం. ఆయన మీద రాజద్రోహం నేరం మోపడం కూడా దుందుడుకుతనమే. రఘురామకృష్ణంరాజు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించీ, ఆయన పార్టీ గురించీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న మాట వాస్తవమే. ప్రభుత్వం పట్ల ప్రజలలో అసంతృప్తి రగిలించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణ కూడా సమంజసమైనదే కావచ్చు.  అందుకు ఆయన పైన కోర్టులో కేసు పెట్టవచ్చు. వాదించి ఆయన నేరాన్ని  నిరూపించవచ్చు.  కేవలం మాటలకే పరిమితమైన నేరానికి ఎవరినైనా అరెస్టు చేయడం, జైలుకు పంపడం అతి అనిపించుకుంటుంది. అధికార దుర్వినియోగం అవుతుంది. దీనిని రాజకీయ కక్షపూరిత చర్య అని అభివర్ణిస్తే తప్పు కాబోదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం, అనేక ఇతర రాష్ట్రప్రభుత్వాలు కూడా ఈ విధంగానే వ్యవహరిస్తున్నాయి. ఒకసారి ఎన్నికలు జరిగి మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము ఏమి చేసినా చెల్లుతుందనీ, తమను ఎవ్వరూ విమర్శించకూడదనీ, విమర్శకులు రాజద్రోహులనీ, దేశద్రోహులనీ తేల్చే చట్టాలు మన పార్లమెంటు చేసింది. దాని పర్యవసానమే నేటి పరిణామాలు.

రఘురామకృష్ణం రాజు టీవీ5, ఏబీఎన్ చానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చేసిన ఆరోపణలు అన్యాయమైనవని ప్రభుత్వం భావిస్తే ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) 153-ఏ, 505 సెక్షన్ల కింద కేసుపెట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రమేయంతో హిందువులను క్రైస్తవులుగా మార్చుతున్నారంటూ లోక్ సభ సభ్యుడు చేసిన ఆరోపణను తిప్పికొట్టడానికి ఈ సెక్షన్లు సరిపోతాయి. ఏడేళ్ళ కంటే తక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులలో వ్యక్తులను అరెస్టు చేయడం అనవసరమంటూ సుప్రీంకోర్టు లోడగ ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. ఐపీసీ 124ఏ సెక్షన్ కింద రాజద్రోహం కేసుపెట్టడం, అరెస్టు చేయడం చట్టం ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేయడమే. పైగా ఒక పార్లమెంటు సభ్యుడిని అతడి పుట్టినరోజు నాడు హైదరాబాద్ వెళ్ళి ముప్పయ్ మంది పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకొని రండువందల యాభై కిలోమీటర్ల  దూరంలో ఉన్న గుంటూరుకు తీసుకొని వెళ్ళడం విచారణకు ముందుగానే శిక్షించినట్టుగానే భావించాలి.

తనపైన హత్యాప్రయత్నం జరుగుతున్నదనీ, తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రక్షణ కావాలని రాజు అడగడం, రక్షణ పొందడంలో ప్రాణభయం కంటే రాజకీయమే ఎక్కువ ఉండవచ్చు. కానీ ఒక పార్లమెంటు సభ్యుడ రక్షణ కోరినప్పుడు మంజూరు చేయడం ప్రభుత్వం బాధ్యత.  సీఐడీ కస్టడీలో తనను కొట్టారని ఆయన చేసిన ఆరోపణపైన ఆంధ్రప్రదేశ్ లో విచారణ సవ్యంగా జరగదని సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిట్గీ సోమవారం చేసిన వాదనను న్యాయస్థానం మన్నించి సికిందరాబాద్ లోని సైనిక ఆసుపత్రిలో విచారణ జరిపించాలనీ, నిజంగా ఆయనను కొట్టారో లేదో తేల్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించడం సమంజసమైన నిర్ణయం. పార్టీలవారీగా, కులాలవారీగా చీలిపోయిన ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పడం కష్టం. ఏ నాయకకుడు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో తేల్చడం కూడా సాధ్యం కాదు. ఈ విధంగా సమాజం చీలిపోవడం దురదృష్టకరమైన పరిణామం. ఇటువంటి వాతావరణంలో రెండు మీడియా సంస్థలపైన కూడా  సీఐడీ (అంటే ప్రభుత్వం) కేసు పెట్టడం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల తీరుతెన్నులకు నిదర్శనం.

చట్టపరంగా ఏమి జరగాలో అది జరుగుతుంది. రెండు రోజులలోనే కేసు సీఐడీ కోర్టు నుంచి సుప్రీంకోర్టుకు చేరిందంటే రాజు ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు కావడమే కాకుండా హంగూఆర్భాటం కలిగిన రాజకీయ నాయకుడు కూడా కావడం కారణం.

రాజద్రోహం నేరం ఆపాదించి కేసులు పెట్టడం చాలా రాష్ట్రప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ముందున్నది.  బ్రిటిష్ వలస ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని, స్వాతంత్ర్య సమరయోధుల నోళ్ళు మూయించేందుకు తెచ్చిన ఈ శాసనాన్ని స్వాతంత్ర్యం వచ్చిన 73 సంవత్సరాల తర్వాత కూడా వినియోగించడం, బాధ్యతారహితంగా రాజకీయ ప్రత్యర్థులపైన, పాలకపక్షం  భావజాలాన్ని వ్యతిరేకించేవారిపైనా, అధికారంలో ఉన్నవారిని నోటిమాటతో  విమర్శించేవారిపైనా వినియోగించడం స్వాతంత్ర్యాన్ని అపహాస్యం చేయడమే.

రఘురామకృష్ణంరాజుకు పెద్ద లాయర్లు వాదించేందుకు ఉన్నారు. న్యాయం జరుగుతుందని ఆశించే అవకాశం ఉంది. మహారాష్ట్ర జైళ్ళలో అన్యాయంగా సంవత్సరాల తరబడి మగ్గుతున్న ప్రొఫెసర్ సాయిబాబా, ప్రసిద్ధ రచయిత వరవరరావు, మరి 14 మంది సామాజికవేత్తలూ, హక్కుల నాయకుల సంగతి ఏమిటి? వారి ఆరోగ్యాలు దెబ్బతిన్నా, వారిపైన నేరాభియోగం కూడా చేయకుండా జైళ్ళలో ఉంచుతున్నారు. పైన పేర్కొన్న బ్రిటిష్ కాలంనాటి చట్టాన్ని రద్దు చేయాలని స్వాతంత్ర్యపిపాసులందరూ కోరుతున్నారు. ఆ పని చేయకపోగా ప్రతిప్రభుత్వం ఆ చట్టం కోరలకు పదును పెడుతూ వచ్చింది. నరేంద్రమోదీ ప్రభుత్వం ఇతర అన్ని ప్రభుత్వాలకంటే అన్యాయంగా వ్యవహరిస్తున్నది. తన నిర్ణయాలను వ్యతిరేకించేవారిపైనా, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసేవారిపైనా ఈ సెక్షన్ కింద కేసులు పెట్టి విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైళ్ళలో కుక్కి మగ్గపెడుతున్నది. ఇందులో మానవీయ కోణం లేదు. న్యాయస్థానాలు ప్రశ్నించడం లేదు. కనికరం కూడా ప్రదర్శించడం లేదు.

జస్టిస్ ఎన్ వి రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులలో హక్కుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తున్నది. కొన్ని రకాల ఖైదీలను విడుదల చేయమని కూడా కోర్టు ఆదేశించింది. సర్వోన్నత స్థానంలో జరిగే వాదప్రతివాదనలను లైవ్ లో ప్రత్యక్షప్రసారం చేయాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందంటున్నారు. మంచిదే. అదే విధంగా కోరేగాం కేసులో జైళ్ళలో మగ్గుతున్న వృద్దమేధావులనూ, కవులనూ, సామాజికకార్యకర్తలనూ విడిపించడానికి జస్టిస్ రమణ పూనుకుంటే ప్రజాస్వామ్య ప్రియులందరూ సంతోషిస్తారు. అత్యున్నత న్యాయస్థానం ప్రతిష్ఠ పెరుగుతుంది. హైకోర్టులకూ, జిల్లా కోర్టులకూ ధైర్యం వస్తుంది. ప్రేరణ  అందుతుంది. వేలమందికి న్యాయం జరిగే అవకాశం ఏర్పడుతుంది. రఘురామకృష్ణం రాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి బెయిలు రద్దు చేయమంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయంగా పోరాటం చేస్తున్నారు. ఆయనపైన ఆగ్రహించడంలో అర్థం ఉన్నది. సాయిబాబా, వరవరరావు వంటి మేధావులు ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శిస్తూ, ప్రధాని మంత్రిపైన కానీ ముఖ్యమంత్రులపైన కానీ వ్యక్తిగతంగా దూషణలో కూడిన దాడి చేస్తూ ప్రకటనలు ఇచ్చిన సందర్భంగానీ, ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టిన ఉదంతం కానీ లేదు. అదికారపార్టీ భావజాలానికి వ్యతిరేకమైన భావజాలాన్ని విశ్వసిస్తున్నారనీ, వ్యాప్తి చేస్తున్నారనే కారణంపైన వారిని జైళ్ళలో సంవత్సరాల తరబడి ఉంచడం అప్రజాస్వామికం.

చట్టమే లోపభూయిష్టంగా ఉన్న సందర్భంలో, చట్టమే ప్రజావ్యతిరేక స్వభావం కలిగినప్పుడు న్యాయస్థానాలు కూడా ఏమీ చేయజాలవు. ఉపా (అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) అటువంటి చట్టాలలో అగ్రగణ్యమైనది. ఆ చట్టం రాజ్యాంగంలో ఉన్నంతవరకూ న్యాయస్థానాలు దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోజాలవు. అటువంటి ప్రజాసామ్య వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం ఒక్కటే మార్గం. రద్దు చేయాలని కోరడం, అందుకోసం ప్రదర్శనలు చేయడం కూడా రాజద్రోహంగా పరిగణించేవాతావరణం ఉండడం ప్రజాస్వామ్యస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ఈ వాతావరణాన్ని వ్యతిరేకించి పోరాడవలసిన బాధ్యత ఈ దేశ పౌరులపైన ఉన్నది.

Also read: మీడియా అందుబాటులోకి ఎస్ సి ప్రత్యేక యాప్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles